Buddhaprasad: హామీలు అమలు చేయమంటే.. ఎమ్మెల్యే దాడి చేస్తారా?: బుద్ధప్రసాద్‌

సీఎం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ ధర్నాకు దిగిన తెదేపా, జనసేన కార్యకర్తలపై వైకాపా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు తన అనుచరులతో కలిసి దాడి చేయడాన్ని మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌ ఖండించారు.

Updated : 21 Oct 2023 16:56 IST

అవనిగడ్డ: సీఎం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ ధర్నాకు దిగిన తెదేపా, జనసేన కార్యకర్తలపై వైకాపా ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు తన అనుచరులతో కలిసి దాడి చేయడాన్ని మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్‌ ఖండించారు. వివరణ ఇవ్వాల్సిన ఎమ్మెల్యే.. తాను ప్రజాప్రతినిధిని అనే విషయం మరచి, తన క్రిమినల్‌ మైండ్‌ని ఉపయోగించి దాడికి పాల్పడ్డారని విమర్శించారు. ఎమ్మెల్యే కార్యాలయం వద్ద బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందిని వెళ్లిపొమ్మని చెప్పి వ్యూహాత్మకంగా దాడికి పాల్పడ్డారన్నారు. ఎక్కడికైనా తాను ఒంటరిగా వస్తానని చెప్పే సింహాద్రి రమేష్‌బాబు.. శుక్రవారం కూడా ఒంటరిగా తన కార్యాలయం నుంచి బయటకు వెళ్లి ధర్నా చేస్తున్న వారికి సమాధానం చెప్పలేకపోయారా? అని ప్రశ్నించారు.

గతంలో బ్యాంకు లోన్‌ కట్టమని అడిగినందుకు బ్యాంకు మేనేజర్‌ని బ్యాంకు నుంచి బయటకు లాగి కొట్టిన విషయం, నాగాయలంకలో నాబార్డ్‌ ఛైర్మన్‌ ఎదుట స్థానిక ఎంపీ ప్రధాన అనుచరుడిని కొట్టిన విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. అవనిగడ్డలో బంద్‌ జరగనివ్వకుండా వీధుల్లో పోలీసు కవాతు నిర్వహించి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం సబబు కాదని మండిపడ్డారు. వ్యాపారులు స్వచ్ఛందంగా మూసివేసిన షాపులను బలవంతంగా తెరిపించడం పోలీసులకు తగదని బుద్ధప్రసాద్‌ హితవుపలికారు. నేరస్థులపై దృష్టిపెట్టాల్సిన పోలీసులు రాజకీయ నాయకులకు వత్తాసు పలుకుతూ ప్రతిపక్షాలపై దృష్టి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవనిగడ్డలో ప్రముఖ వైద్యులు డాక్టర్ కోట శ్రీహరిరావు హత్య జరిగి దాదాపు రెండేళ్లు కావస్తున్నా నేరస్థులను ఎందుకు పట్టుకోలేదని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని