Politics: జేడీఎస్‌లో విభేదాలు..! కర్ణాటక అధ్యక్షుడి తొలగింపు

జేడీఎస్‌ కర్ణాటక అధ్యక్షుడు సీఎం ఇబ్రహీంను ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు దేవేగౌడ ప్రకటించారు.

Published : 19 Oct 2023 16:14 IST

బెంగళూరు: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో భాజపాతో కలిసి వెళ్లాలన్న నిర్ణయంపై జేడీఎస్‌ (JDS)లో విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఎన్డీయేలో (NDA) చేరాలన్న నిర్ణయాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి సీఎం ఇబ్రహీం (C M Ibrahim) తప్పుబట్టారు. తమ పార్టీ ఎన్డీయేలో చేరబోదని, ఈ విషయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నిర్ణయం తీసుకునే హక్కు తనకు ఉందన్నారు. ఈ పరిణామాల నడుమ పార్టీ రాష్ట్ర వర్కింగ్‌ కమిటీని రద్దు చేస్తున్నట్లు పార్టీ అధినేత హెచ్‌డీ దేవేగౌడ (HD Deve Gowda) ప్రకటించారు. దీంతో ఇబ్రహీంను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి హోదా నుంచి తొలగించినట్లయ్యింది. ఈ క్రమంలోనే తన తనయుడు, మాజీ సీఎం కుమారస్వామి అధ్యక్షతన తాత్కాలిక కమిటీని నియమించారు. ఎన్డీయేలో చేరికపై తమ అన్ని రాష్ట్రాల విభాగాలు సమ్మతి తెలిపాయన్నారు.

ఎన్డీయేలోకి చేరికపై విభేదాలు.. జేడీఎస్‌లో చీలిక?

ఎన్డీయేలో చేరుతున్నట్లు సెప్టెంబర్‌ 22న కుమార స్వామి ప్రకటించారు. ఈ నేపథ్యంలో పార్టీ నేతలతో రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం ఇటీవల భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. భాజపాతో కలిసి వెళ్లేందుకు అంగీకరించొద్దని దేవేగౌడను కోరతానన్నారు. ఒకవేళ దేవేగౌడ, కుమార స్వామిలు అందుకు అంగీకరించకపోతే పరిస్థితి ఏంటని మీడియా ప్రశ్నించగా.. ‘‘మాదే అసలైన సెక్యులర్‌. నేను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. రాష్ట్రంలో పార్టీ గురించి నిర్ణయం తీసుకునే హక్కు నాకు ఉంది. దేవేగౌడ, కుమారస్వామి వెళ్తే అడ్డుకోం. పార్టీ ఎమ్మెల్యేల సంగతి సమయం వచ్చినప్పుడు చెప్తాం’’ అని అన్నారు. తనతో కొందరు ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని, వారి పేర్లను బహిరంగపర్చాలని అనుకోవడం లేదని చెప్పారు. ఈ క్రమంలోనే నేడు ఇబ్రహీంను పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి దేవేగౌడ తొలగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని