Himanta Biswa Sarma : కేంద్రం నుంచి రాయితీలు పొందారంటూ.. అస్సాం సీఎంపై కాంగ్రెస్‌ విమర్శల దాడి

అస్సాం (Assam) ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ (Himanta Biswa Sarma) భార్య కంపెనీ కేంద్ర ప్రభుత్వం నుంచి రుణ ఆధారిత రాయితీ పొందారని కాంగ్రెస్‌ (Congress) నేతలు ఆరోపించారు. 

Published : 14 Sep 2023 01:55 IST

ఇంటర్నెట్ డెస్క్ : అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మపై కాంగ్రెస్‌ బుధవారం విమర్శలు గుప్పించింది. ఆయన భార్య కంపెనీ భూములు కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి రుణ ఆధారిత రాయితీ పొందారని  ఆరోపిస్తూ పలువురు కాంగ్రెస్‌ నేతలు ట్వీట్‌ చేశారు. లోక్‌సభలో కాంగ్రెస్‌ డిప్యూటీ లీడర్‌ గౌరవ్‌ గొగొయ్‌ తొలుత (Gaurav Gogoi) ట్విటర్‌లో ఓ పోస్టు పెట్టారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ మంత్రిత్వశాఖ వెబ్‌సైట్ ప్రకారం.. సీఎం హిమంత బిశ్వశర్మ భార్య రినికి భుయాన్‌ శర్మ సంస్థ ప్రైడ్‌ ఈస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.10 కోట్ల మేర రుణ ఆధారిత రాయితీ పొందారని పేర్కొన్నారు. ఈ ఆరోపణలను శర్మ తోసి పుచ్చారు. ‘నా భార్య, ఆమె కంపెనీ భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక రాయితీ పొందలేదని’ ట్వీట్‌ చేశారు. 

తిట్లు కావాలంటే కాంగ్రెస్‌కు.. కిట్లు కావాలంటే కేసీఆర్‌కు ఓటేయండి: హరీశ్‌ రావు

ఈ సమాధానంతో గొగొయ్‌ సంతృప్తి చెందలేదు. కేంద్ర మంత్రిత్వశాఖ వెబ్‌సైట్‌లో రినికి భుయాన్‌ పేరు, కంపెనీ పేరు స్పష్టంగా కనిపిస్తోందని చెప్పారు. కేంద్రం నుంచి రూ.10 కోట్ల సబ్సిడీ పొందిన కంపెనీలు, ప్రమోటర్ల జాబితాను సూచించే వెబ్‌సైట్ లింకును ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. దానిపై స్పందించిన హిమంత.. మునుపటి ఖండననే పునరుద్ఘాటిస్తున్నానని చెప్పారు. అయితే వెబ్‌సైట్‌లో పొందుపరిచిన పత్రాల గురించి ఆయన ప్రస్తావించకపోవడం గమనార్హం. 

హిమంత భార్య కంపెనీ గురించి ఆదివారం ఓ వెబ్‌సైట్‌ కథనం ప్రచురించింది. దాని ప్రకారం.. ‘‘ప్రైడ్‌ ఈస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌’లో భూయాన్‌కు మెజారిటీ వాటా ఉంది. 2022 ఫిబ్రవరిలో ఆ కంపెనీ కలియాబోర్‌ మౌజాలో 10 ఎకరాల వ్యవసాయ భూమి కొనుగోలు చేసింది. హిమంత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన 9 నెలల తరువాత ఈ కొనుగోలు జరిగింది. నెల రోజుల్లోనే ఆ వ్యవసాయ భూమిని పారిశ్రామిక ప్రాంతంగా మార్చారు. ఆ తరువాత ప్రైడ్‌ ఈస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అందులో ఫుడ్ ప్రాసెసింగ్‌ యూనిట్ ఏర్పాటు చేస్తుందని ప్రధానమంత్రి కిసాన్‌ సంపద యోజన కింద సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకుంది. ఆ వివరాల ఆధారంగా కేంద్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ మంత్రిత్వశాఖ గతేడాది నవంబర్‌ 10న సంబంధిత కంపెనీకి రూ.10 కోట్ల సబ్సిడీ ఇవ్వడానికి అంగీకరించినట్లు’ పేర్కొంది.

హిమంత బిశ్వ శర్మ భార్యకు ప్రైడ్‌ ఈస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌లో ఉన్న హోదా, వాటాల గురించిన వివరాల స్క్రీన్‌షాట్లను కాంగ్రెస్‌ మీడియా, ప్రచార విభాగం అధ్యక్షుడు పవన్‌ ఖేడా (Pawan Khera) సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశారు. ‘ప్రియమైన హిమంత బిశ్వా.. మీరు ఇంకా తిరస్కరిస్తారా?’ అని ఆయన ప్రశ్నించారు. దాంతో శర్మ మరోమారు తన భార్య కంపెనీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయోజనాలు పొందలేదని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఖేడా ‘అయితే మీరు అస్సాం పోలీసులను పంపించి ఫుడ్ ప్రాసెసింగ్‌ మంత్రిని అరెస్టు చేయిస్తారా?’ అని ప్రశ్నించారు. ఖేడాను ఈ ఫిబ్రవరిలో అస్సాం పోలీసులు అరెస్టు చేసి.. ఆ తరువాత బెయిల్‌పై విడుదల చేశారు. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ ఖేడా వ్యంగ్యంగా స్పందించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని