ప్రత్యేక హోదా సాధనలో వైకాపా విఫలం

ప్రత్యేక హోదా సాధించడంలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండు చేశారు.

Published : 26 Jan 2023 05:33 IST

ఆ పార్టీ ఎంపీలు చేతగాని  వారిలా ఉండొద్దు: సీపీఐ రామకృష్ణ
బస్సు యాత్ర ప్రారంభం

అనంతపురం ఆజాద్‌నగర్‌, కర్నూలు బి.క్యాంపు, డోన్‌ పట్టణం, న్యూస్‌టుడే: ప్రత్యేక హోదా సాధించడంలో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని, ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండు చేశారు. అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామని, విభజన హామీలు నెరవేరుస్తామని పార్లమెంటు సాక్షిగా నమ్మబలికి ఓట్లు దండుకున్న భాజపా అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు గడిచినా రాష్ట్రానికి ఇసుమంతైనా ప్రయోజనం చేకూర్చలేదని విమర్శించారు. ప్రత్యేక హోదా, విభజన హామీల సాధనకు అనంతపురం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు చేపట్టిన బస్సు యాత్రను అనంతపురంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌, సీపీఎం నేతలు ప్రారంభించారు. అది డోన్‌ మీదుగా కర్నూలుకు చేరుకుంది. గురువారం ఉదయం నంద్యాలకు చేరుకుని, ఆపై వైయస్‌ఆర్‌ జిల్లా మైదుకూరు, కడప, అన్నమయ్య జిల్లా రాజంపేట మీదుగా రాత్రికి తిరుపతికి చేరుకోనుంది. అనంతపురంలో పీవీకేకే కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ వైకాపా ఎంపీలు చేతకానివారిలా ఉండొద్దని హితవు పలికారు. ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ మాట్లాడుతూ రాష్ట్రానికి 15 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ మాట తప్పడం వల్ల అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిపోయిందన్నారు. డోన్‌, కర్నూలులో పలువురు నేతలు మాట్లాడుతూ రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆయా ప్రాంతాల్లో స్థానిక పార్టీ నేతలతో పాటు అల్లూరి సీతారామరాజు మేనల్లుడు సత్యనారాయణ రాజు, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు జాన్సన్‌బాబు, శివారెడ్డి, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు లెనిన్‌బాబు, రాజేంద్ర, పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ అభ్యర్థి నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని