Atchannaidu: ఎన్నికల కోసమే సీఎం జగన్‌ ప్రారంభోత్సవ నాటకాలు: అచ్చెన్నాయుడు

ఉద్దానం కిడ్నీ బాధితులను అన్ని విధాలుగా ఆదుకున్నది తెలుగుదేశం పార్టీయేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.

Updated : 16 Dec 2023 20:21 IST

అమరావతి: ఉద్దానం కిడ్నీ బాధితులను అన్ని విధాలుగా ఆదుకున్నది తెలుగుదేశం పార్టీయేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) తెలిపారు. ఉద్దానంలో (uddanam) కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు చంద్రబాబు (Chandrababu) ప్రభుత్వం భూమి కేటాయించడంతో పాటు పనులు కూడా మొదలుపెట్టిందని గుర్తు చేశారు. ఏడాదిలో పూర్తికావాల్సిన ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ పనులను ఇంకా పూర్తి చేయలేదన్నారు. సీఎం జగన్ ఎన్నికల కోసం ప్రారంభోత్సవ నాటకం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. ఉద్దానం కిడ్నీ రీసెర్చ్ సెంటర్ విషయంలో అంతా తానే పూర్తి చేసినట్లు సీఎం అసత్యాలు చెబుతున్నారని అచ్చెన్న మండిపడ్డారు.

‘‘తెదేపా హయాంలో 6 డయాలసిస్ సెంటర్లను ఏర్పాటు చేస్తే వాటిని కూడా నిర్వీర్యం చేసిన ఘనత జగన్ రెడ్డిది. సురక్షిత తాగునీరు ఇచ్చేందుకు గత ప్రభుత్వ హయాంలో 175 ప్లాంట్లను ఏర్పాటు చేస్తే వాటినీ నిర్వీర్యం చేశారు. రూ.700 కోట్ల విలువైన సుజల ధార ప్రాజెక్టుకు మొత్తం నిధులు వైకాపా ప్రభుత్వమే వ్యయం చేసినట్టు జగన్ వ్యవహరిస్తున్నారు. ఉద్దానంలో రోగులకు వైద్యం సరిగా అందడం లేదు. వారికి కావాల్సిన మందులు అరకొరగా అందిస్తున్నారు. కావాల్సిన మేర వైద్యులు అందుబాటులో లేరు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి రోగులకు అందుతున్న వైద్య సేవలూ అంతంతమాత్రమే. ఉద్దానం బాధితులకు చంద్రబాబు ప్రయోజనకరమైన పనులు చేశారు. కానీ జగన్ రెడ్డి కొసరు పనులతో బిల్డప్ ఇస్తున్నారు. ఎన్నికల స్టంట్లు చేస్తూ ప్రజలను మళ్లీ మోసం చేస్తున్నారు’’ అని అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని