వైకాపా వీరంగం.. విశాఖలో టెన్షన్‌.. టెన్షన్‌!

తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన వేళ  వైకాపా శ్రేణుల వీరంగంతో విశాఖనగరం అట్టుడుకుతోంది. ప్రతిపక్ష నేత రాకను నిరసిస్తూ  వైకాపా కార్యకర్తలు రెచ్చిపోవడంతో విశాఖ విమానాశ్రయం పరిసరాలు రణరంగంలా.......

Updated : 27 Feb 2020 16:15 IST

కొన్ని గంటలుగా కాన్వాయ్‌లోనే చంద్రబాబు
వైకాపా, తెదేపా శ్రేణుల పోటాపోటీ నినాదాలు
విమానాశ్రయం వద్ద క్షణక్షణం ఉత్కంఠ

విశాఖ: తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన వేళ వైకాపా శ్రేణుల వీరంగంతో విశాఖ నగరం అట్టుడుకుతోంది. ప్రతిపక్ష నేత రాకను నిరసిస్తూ వైకాపా కార్యకర్తలు రెచ్చిపోవడంతో విశాఖ విమానాశ్రయం పరిసరాలు రణరంగాన్ని తలపించాయి. విమానాశ్రయాన్ని దిగ్బంధించిన వైకాపా శ్రేణులు చంద్రబాబు వాహన శ్రేణిపై కోడిగుడ్లు, టమాటాలు, చెప్పులు విసిరారు. వైకాపా కార్యకర్తలు, నేతలు కొన్ని గంటలుగా చంద్రబాబు వాహన శ్రేణిని ముందుకు కదలనీయకుండా స్తంభింపజేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. మరోవైపు, చంద్రబాబు భద్రతపై తెదేపా నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు అక్కడే రోడ్డుపై బైఠాయించి పోలీసుల తీరును తీవ్రంగా నిరసించారు.

అసలేం జరిగింది?

ప్రజాచైతన్య యాత్రలో భాగంగా చంద్రబాబు గురువారం విశాఖ విమానాశ్రయం నుంచి విజయనగరం పర్యటనకు వెళ్లాల్సి ఉంది. విశాఖలో భూసమీకరణ బాధితులను కలిసి వారి సమస్యలు తెలుసుకునేందుకు వెళ్లాలని ప్రయత్నించిన ప్రతిపక్ష నేతను అడ్డుకొనేందుకు వైకాపా కార్యకర్తలు ముందుగానే విమానాశ్రయం వద్ద మోహరించారు. మరోవైపు తమ అధినేతకు ఘన స్వాగతం పలికేందుకు తెదేపా కార్యకర్తలు విమానాశ్రయానికి చేరుకోవడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు వర్గాల నేతల నినాదాలతో ఘర్షణ వాతావరణం నెలకొంది. క్షణక్షణం ఉత్కంఠగా మారింది.  11 గంటల సమయంలో ఆయన విమానాశ్రయానికి చేరుకోగానే అప్పటికే భారీగా చేరుకున్న వైకాపా శ్రేణులు ఆయన్ను అడ్డుకోవడంతో అక్కడి వాతావరణం రణరంగంగా మారింది. గత రెండున్నర గంటలకు పైగా ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది.  మూడు రాజధానుల ప్రతిపాదనను తెదేపా వ్యతిరేకిస్తోందని.. అమరావతి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తోందని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో పాటు జై విశాఖ నినాదంతో ఆయన వాహనాన్ని ముందుకు కదలనీయకుండా అడ్డుకున్నారు. నల్లజెండాలతో నిరసనలు తెలియజేశారు. చంద్రబాబు వాహన శ్రేణి కదిలిన కొద్ది సేపట్లోనే కాన్వాయ్‌ని అడ్డుకున్నాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు ఇద్దరు ఏసీపీలతో పాటు భారీగా పోలీసులు ప్రయత్నిస్తున్నారు. డీసీపీ నేతృత్వంలో పోలీసులను భారీగా మోహరించారు. 

పర్యటనకు ముందు నుంచే ఉత్కంఠ!

చంద్రబాబు పర్యట పది రోజుల ముందుగానే ఖరారైనప్పటికీ దాన్ని అడ్డుకుంటామని ముందుగానే వైకాపా ప్రకటించింది. అయితే, పర్యటనను విజయవంతం చేస్తామని తెదేపా నేతలు తేల్చి చెప్పడంతో ముందు నుంచే ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ముందుగానే పోలీసులు విమానాశ్రయం వద్ద భారీగా మోహరించారు. 

కాన్వాయ్‌ దిగి మళ్లీ కారులోకి చంద్రబాబు 

విమానాశ్రయం వద్ద అడుగడుగునా మోహరించిన వైకాపా కార్యకర్తలు చంద్రబాబు వాహన శ్రేణిని అడ్డుకోవడంతో ఆయన కిందికి దిగి నడిచేందుకు ప్రయత్నించారు. అయితే, పరిస్థితి సద్దుమణగకపోవడంతో ఆ తర్వాత కొద్దిసేపటికే ఆయన మళ్లీ వాహనం ఎక్కారు. ఈ పరిస్థితుల్లో ఎప్పుడేం జరుగుతుందో తెలియనంత ఉద్రిక్తంగా విమానాశ్రయం పరిసరాల్లో వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల మధ్య చంద్రబాబు వాహనంలోనే కూర్చుండిపోగా.. ఏం జరుగుతుందోనని తెదేపా శ్రేణులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. జడ్‌ ప్లస్‌ కేటగిరీ భద్రత ఉన్న తమ అధినేతకు ఏమైనా ముప్పు వాటిల్లుతుందేమోనని కలవరపడుతున్నాయి.

చంద్రబాబుకు భద్రతగా బుల్లెట్‌ప్రూఫ్‌ జాకెట్‌

ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చంద్రబాబు వాహన శ్రేణి చుట్టూ భద్రతా సిబ్బంది వలయంలా ఏర్పడ్డారు.  రక్షణగా బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ను భద్రతా సిబ్బంది అడ్డుగా పెట్టారు.  అదే సమయంలో పోలీసులు వైకాపా కార్యకర్తల్ని పక్కకు నెట్టేందుకు విఫలయత్నం చేశారు. చంద్రబాబు కాన్వాయ్‌కి వైకాపా శ్రేణులు  అడ్డంగా పడుకొని గోబ్యాక్‌ నినాదాలు చేశారు. 

భారీగా ట్రాఫిక్‌ జాం.. ప్రయాణికుల అవస్థలు

ఎన్‌ఏడీ కూడలి వద్ద తెదేపా కార్యకర్తలు, నేతలను పోలీసులు అడ్డుకున్నారు. ఆటోలు, వ్యాన్‌లలో వస్తున్న వారిని విమానాశ్రయం, పెందుర్తివైపు వెళ్లకుండా అడ్డుకున్నారు. తెదేపా ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌ వాహనాన్ని విమానాశ్రయం వద్ద అడ్డుకోవడంతో పోలీసులకు ఆయనకు మధ్య  వాగ్వాదం చోటుచేసుకుంది. విమనాశ్రయానికి వచ్చే ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తాయి. విశాఖ ఎన్‌ఏడీ కూడలి నుంచి ఎయిర్‌పోర్టు మార్గంలో ప్రజలకు అవస్థలు పడుతున్నారు. వైకాపా కార్యకర్తల నిరసనలతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. 


శాంతిభద్రతలను కాపాడాల్సిన వాళ్లు అలా మాట్లాడతారా?

‘‘ప్రభుత్వ వైఫల్యాలను చెప్పేందుకు చంద్రబాబు వచ్చారు. తెదేపా ఘన స్వాగతం పలకాలని నిర్ణయిస్తే.. వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేలు మాత్రం చంద్రబాబును అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన వాళ్లు అలా మాట్లాడటం సరికాదు. జగన్‌ పాదయాత్ర సమయంలో మేం భద్రత కల్పించాం.  ప్రజలు వస్తున్నారని ఇలా అడ్డుకోవాలని వైకాపా గూండాలను దింపింది.  చంద్రబాబు బయటకు రాకుండా చేసేందుకే ఇలా చేస్తున్నారు. ఇది సరికాదు.  - చినరాజప్ప, మాజీ హోంమంత్రి


పక్కా ప్లాన్‌ ప్రకారమే ఇదంతా  

‘‘ప్రభుత్వం ప్లాన్‌ చేసి ఇలా చేస్తోంది. స్థానిక మంత్రి , ఎమ్మెల్యే, పోలీసులు కలిసి పథకం ప్రకారం చేస్తున్నారిదంతా. అర్ధగంట లాబీల్లో కూర్చుంటే క్లియర్‌ చేస్తాం అని పోలీసులు ఇప్పుడు అంటున్నారు. ముందు ఎందుకు చెప్పలేదు. మా నాయకుడ్ని జనంలోకి తీసుకొచ్చి ఇబ్బంది పెట్టాలన్న పథకంలో పోలీసులు భాగం కావడం బాధాకరం. ప్రభుత్వం ఏం చెబితే అది పోలీసులు చేస్తున్నారు. ప్రజాస్వామ్యానికి పాతరేస్తున్నారు. ఈ దుర్మార్గాన్ని ప్రపంచంలో ప్రతిఒక్కరూ చూస్తున్నారు. కాన్వాయ్‌ ఎట్టిపరిస్థితుల్లో ముందుకెళ్తుంది. వాళ్లంతా వైకాపా కార్యకర్తలు కాదు.. పెయిడ్‌ ఆర్టిస్ట్‌లు’’ - నక్కా ఆనంద్‌బాబు, మాజీ మంత్రి


విశాఖకు కొత్త సంస్కృతి తెచ్చారు

‘‘సీఎం జగన్‌ విశాఖకు నూతన సంస్కృతిని తీసుకొచ్చారు. చంద్రబాబుకు భయపడి, ఆయన్ను తట్టుకోలేక పెయిడ్‌ ఆర్టిస్ట్‌లను తీసుకొచ్చి రూ.500 లు ఇచ్చి  తీసుకురావడానికి సిగ్గుపడాలి. ఇలా అడ్డుకోవాలని ప్రయత్నిస్తే ఊరుకోం. ఇది జగన్‌ చేతకాని తనానికి నిదర్శనం. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్యక్తికి ఇచ్చే గౌరవమిదేనా? ఎలాగైనా ముందుకెళ్తాం’’ - అనిత, మాజీ ఎమ్మెల్యే


పోలీసులేం చేస్తున్నారు?

‘‘మేం మా నేతను ఆహ్వానించి తీసుకెళ్తున్నాం. వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారు. కొన్ని గంటల నుంచి ఇప్పటివరకు కాన్వాయ్‌ని ముందుకు కదలనీయడంలేదు. ప్రజలా.. వైకాపా కార్యకర్తలో చూస్తే తెలుస్తుంది. పోలీసులు ఏం చేస్తున్నారు. న్యాయం అందరికీ సరిగ్గా వర్తించాలి కదా. పోలీసులు ఏరీ? ప్రజలకు వాస్తవ పరిస్థితిని ప్రజలకు చూపించాలని మీడియాను కోరుతున్నా’’ - భరత్‌, తెదేపా నేత


ఇది ప్రభుత్వ దుర్మార్గపు చర్య

‘‘ఇది ప్రభుత్వం కావాలని పోలీసులను అడ్డం పెట్టుకొని చేస్తున్న దుర్మార్గపు చర్య. కాన్వాయ్‌ ముందుకు కదలకుండా 150 మంది వైకాపా కార్యకర్తలు కూర్చుంటే వారిని ఖాళీ చేయించలేని పరిస్థితుల్లో పోలీసు వ్యవస్థ ఉందా? నిరసన తెలియజేయొచ్చు తప్పులేదు. కానీ ఈ విధానం చాలా దుర్మార్గమైనది. కాన్వాయ్‌ని ముందుకు వదలాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉంది. ఇది ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్‌ వ్యవస్థ వైఫల్యం’’ - తెదేపా నేత




Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని