Siddaramaiah: భాజపాకు ‘ఆపరేషన్‌’ తప్ప ఇంకేమీ తెలీదు: సిద్ధరామయ్య ఫైర్‌

అధికారం కోసం ‘ఆపరేషన్‌’ చేయడం తప్ప భాజపాకు ఏమీ తెలీదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య విమర్శించారు.

Published : 03 Feb 2024 02:13 IST

విజయపుర: అధికారంలోకి రావడానికి ‘ఆపరేషన్‌’ చేయడం తప్ప భాజపాకు ఇంకేమీ రాదని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) విమర్శించారు. శుక్రవారం ఆయన విజయపురిలో మీడియాతో మాట్లాడారు. అనేకమంది కాంగ్రెస్‌ నేతలు తమ పార్టీలో చేరతారంటూ మాజీ సీఎం జగదీశ్‌ షెట్టర్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బీవై విజయేంద్ర చేసిన వ్యాఖ్యలపై సిద్ధరామయ్య ఘాటుగా స్పందించారు. డబ్బులిచ్చి ఎమ్మెల్యేలను ఎలా కొనుగోలు చేయొచ్చో భాజపాకు బాగా తెలుసన్నారు. ‘‘ఆపరేషన్‌’ తప్ప భాజపాకు ఇంకేమీ తెలియదు. ఆపరేషన్‌కు అర్థమేంటంటే.. డబ్బులిచ్చి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం. ఓటర్ల విశ్వాసాన్ని గెలుచుకొని వాళ్లు అధికారంలోకి రాలేరు. ప్రజాప్రతినిధులకు డబ్బులు చెల్లించి వాళ్లను కొనుగోలు చేస్తారు’’ అంటూ ధ్వజమెత్తారు.

మా ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ము ఎవరికీ లేదు: సీఎం రేవంత్‌రెడ్డి

‘గతంలో బీఎస్‌ యడియూరప్ప, బసవరాజ్‌ బొమ్మైలు సీఎంలుగా ఉన్నప్పుడు భాజపా ‘ఆపరేషన్‌ కమలం’ ద్వారానే రెండు సార్లు అధికారం చేపట్టింది. కర్ణాటకలో భాజపాకు ఎప్పుడు మెజార్టీ వచ్చింది? వాళ్లకు ఏనాడైనా సంపూర్ణ ఆధిక్యం వచ్చిందా? అది 2008 కావొచ్చు.. 2013, 2018 ఎన్నికలు కావొచ్చు.. ఎన్నడూ రాలేదు. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం 2013, 2023లో సంపూర్ణ మెజార్టీ సాధించి.. ప్రజాభీష్టం మేరకు అధికారం చేపట్టింది’’ అని సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని