వివేకా కుటుంబ సభ్యులకు రక్షణేది?:వర్ల

మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులకు రక్షణ ఎక్కడుందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. ప్రభుత్వం వారికి అవసరమైన భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. వివేకా హత్య కేసులో పిటిషన్‌ను...

Updated : 07 Feb 2020 15:14 IST

మంగళగిరి: మాజీ మంత్రి వివేకానందరెడ్డి కుటుంబ సభ్యులకు రక్షణ ఎక్కడుందని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. ప్రభుత్వం వారికి అవసరమైన భద్రత కల్పించాలని డిమాండ్‌ చేశారు. వివేకా హత్య కేసుకు సంబంధించిన పిటిషన్‌ను సీఎం జగన్‌ వెనక్కి తీసుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. గతంలో వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కోరిన జగన్‌.. గురువారం సదరు పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారని విమర్శించారు. హైకోర్టులో వేసిన రిట్‌ పిటిషన్‌ను ఎందుకు వెనక్కు తీసుకున్నారో చెప్పాలని వర్ల డిమాండ్‌ చేశారు. కేసు విచారణకు వచ్చే సమయంలో రిట్‌ను వెనక్కి తీసుకోవడమేంటన్నారు. సీబీఐ దర్యాప్తునకు హైకోర్టు ఆదేశిస్తే అంతఃపుర రహస్యాలు బయటకొస్తాయనుకున్నారా? అని వర్ల ప్రశ్నించారు.

నిందితులను కాపాడేందుకు జగన్‌ తన పిటిషన్‌ను వెనక్కి తీసుకున్నారా? అని వర్ల అనుమానం వ్యక్తం చేశారు.‘‘సీఎం వ్యవహారశైలిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. వివేకా కేసులో అమాయకులను ఇరికించాలని చూస్తున్నారని ఆయన కుమార్తె సునీత ఆరోపించారు. వివేకా కుటుంబసభ్యులకు రక్షణేది? సునీత, సౌభాగ్యమ్మలకు అవసరమైన భద్రత కల్పించాలి. బాబాయిని చంపిన నిందితులను చట్టానికి పట్టివ్వాలని జగన్‌కు లేదా?సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే ఈ కేసును సీబీఐకి ఎందుకివ్వలేదు. రాష్ట్రంలో పాలన గాడి తప్పింది.. పాలెగాళ్ల పద్ధతిలో సాగుతోంది’’ అని వర్ల రామయ్య ఆరోపించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని