Bandi Sanjay: ఎవరో ప్రశ్నపత్రం పంపిస్తే నాకేం సంబంధం?: బండి సంజయ్‌

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్‌ కేసును సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించే దమ్ముందా అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు. జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 

Updated : 07 Apr 2023 12:31 IST

కరీంనగర్‌: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్‌ కేసును సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించే దమ్ముందా అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు. టెన్త్‌ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో అరెస్ట్‌ ఆయన.. కరీంనగర్‌ జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 

‘‘పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం ఎవరైనా లీక్‌ చేస్తారా? ముందురోజు తెలుగు ప్రశ్నపత్రం ఎవరు లీక్‌ చేశారు? చిల్లర బుద్ధులు.. చిల్లర వ్యవహారాలు మీవే.. మావి కాదు. సీఎం కుమారుడిని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి. టీఎస్‌పీఎస్సీ పరీక్షలు రాసే అభ్యర్థులకు రూ.లక్ష సాయం చేయాలి. ఎంపీగా ఉన్న నాపట్ల పోలీసుల ప్రవర్తన దారుణంగా ఉంది. పోస్టులు, పైసల కోసమే పోలీసులు పనిచేస్తున్నారు.

నేను సిద్ధం.. సీపీ ప్రమాణం చేయగలరా?

ఎవరో ప్రశ్నపత్రం పంపిస్తే నాకేం సంబంధం?పేపర్‌ లీక్‌తో సంబంధం లేదని నా పిల్లలు, దేవుడిపై ప్రమాణం చేస్తా. నేను కుట్ర చేసినట్లు ఆరోపిస్తున్న సీపీకి ప్రమాణం చేసే దమ్ముందా?సీపీ చెప్పింది నిజమైతే తన మూడు సింహాల టోపీపై ప్రమాణం చేసి చెప్పాలి. నన్ను గంటల తరబడి వాహనాల్లో ఎందుకు తిప్పారు? లీకైన పేపర్‌ను జర్నలిస్టు షేర్‌ చేస్తే తప్పేంటి? ఎగ్జామ్‌ సెంటర్‌లోకి వెళ్లి పేపర్‌ ఎలా లీక్‌ చేస్తారు? నేను ౨వేల మందితో సెల్ఫీలు దిగుతా.. అందరితో నాకు లింకులున్నట్లేనా? నష్టపోయిన టీఎస్‌పీఎస్సీ అభ్యర్థులతో వరంగల్‌లో భారీ ర్యాలీ నిర్వహిస్తాం.

సింగరేణిలో రాష్ట్రం వాటాయే ఎక్కువ.. ప్రైవేటీకరణ ఎలా?

ఎంపీ పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరిగా లేదు. నోటీసులు ఇవ్వకుండా ఎందుకు అరెస్ట్‌ చేస్తున్నారో చెప్పకుండా ఇష్టానుసారంగా వ్యవహరించారు. ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తే మేం పిచ్చోళ్లమా? తెలంగాణ ఏం అభివృద్ధి చేశారో కేసీఆర్‌ చర్చకు రావాలి. సీపీ బాగా మాట్లాడారు.. ఆయనకు లీక్, కాపీయింగ్‌కు తేడా తెలియదు. కేసీఆర్‌ కుటుంబం కోసం పనిచేస్తారా? అనేది భారాస నేతలు ఒక్కసారి ఆలోచించుకోవాలి. మాకు జైళ్లు, లాఠీ దెబ్బలు కొత్త కాదు. యుద్ధానికి మేం సిద్ధం. సింగరేణిలో సమ్మె చేస్తామన్న భారాస నేతలకు దమ్ముందా? సింగరేణిలో ౫౧ శాతం వాటా రాష్ట్రానిది.. ౪౯ శాతం కేంద్రానికిది. అలాంటప్పుడు కేంద్రం ఎలా ప్రైవేటీకరణ చేస్తుంది? రాష్ట్రానికి మోదీ వస్తున్నారని తెలిసి రెచ్చగొట్టేందుకు కేసీఆర్‌ కుట్రలు చేస్తున్నారు. సింగరేణి కార్మికులకు అన్ని విషయాలూ తెలుసు’’ అని సంజయ్‌ అన్నారు.

ఈ కేసు విషయంలో తనకు అండగా నిలిచిన భాజపా జాతీయ నాయకత్వానికి, లీగల్‌ సెల్‌ ప్రతినిధులకు బండి సంజయ్‌ ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్‌లో ప్రధాని మోదీ సభకు పెద్ద ఎత్తున కార్యకర్తలు తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని