Eatala: సీఎం ఇచ్చిన స్లిప్పుతో మమ్మల్ని అసెంబ్లీ నుంచి బయటకు పంపారు: ఈటల

తెలంగాణ ఉద్యమంలో సీఎంతో పాటు అడుగులో అడుగు వేసిన ఉద్యమ బిడ్డ అయిన తనను కుట్రతో, దుర్మార్గపు ఆలోచనతో పార్టీ 

Updated : 17 Mar 2022 14:09 IST

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమంలో సీఎంతో పాటు అడుగులో అడుగు వేసిన ఉద్యమ బిడ్డ అయిన తనను కుట్రతో, దుర్మార్గపు ఆలోచనతో పార్టీ నుంచి బయటకు వెళ్లగొట్టారని మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అన్నారు. హుజురాబాద్‌లో తాను ఓడిపోవాలని, ప్రశ్నించే గొంతు ఆగిపోవాలని అక్రమంగా సంపాదించిన రూ.వందల కోట్లను ఖర్చు చేశారని ఆరోపించారు. శాసనసభ నుంచి తమను సస్పెండ్‌ చేసిన అంశంలో హైకోర్టు సూచనను స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తిరస్కరించడాన్ని నిరసిస్తూ భాజపా ఎమ్మెల్యేలు  ‘ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష’ చేపట్టారు. ఇందిరాపార్కులోని ధర్నా చౌక్‌ వద్ద ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు, రాజాసింగ్‌తో పాటు ఆ పార్టీ నేతలు దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడారు.

ప్రజాస్వామ్య విలువలను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లారు

‘‘ఈటల రాజేందర్‌ ఓడిపోయేలా చేయడానికి ఏం కావాలంటే అవి తీసుకోండని.. అసెంబ్లీలో ఈటల కనిపించకూడదని కేసీఆర్‌ హుకుం జారీ చేశారు. కానీ కేసీఆర్‌ అహంకారానికి, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి పోరాటం జరుగుతోందని హుజురాబాద్‌ ప్రజలు భాజపాను గెలిపించారు. ప్రజాస్వామ్య విలువలను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లారు. తెలుగు మాట్లాడే ప్రజానీకం గర్వపడేలా హుజురాబాద్‌ ప్రజలు తీర్పు ఇచ్చారు.

కేసీఆర్‌ ఆ విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి

ప్రజానీకం ఇచ్చిన తీర్పును కేసీఆర్‌ గౌరవిస్తారని భావించాను. హుజురాబాద్ ఓటమికి బాధ్యత వహిస్తూ కేసీఆర్ తన సీఎం పదవికి రాజీనామా చేయలేదు. ప్రజాస్వామ్య బద్ధంగా ప్రజలు నన్ను శాసనసభకు పంపిస్తే.. అసెంబ్లీ సమావేశాల్లో నేను పాల్గొనకుండా దుర్మార్గపు చర్యకు పాల్పడ్డారు. తెలంగాణ రాష్ట్రం అంబేడ్కర్‌ ఇచ్చిన రాజ్యాంగంతోనే సాకారమైంది. రాజ్యంగంలోని ఆర్టికల్‌- 3 లేకుంటే ఎవరు దిగొచ్చినా తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యేది కాదనే విషయాన్ని కేసీఆర్‌ గుర్తు పెట్టుకోవాలి. నియంతృత్వ పోకడలను ప్రజలు గమనిస్తున్నారు.

30 రోజులు జరగాల్సిన సమావేశాలు ఏడు రోజులే

గవర్నర్ ప్రసంగం లేకుండా అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. 30 రోజులు జరగాల్సిన సమావేశాలను ఏడు రోజులే నిర్వహించారు. మా హక్కులను కేసీఆర్ హరించారు. సీఎం ఇచ్చిన స్లిప్పుతో మమ్మల్ని సభాపతి సస్పెండ్ చేశారు. దీంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. కోర్టు ఇచ్చిన తీర్పునూ స్పీకర్ గౌరవించలేదు. భాజపాకు ఇక మిగిలింది ప్రజాక్షేత్రం మాత్రమేనని నిర్ణయించుకొని ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపట్టాం’’ అని ఈటల అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని