Chandrababu: పటాన్‌చెరులో ఎకరం రూ.30కోట్లు.. ఏపీలో భూములకు ధరేది?: చంద్రబాబు

వచ్చే ఎన్నికల్లో జగన్‌ను చిత్తుచిత్తుగా ఓడిస్తేనే రాష్ట్రం గెలుస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఈ నాలుగేళ్లలో రాష్ట్రానికి నరకం చూపించిన జగన్‌ను ఎంతమాత్రం ఉపేక్షించడానికి వీల్లేదన్నారు.

Updated : 29 Jun 2023 22:49 IST

అమరావతి: వచ్చే ఎన్నికల్లో జగన్‌ను చిత్తుచిత్తుగా ఓడిస్తేనే రాష్ట్రం గెలుస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఈ నాలుగేళ్లలో రాష్ట్రానికి నరకం చూపించిన జగన్‌ను ఎంతమాత్రం ఉపేక్షించడానికి వీల్లేదన్నారు. వైకాపాలోని చిన్న చేపలను  ఆపార్టీకి చెందిన పెద్ద చేపలే మింగేస్తున్నాయని దుయ్యబట్టారు.  తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే ఎస్‌సీవీ నాయుడు తెదేపాలో చేరారు. మంగళగిరిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్‌సీవీ నాయుడికి చంద్రబాబు కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి తెదేపా ఇన్‌ఛార్జి బొజ్జల సుధీర్‌రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పేదలను దోచేస్తూ వారిని నాశనం చేస్తూ పేదల పక్షం అని చెప్పుకోవడం జగన్‌కే చెల్లిందని మండిపడ్డారు. కళ్లు మూయకుండా అబద్ధాలు చెప్పడం జగన్‌కే సాధ్యమని ఎద్దేవా చేశారు. దుర్మార్గుల చేతుల్లో టెక్నాలజీ ఉంటే జరిగే నష్టం ఏమిటో 22ఏ భూముల్లో జరుగుతోన్న దోపిడీ చూస్తే అర్థమవుతోందన్నారు. దేశంలోనే ధనికుడైన పెత్తందారు జగన్‌.. తాను పేదోడిని అంటున్నారని ఎద్దేవా చేశారు. ధైర్యంగా రాజకీయాలు చేస్తాననే జగన్‌.. పరదాలు కట్టుకుని తిరుగుతున్నారని ఆక్షేపించారు.

ఏపీలో భూముల ధరలు పడిపోయాయి..

‘‘ఆంధ్రాలో ఒకప్పుడు ఒక  ఎకరా అమ్మితే తెలంగాణలో 3 ఎకరాలు కొనేవాళ్లని ఇటీవల తెలంగాణ సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ అన్నారు. హైటెక్‌ సిటీ కట్టిన తర్వాత రూ.30వేలు ఉండే ఎకరా రూ.30 కోట్లు అయ్యింది. 2019లో మనం ఓడిపోయిన తర్వాత ఏపీలో భూముల ధరలు పడిపోయాయి. అభివృద్ధి లేదు.. కొనే వాళ్లు లేరు. అందుకే ఏపీలో భూముల ధరలు తగ్గాయి. పటాన్‌ చెరులో ఎకరం రూ.30కోట్లు.. అవి పెడితే ఆంధ్రాలో 100 ఎకరాలు వస్తుందని కేసీఆర్‌ అన్నారు. కియామోటార్స్‌ వచ్చింది కాబట్టి అనంతలో,  అమరావతి వచ్చింది కాబట్టి ఇక్కడ ల్యాండ్‌ విలువ పెరిగింది. ఎక్కడ ఇరిగేషన్‌ ప్రాజెక్టు వస్తే అక్కడ, నేషనల్‌ హైవే వస్తే అక్కడ భూమి విలువ పెరుగుతుంది.  కానీ, ఇప్పుడు ఏపీలో ఆ పరిస్థితి లేదు. మలేషియాలో రోడ్లు చూపించి వాజ్‌పేయీని ఒప్పించి నెల్లూరు నుంచి చెన్నై వరకు తొలి రోడ్డు వేశాం. అదీ తెలుగుదేశం తెచ్చిన విధానాలు, చేసిన  ఆలోచనలు. వైకాపా ప్రభుత్వం వేధింపులతో అమరరాజా వంటి వారు రాజకీయాలు వదిలేయడం, పక్కరాష్ట్రాలకు వెళ్లిపోవడం చేస్తున్నారు’’ అని చంద్రబాబు ఆరోపించారు.

ఎస్‌సీవీ నాయుడు ఎక్కడుంటే ఆ పార్టీదే అధికారం

ఈ సందర్భంగా చంద్రబాబు సమక్షంలో బొజ్జల సుధీర్‌రెడ్డి, ఎస్‌సీవీ నాయుడు ఒకరిపైఒకరు పంచ్‌ డైలాగులు వేసుకోవడం చర్చనీయాంశమైంది. ఇరువురి ప్రసంగాలపై పార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగింది. ఎస్‌సీవీ నాయుడు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధికారంలోకి వస్తుందని సుధీర్‌రెడ్డి తెలిపారు. గతంలో తెదేపాలో ఉన్నప్పుడు చంద్రబాబు సీఎం అయ్యారని, ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరాక వైఎస్సార్‌ సీఎం అయ్యారని గుర్తు చేశారు. వైకాపాలో చేరాక జగన్‌ సీఎం అయ్యారనీ.. ఇప్పుడు తెలుగుదేశంలో చేరినందున చంద్రబాబు సీఎం కావడం ఖాయమని స్పష్టం చేశారు. ఎస్‌సీవీ నాయుడు లక్కీ స్టార్‌ అని ఛలోక్తులు విసిరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు