Chandrababu: ఆంబోతులు బట్టలిప్పి తిరుగుతుంటే చూస్తూ ఉండాల్సి వస్తోంది: చంద్రబాబు

హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యవహారంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఓ వెధవపని చేసి బహిరంగంగా ఎవ్వరం తిరగలేమన్న ఆయన..

Published : 10 Aug 2022 01:19 IST

అమరావతి: హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ వ్యవహారంపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఓ వెధవపని చేసి బహిరంగంగా ఎవ్వరం తిరగలేమన్న ఆయన.. సిగ్గులేని వాళ్లే చేసిన తప్పులు కప్పిపుచ్చుకునేందుకు కులమతాలను అడ్డం పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. ఆంబోతులు బట్టలిప్పి తిరుగుతుంటే చూస్తూ ఉండాల్సి వస్తోందని ధ్వజమెత్తారు. తప్పు చేసిన వారిని సీఎం మందలించి, దండిస్తే మిగిలిన వాళ్లకు భయం వస్తుందన్నారు. జగన్‌రెడ్డి ఉదాసీనత వల్లే రాష్ట్రంలో అత్యాచారాలు, దాడులు, భూ కబ్జాలు పెరిగిపోతున్నాయని దుయ్యబట్టారు. సంఘ విద్రోహశక్తులు పేట్రేగిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రౌడీలే పోలీసులను చంపే పరిస్థతి రాష్ట్రంలో ఉండటం దుర్మార్గమన్నారు.

గిరిజనుల సంపదను కొల్లగొడుతున్నారు..

ముఖ్యమంత్రి జగన్‌ గిరిజనులకు గోరంత చేసి కొండంత దోచేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు మండిపడ్డారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌లో నిర్వహించిన ఆదివాసీ దినోత్సవాల్లో చంద్రబాబు పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, ఎస్టీ నేతలు, గిరిజనులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గిరిజనుల హక్కుల పరిరక్షణ కోసం ఎన్టీఆర్‌ జీవో 3 తీసుకొస్తే.. జగన్‌ ప్రభుత్వం దాన్ని కాలరాస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేటరైట్‌ పేరుతో బాక్సైట్‌ తవ్వి గిరిజన సంపదను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. గిరిజనుల కోసం తెలుగుదేశం ప్రభుత్వం అమలు చేసిన 18 సంక్షేమ కార్యక్రమాలను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక జగన్‌ ప్రభుత్వం రద్దు చేసిన అన్ని కార్యక్రమాలను పునరుద్ధరిస్తామని భరోసా ఇచ్చారు. గిరిజనుల అభివృద్ధికి కృషి చేసిన ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వమని చంద్రబాబు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని