అంతా తానై గెలిపించి.. చివరకు ‘చేయి’ని వదిలి..

మధ్యప్రదేశ్‌ రాజకీయాల్లో సంచలనం.. నిఖార్సైన కాంగ్రెస్‌ వాదిగా, యువనేతగా, పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీకి అత్యంత సన్నిహితుడైన జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. ఆయన......

Updated : 10 Mar 2020 17:24 IST

సింధియా రాజీనామాకు కారణాలేంటి?

ఇంటర్నెట్‌డెస్క్‌ ప్రత్యేకం: మధ్యప్రదేశ్‌ రాజకీయాల్లో సంచలనం.. నిఖార్సైన కాంగ్రెస్‌ వాదిగా, యువనేతగా, పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీకి అత్యంత సన్నిహితుడైన జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ పార్టీకి గుడ్‌ బై చెప్పారు. ఆయన తండ్రి మాధవరావు సింధియా దివంగత నేత ప్రధాని రాజీవ్‌ గాంధీకి మంచి స్నేహితుడు. కాంగ్రెస్‌తో సుదీర్ఘకాలంగా తనకున్న బంధాన్ని జ్యోతిరాదిత్య సింధియా తెగతెంపులు చేసుకున్నారు. ఆయనతో పాటు తన మద్దతుదారులైన 22 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం జ్యోతిరాదిత్య వెంట నడవడంతో మధ్యప్రదేశ్‌లోని కమల్‌నాథ్‌ ప్రభుత్వం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. 18 ఏళ్ల పాటు కాంగ్రెస్‌లో నిబద్ధతతో ఉన్న సింధియా అసలు ఎందుకు పార్టీని వీడారు? 2018లో జరిగిన మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అంతా తానై పార్టీని గెలిపించినా చివరకు ‘చేయి’ని సింధియా వదలి బయటకు వెళ్లేందుకు దారి తీసిన పరిస్థితులేంటి?

అంతా తానై నడిపించినా.. వృద్ధ నేతలదే ఆధిపత్యం! 
సమర్థ నాయకత్వ లోపం, కాంగ్రెస్‌లో యువతకు సరైన ప్రాముఖ్యత ఇవ్వకపోవడంతో పాటు అంతర్గత కలహాలు, ముఠా తగాదాలు తారస్థాయికి చేరడంతో కొంత కాలంగా సింధియా అసంతృప్తితో ఉన్నారు. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో తీవ్ర ఆధిపత్య పోరు, నాయకత్వం లోపంతో బాధపడుతున్న సమయంలో సింధియా కాంగ్రెస్‌కు ఆశాజ్యోతిగా నిలిచారు. తన భుజ స్కంధాలపైనే పార్టీని ముందుకు నడిపించి ప్రజల్ని కాంగ్రెస్‌ వైపు ఆకర్షితుల్ని చేయడంలో.. పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో ఎంతగానో శ్రమించారు. అంతా తానే అయి నడిపించిన సింధియానే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠిస్తారనుకున్నారంతా. కానీ, కాంగ్రెస్‌ అధిష్ఠానం మాత్రం 70 ఏళ్లకు పైబడిన కమల్‌నాథ్‌కే సీఎం పీఠాన్ని అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. బీఎస్పీ, ఎస్పీ, కొందరు స్వతంత్రులతో కలిపి బొటా బొటీ మెజార్టీతో గత 15 నెలలుగా కమల్‌నాథ్‌ నెట్టుకొస్తున్నారు. తాజాగా సింధియా మద్దతుదారులైన ఎమ్మెల్యేల రాజీనామాతో కమల్‌నాథ్‌కు గట్టి షాక్‌ తగిలింది. ప్రస్తుతం తీవ్ర సంక్షోభంలో పడిన కమల్‌నాథ్‌ సర్కార్‌ను కాపాడుకొనేందుకు కాంగ్రెస్‌ దిద్దుబాటు చర్యలకు దిగింది. సింధియాను బుజ్జగించేందుకు సచిన్‌ పైలట్‌ వంటి నేతలు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. పీసీసీ అధ్యక్ష పదవిని సైతం కమల్‌నాథ్‌ వద్ద పెట్టుకోవడంతో పాటు త్వరలో జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో సింధియా వర్గానికి చెందినవారికి ప్రాతినిధ్యం కల్పించే అవకాశం ఉందన్న ఆశలు కనబడలేదు. అంతేకాకుండా పార్టీ వ్యవహరిస్తున్న తీరుపట్ల కొంత కాలంగా గుర్రుగా ఉన్న జ్యోతిరాదిత్య ఇక పార్టీని వీడటమే మంచిదని భావించినట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌లో అంతర్గతంగా ముఠా తగాదాలు నడుస్తున్నా కాంగ్రెస్‌ అధిష్ఠానం చూస్తూ ఉండటం కూడా ఈ సంక్షోభానికి దారితీసిందనే చెప్పాలి. 

తిరుగులేని నేతగా సింధియా
గ్వాలియర్‌ రాజ కుటుంబానికి చెందిన సింధియా తన తండ్రి గుణ సిట్టింగ్‌ ఎంపీ మాధవరావు సింధియా మరణం తర్వాత 2001లో రాజకీయ అరంగేట్రం చేశారు. 2002 గుణ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో భాజపా అభ్యర్థిపై 4,50,000 మెజార్టీతో ఘన విజయం అందుకున్నారు. రాహుల్‌ గాంధీకి సమవయస్కుడు కావడం, ఆయనతో మంచి స్నేహం ఉండటం సింధియాకు బాగా కలిసొచ్చింది. 2002 నుంచి 2019 వరకు నాలుగు పర్యాయాలు గుణ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు ఎన్నికై తిరుగు లేని నేతగా అవతరించారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఆయన భాజపా అభ్యర్థి కృష్ణపాల్‌ సింగ్‌ యాదవ్‌ చేతిలో ఓటమిపాలయ్యారు. సింధియా యూపీఏ హయాంలో కేంద్రమంత్రిగానూ పనిచేశారు. 2014 ఎన్నికల్లో దేశమంతా భాజపా ప్రభంజనం వీచినా గుణలో మాత్రం ఆయన గెలుపొందడం విశేషం. 

కాంగ్రెస్‌ను వీడాల్సిన సమయమిదేనని భావించారా?
కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన సింధియా తన రాజీనామా లేఖను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. 18 ఏళ్ల పాటు కాంగ్రెస్‌ పార్టీలో ఉన్నప్పటికీ ఇక వెళ్లిపోవాల్సిన తరుణం ఆసన్నమైందంటూ పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్‌తో ఉంటే రాష్ట్ర, దేశ ప్రజలకు సేవ చేయలేనేమో అని ఆందోళన వ్యక్తంచేశారు. తన ప్రజలు, కార్యకర్తల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడమే ఉత్తమమని భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. సింధియా ప్రఖ్యాత హర్వర్డ్‌ యూనివర్శిటీ నుంచి అర్ధశాస్త్రంలో బీఏ అభ్యసించారు. అనంతరం 2001లో స్టాన్‌ఫర్డ్‌ వర్శిటీ నుంచి ఎంబీఏ పట్టాను అందుకున్నారు. 

శరవేగంగా పావులు కదుపుతున్న భాజపా!
బొటాబొటీ మజార్టీతో నెట్టుకొస్తున్న కమల్‌నాథ్‌ ప్రభుత్వం తాజా పరిణామాలతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోవడంతో భాజపా శరవేగంగా పావులు కదుపుతోంది. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి అధికార పార్టీలో లుకలుకలను కమలనాథులు నిశితంగా గమనిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో భాజపా అగ్రనాయకత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే సింధియా భాజపా అగ్ర నేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో కలిసి మోదీతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఏ క్షణమైనా ఆయన భాజపాలో చేరే అవకాశం ఉన్నట్టు సమాచారం. 
తన తండ్రి తీసుకున్న వైఖరికి గర్వపడుతున్నట్టు జ్యోతిరాధిత్య సింధియా కుమారుడు మహానార్యమన్‌ సింధియా అన్నారు. వారసత్వంగా ఉన్న పార్టీకి రాజీనామా చేయడానికి ఎంతో ధైర్యం కావాని చెప్పారు. తమ కుటుంబానికి ఎప్పుడూ రాజకీయ దాహం లేదనేది చరిత్రే చెబుతుందని వ్యాఖ్యానించారు.  

శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌తో ఎస్పీ, బీఎస్పీ ఎమ్మెల్యేలు భేటీ
మరోవైపు,  భోపాల్‌లో భాజపా నేత, మాజీ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌తో ఎస్పీ ఎమ్మెల్యే రాజేశ్‌ శుక్లా, బీఎస్పీ ఎమ్మెల్యే సంజీవ్‌ కుష్వాహా సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. వీరిద్దరూ చౌహాన్‌ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు. అయితే, హోళీ సందర్భంగానే వాళ్లు తనను కలిశారనీ.. ఇందులో రాజకీయమేమీ లేదని చౌహాన్‌ వ్యాఖ్యానించారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో దిల్లీలో భేటీ అయ్యారు.

బలాబలాలు ఇలా..

మొత్తం 230 మంది సభ్యులున్న మధ్యప్రదేశ్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 114 మంది, విపక్ష భాజపాకు 107 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. స్వతంత్ర సభ్యులు నలుగురు, బీఎస్పీ ఎమ్మెల్యేలు ఇద్దరు, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన ఒకరు కమల్‌నాథ్‌ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. రెండు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటివరకు 22 మంది ఎమ్మెల్యేల రాజీనామాతో కాంగ్రెస్‌ సంఖ్యా బలం తగ్గిపోయింది. దీంతో బొటాబొటీ మెజార్టీతో నడుస్తున్న ప్రభుత్వ మనుగడ ప్రశ్నార్థకమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా భాజపా జోరుగా పావులు కదుపుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని