
Punjab Polls: భాజపాలో చేరిన ఆర్మీ మాజీ చీఫ్ జేజే సింగ్
చండీగఢ్: పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ జోగిందర్ జశ్వంత్ సింగ్ (జేజే సింగ్) భాజపాలో చేరారు. కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అశ్వినీ శర్మ సమక్షంలో ఆయన కమలదళంలో చేరారు. తమ పార్టీలోకి వచ్చిన జేజే సింగ్‌ను భాజపా నేతలు సాదర స్వాగతం పలికారు. 2017లో శిరోమణి అకాలీదళ్‌లో చేరిన జేజే సింగ్.. అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి కాంగ్రెస్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్‌పై పటియాలా నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత 2018లో అకాలీదళ్ నుంచి బయటకు వచ్చేశారు. 2005 నుంచి 2007 వరకు ఆర్మీ చీఫ్‌గా పనిచేసిన జేజే సింగ్.. 2008 జనవరి నుంచి 2013 మే వరకు అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గానూ సేవలందించారు. 117 అసెంబ్లీ సీట్లు కలిగిన పంజాబ్ అసెంబ్లీకి ఫిబ్రవరి 20న పోలింగ్ జరగనుండగా.. మార్చి 10న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.