JDS-NDA: ఎన్డీయేలోకి చేరికపై విభేదాలు.. జేడీఎస్‌లో చీలిక?

JDS- NDA: ఎన్డీయేలో చేరే విషయంలో జేడీఎస్‌లో విభేదాలు తలెత్తాయి. దీనిపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బహిరంగంగానే తన అసంతృప్తిని వెలిబుచ్చారు. పార్టీ చీలిక సైతం తలెత్తే అవకాశం ఉందని సంకేతాలిచ్చారు.

Published : 16 Oct 2023 19:31 IST

JDS-NDA | బెంగళూరు: రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కర్ణాటకలో భాజపాతో కలిసి వెళ్లాలన్న నిర్ణయంపై జనతాదళ్‌ సెక్యులర్‌లో (JDS) విభేదాలు తలెత్తాయి. ఎన్డీయేలో (NDA) చేరాలన్న పార్టీ నిర్ణయాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి సి.ఎం. ఇబ్రహీం (C M Ibrahim) తప్పుబట్టారు. తమ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్డీయేలో చేరబోదని తెగేసి చెప్పారు. ఈ విషయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తాను నిర్ణయం తీసుకునే హక్కు ఉందని పేర్కొన్నారు. పార్టీలో చీలిక ఉంటుందని బహిరంగంగానే సంకేతాలు ఇచ్చారు.

కేంద్రమంత్రి అమిత్‌షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సెప్టెంబర్‌ 22న దిల్లీలో భేటీ అనంతరం ఎన్డీయేలో చేరుతున్నట్లు దేవేగౌడ తనయుడు, మాజీ సీఎం కుమార స్వామి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ నేతలతో భేటీ అనంతరం రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రహీం సోమవారం మీడియాతో మాట్లాడారు. భాజపాతో పొత్తు వార్త బయటకు రాగానే.. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడుకు చెందిన పార్టీ నేతలు పార్టీని వీడారని గుర్తుచేశారు. భాజపాతో కలిసి వెళ్లేందుకు అంగీకరించొద్దని దేవేగౌడను కోరతానని చెప్పారు. 

మేనిఫెస్టో బాగుంది.. కేసీఆర్‌ మళ్లీ సీఎం అవ్వడం ఖాయం: అసదుద్దీన్‌

సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని దేవేగౌడకు తెలియజేసేందుకు ఓ కోర్‌ కమిటీని ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఒకవేళ దేవేగౌడ, కుమార స్వామి అందుకు అంగీకరించకపోతే పరిస్థితి ఏంటని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ‘‘మాదే అసలైన సెక్యులర్‌. నేను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని.  రాష్ట్రంలో పార్టీ గురించి నిర్ణయం తీసకునే హక్కు నాకు ఉంది. దేవేగౌడ, కుమారస్వామిని అడుగుతాం. ఒకవేళ అంగీకరించకపోతే.. వారు వెళ్తే అడ్డుకోం. పార్టీ ఎమ్మెల్యేల సంగతి సమయం వచ్చినప్పుడు చెప్తాం’’ అని ఇబ్రహీం అన్నారు. తనతో కొందరు ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని, వారి పేర్లను బహిరంగపర్చాలని అనుకోవడంలేదని పేర్కొన్నారు. ఇబ్రహీం వ్యాఖ్యాలపై కుమారస్వామి మాట్లాడారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు స్వతంత్రంగా వ్యవహరిస్తుంటారని, ఆయన నిర్ణయం ఆయనదేనని సమాధానం ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని