Atchannaidu: ప్రభుత్వ వెబ్‌సైట్లలో జగన్‌ చిత్రాలు తొలగించాలి: అచ్చెన్నాయుడు

ప్రభుత్వ శాఖల వైబ్‌సైట్లలో సీఎం జగన్‌, మంత్రుల చిత్రాలు తొలగించాలని కోరుతూ ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు.

Updated : 18 Mar 2024 16:37 IST

అమరావతి: ప్రభుత్వ శాఖల వైబ్‌సైట్లలో సీఎం జగన్‌, మంత్రుల చిత్రాలు తొలగించాలని కోరుతూ ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. మార్చి 16 మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి కోడ్ అమల్లోకి వచ్చిందని ఆయన తెలిపారు. ఎన్నికల నిబంధనల ప్రకారం కోడ్ అమల్లోకి వచ్చిన క్షణం నుంచి ప్రభుత్వ వెబ్ పేజీల్లో రాజకీయ పార్టీలకు చెందిన వారి ఫొటోలు ఉండరాదని పేర్కొన్నారు. నేటికీ వాటిలో ముఖ్యమంత్రి, మంత్రుల చిత్రాలు దర్శనమిస్తున్నాయని ఆరోపించారు. వీటిని తొలగించాలంటూ వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన సెక్రటరీలు, శాఖాధిపతులకు ఆదేశాలు జారీ చేయాలని లేఖలో అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

గుంటూరులో వివాదాస్పదంగా అధికారుల తీరు

గుంటూరులో ఎన్నికల కోడ్ అమలు విషయంలో అధికారులు పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని స్థానిక తెదేపా నేతలు మండిపడ్డారు. మంత్రి విడదల రజిని నగరంలోని వివిధ పార్కుల్లో వైకాపా రంగులతో సిమెంటు బెంచీలు వేయించారని, కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా అధికారులు వాటిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తెదేపా నాయకులు ఏర్పాటు చేసిన బెంచీలపై మాత్రం ప్రతాపం చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద కార్యకర్తలు, పోలీసులు కూర్చునేందుకు నారా లోకేశ్‌ సిమెంట్‌ బల్లలు వేయించగా.. అవి పసుపు రంగులో ఉన్నాయని అధికారులు వాటిని ధ్వంసం చేశారు. దీనిపై స్పందించిన ఆ పార్టీ నేతలు కోడ్‌కు అడ్డంకిగా భావిస్తే.. పసుపు రంగు బల్లలపై తెలుపు రంగు పెయింట్‌ వేస్తే సరిపోదా అని ప్రశ్నించారు. సచివాలయాలు, ఆర్బీకేలపై జగన్‌ బొమ్మ ఉన్నా పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని