ఉచిత సిలిండర్లు.. ఉచితంగా ‘నందిని’ పాలు : కర్ణాటక ప్రజలకు భాజపా హామీల వర్షం

BJP Election Manifesto: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు భాజపా మేనిఫెస్టో ప్రకటించింది. పేద కుటుంబాలకు ప్రతి రోజు అరలీటరు నందిని పాలను ఉచితంగా ఇస్తామని కాషాయ పార్టీ ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Updated : 01 May 2023 16:24 IST

బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల (Assembly elections)కు సమయం దగ్గరపడుతున్న వేళ కర్ణాటక (Karnataka) రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు హామీల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా అధికార భాజపా (BJP) అసెంబ్లీ ఎన్నికలకు మేనిఫెస్టో (election manifesto)ను విడుదల చేసింది. రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి అమలు, 10లక్షల ఉద్యోగాలు, పేదలకు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామని కాషాయ పార్టీ హామీలు కురిపించింది. అంతేగాక, ఇటీవల రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన ‘నందిని’ పాల (Nandini Milk)  బ్రాండ్‌ను కూడా భాజపా తన మేనిఫెస్టోలో చేర్చడం గమనార్హం.

భాజపా ‘ప్రజా ప్రణాళిక’ పేరుతో ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) సోమవారం ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. బెంగళూరులో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై, సీనియర్‌ నేత బీఎస్‌ యడియూరప్ప తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం అందించడం, సంక్షేమం కల్పించడమే భాజపా విజన్‌ అని తెలిపారు. (BJP Election Manifesto) కాగా.. ప్రతిపక్ష కాంగ్రెస్ ఇంకా తమ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించలేదు.

ఇదీ చదవండి: భాజపా బాటలో అ‘ముల్లు’!

భాజపా మేనిఫెస్టోలోని ప్రధాన హామీలివే..

కర్ణాటకలో ఉమ్మడి పౌరస్మృతి (Uniform Civil Code) అమలు

> తయారీ రంగంలో 10 లక్షల ఉద్యోగాల కల్పన

> దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న కుటుంబాలకు ప్రతి రోజు ఉచితంగా అర లీటరు నందిని పాలు (Nandini Milk)

> పేద కుటుంబంలోని ప్రతి వ్యక్తికి 5 కేజీల బియ్యం, 5 కేజీల తృణధాన్యాలతో నెలవారీ రేషన్‌ కిట్‌.

> దారిద్ర్య రేఖకు దిగువ ఉన్న కుటుంబాలకు ఏటా ఉచితంగా మూడు గ్యాస్‌ సిలిండర్లు (ఉగాది, వినాయక చవితి, దీపావళికి ఒక్కోటి చొప్పున ఇస్తాం)

> కర్ణాటక యాజమాన్య చట్టం సవరింపు, ప్రతి వార్డుకో లాబోరేటరీ

> మైసూరులోని ఫిల్మ్‌ సిటీకి దివంగత నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ (Puneeth Rajkumar) పేరు

> ప్రతి వార్డులో అటల్‌ ఆహార కేంద్రాలు

> నిరాశ్రయులకు 10 లక్షల ఇళ్ల స్థలాల కేటాయింపు

> వృద్ధులకు ఉచితంగా వార్షిక హెల్త్‌ చెకప్‌లు

> బెంగళూరుకు స్టేట్‌ క్యాపిటల్‌ రీజియన్‌ ట్యాగ్

> ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ పథకం

> రూ.30వేల కోట్లతో మైక్రో కోల్డ్‌ స్టోరేజీ సదుపాయాల కల్పన

> రూ.1500 కోట్లతో పర్యాటక రంగ అభివృద్ధి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని