కర్ణాటకలో కాంగ్రెస్‌ కొత్త నినాదం.. #CryPMPayCM హ్యాష్‌ట్యాగ్‌తో పోస్టులు

Karnataka Elections 2023: కర్ణాటక ఎన్నికల వేళ కాంగ్రెస్‌ పార్టీ కొత్త నినాదం అందుకుంది. ప్రధాని మోదీ, బసవరాజ్‌ బొమ్మైను ఉద్దేశించి #CryPMPayCM పేరిట హ్యాష్‌ట్యాగ్‌తో కొత్త నినాదాన్ని ట్రెండ్‌ చేస్తోంది.

Published : 01 May 2023 17:08 IST

బెంగళూరు: కన్నడ నాట ఎన్నికలు (Karnataka Elections 2023) సమీపిస్తున్నకొద్దీ రాజకీయ విమర్శల వేడి పెరుగుతోంది. రెండు జాతీయ పార్టీలైన భాజపా- కాంగ్రెస్ మధ్యే ప్రధానంగా సాగుతున్న ఈ పోరులో.. ఇప్పటికే జాతీయ నాయకులు రంగంలోకి దిగి ప్రచారాన్ని మరింత వేడెక్కిస్తున్నారు. మోదీనుద్దేశించి ఖర్గే వ్యాఖ్యలు చేయడం.. కాంగ్రెస్‌ తనను 91 సార్లు దూషించిందంటూ ప్రధాని విమర్శలు చేయడంతో ఆ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక తాజాగా తిప్పికొట్టారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ పార్టీ కొత్త నినాదం అందుకుంది. #CryPMPayCM అంటూ హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్‌ చేస్తోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..?

కర్ణాటక ఎన్నికల సభలో ఇటీవల పాల్గొన్న ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. ప్రధానిని విష సర్పంతో పోల్చారు. తర్వాత అలా అనలేదంటూ మాట మార్చారు. అయితే, కాంగ్రెస్‌ పార్టీకి తనను విమర్శించడమే పని అని, ఇప్పటి వరకు ఆ పార్టీ 91 సార్లు తనను దూషించందంటూ ప్రధాని అన్నారు. ఈ విమర్శలపై తాజాగా ప్రియాంక వాద్రా మాట్లాడారు. ప్రజల గోడు పట్టించుకోకుండా తన బాధలను చెప్పుకోవడానికి మోదీ వచ్చారంటూ ఎద్దేవాచేశారు. తమ కుటుంబాన్ని భాజపా నేతలు దూషించినవన్నీ ఒకచోట చేరిస్తే ఒక పుస్తకాన్నే ముద్రించొచ్చని వ్యాఖ్యానించారు.
Also Read: భాజపా మేనిఫెస్టో: ఉచితంగా సిలిండర్లు.. నందిని పాలు!

ప్రధాని మోదీని ఉద్దేశించి ప్రియాంక చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతలు కొత్త నినాదాన్ని అందుకున్నారు. గతంలో బసవరాజ్‌ బొమ్మైని ఉద్దేశించి పేసీఎం పేరిట పోస్టర్లు వెలిశాయి. ప్రభుత్వ కాంట్రాక్ట్‌ ఏదైనా 40 శాతం కమీషన్‌ ఇవ్వాల్సి వస్తోందన్న ఆరోపణలు రావడంతో గతేడాది సెప్టెంబర్‌లో ఈ పోస్టర్లు కర్ణాటకలో కలకలం సృష్టించాయి. ఈ నేపథ్యంలో పేసీఎం, క్రై పీఎం ( #CryPMPayCM) అంటూ ఓ హ్యాష్‌ట్యాగ్‌ను కాంగ్రెస్‌ శ్రేణులు ట్రెండ్‌ చేస్తున్నాయి. మరోవైపు సోమవారం భాజపా విడుదల చేసిన మేనిఫెస్టోపైనా కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు గుప్పించింది. 2018 ఎన్నికల్లో ఇచ్చిన 90 శాతం హామీలను నెరవేర్చకుండా మరో బోగస్‌ హామీ పత్రాన్ని విడుదల చేసిందంటూ ఆరోపించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు