BRS: ఒడవని టికెట్ల ముచ్చట.. ఇంకా భారాస నేతల ప్రయత్నాలు

వచ్చే శాసనసభ ఎన్నికలకు భారాస అభ్యర్థుల మొదటి జాబితాను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ ప్రకటించే అవకాశాలున్నాయి.

Published : 21 Aug 2023 12:09 IST

హైదరాబాద్‌: వచ్చే శాసనసభ ఎన్నికలకు భారాస అభ్యర్థుల మొదటి జాబితాను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ ప్రకటించే అవకాశాలున్నాయి. పంచమి తిథి కావడంతో అభ్యర్థుల ప్రకటనకు ఇదే శుభముహూర్తంగా నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. రెండో విడత జాబితా ఈ నెల 25న విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. శాసనసభ ఎన్నికలు డిసెంబరులో జరిగే అవకాశాలుండటంతో.. కిందటిసారిలాగే కనీసం మూణ్నెల్ల ముందుగానే అభ్యర్థులను వెల్లడించాలని అధినేత కేసీఆర్‌ నిర్ణయించినట్లు తెలిసింది. 2018 ఎన్నికల సమయంలో ఒకేసారి 105 మందితో మొదటి జాబితాను ప్రకటించారు. ఈ దఫా 87 మందితో తొలి జాబితా ఉంటుందని ప్రచారం జరిగినా.. ఇంకా ఎక్కువ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో టికెట్ల కోసం ఆశావహులు ఇంకా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను హైదరాబాద్‌లోని తన నివాసంలో పలువురు నేతలు కలిశారు. కవితను కలిసిన వారిలో నేతలు రేఖా నాయక్‌, ఎన్‌.సంజయ్‌, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఎల్‌.రమణ, సునీతా లక్ష్మారెడ్డి, బొంతు రామ్మోహన్‌, చంద్రావతి, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, కొప్పుల ఈశ్వర్ ఉన్నారు. మంత్రి హరీశ్‌రావును కూడా పలువురు నేతలు కలిసినట్లు తెలుస్తోంది. ఆశావహులను కలిసిన అనంతరం మంత్రి హరీశ్‌, ఎమ్మెల్సీ కవిత ప్రగతిభవన్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేల్లో ఎంతమందికి టికెట్లు దక్కే అవకాశముంది? మొదటి జాబితాలో ఉండని నియోజకవర్గాలేమిటి? అనే చర్చ భారాస వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని