లౌకిక విలువల పరిరక్షణకే పాదయాత్ర
ఉదారవాద, లౌకిక విలువల పరిరక్షణకే తాను భారత్ జోడో పేరుతో దేశవ్యాప్త పాదయాత్ర నిర్వహించానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చెప్పారు.
పార్టీ కోసమో, నా కోసమో కాదు
దేశ ప్రజల ఐక్యతకే కాలినడకన పర్యటించా
ఆప్తులను కోల్పోతే కలిగే బాధ మోదీ, అమిత్‌షాలకు తెలియదు
భారత్ జోడో యాత్ర ముగింపు సభలో రాహుల్
మంచు వర్షంలోనే కొనసాగిన కార్యక్రమం
శ్రీనగర్: ఉదారవాద, లౌకిక విలువల పరిరక్షణకే తాను భారత్ జోడో పేరుతో దేశవ్యాప్త పాదయాత్ర నిర్వహించానని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చెప్పారు. తన కోసమో, కాంగ్రెస్ పార్టీ కోసమో కాకుండా దేశ ప్రజల కోసమే కాలినడకన పర్యటించానని, దేశ పునాదుల్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నవారి భావజాలానికి ఎదురొడ్డి నిలబడడమే తమ ధ్యేయమని స్పష్టంచేశారు. యాత్ర ముగిసిన సందర్భంగా సోమవారం శ్రీనగర్‌లో షేర్-ఏ-కశ్మీర్ స్టేడియంలో నిర్వహించిన సభలో రాహుల్ ప్రసంగించారు. విపరీతంగా కురుస్తున్న మంచులోనే దీనిని నిర్వహించారు. హింసను ప్రేరేపించి దేశ లౌకిక విలువల్ని దెబ్బతీసేందుకు భాజపా, ఆరెస్సెస్‌లు ప్రయత్నిస్తున్నాయని రాహుల్ ఆరోపించారు.హింసను రెచ్చగొట్టేవారికి దానివల్ల అవతలివారికి కలిగే క్షోభ ఏమిటో అర్థం కాదని అన్నారు. తండ్రి రాజీవ్ గాంధీ, నానమ్మ ఇందిరా గాంధీ హత్యకు గురైనప్పుడు ఫోన్లో సమాచారం అందుకున్న తన పరిస్థితిని గుర్తుచేసుకుంటూ ఉద్వేగానికి గురయ్యారు. ‘‘హింసను రెచ్చగొట్టే మోదీ, అమిత్‌షాలకు, భాజపా, ఆరెస్సెస్‌లకు- ఆప్తుల్ని కోల్పోతే కలిగే బాధ గురించి ఎప్పటికీ తెలియదు. సైనిక జవాన్ల కుటుంబాలకు, పుల్వామా దాడుల్లో ప్రాణత్యాగాలు చేసిన సీఆర్పీఎఫ్ సిబ్బంది కుటుంబీకులకు మాత్రం అది తెలుస్తుంది. జవాన్లు, కశ్మీరీ పౌరులు వంటివారు ఇలాంటి మరణవార్తలు ఫోన్లో వినాల్సిన పరిస్థితి రాకుండా చూడడమే నా యాత్ర ఉద్దేశం’’ అని చెప్పారు. భాజపా అగ్రనేతలకు దమ్ముంటే జమ్మూ-కశ్మీర్‌లో తనలా యాత్ర చేయాలని రాహుల్ సవాల్ విసిరారు. కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ ఎన్నికల్లో విజయం కోసం కాకుండా భాజపా విద్వేషానికి వ్యతిరేకంగా యాత్ర కొనసాగిందని చెప్పారు. పేదలు మరింత పేదరికంలో కూరుకుపోవడానికి, ధనికులు తమ సంపద మరింత పెంచుకునేందుకు మోదీ విధానాలు కారణమవుతున్నాయన్నారు.
రాహుల్ ఒక ఆశాకిరణమన్న విపక్ష నేతలు
జమ్మూ-కశ్మీర్ అగ్రనేతలు ఒమర్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), మెహబూబా ముఫ్తీ (పీడీపీ)లతో పాటు డీఎంకే, జేఎంఎం, బీఎస్పీ, సీపీఐ, ఆర్‌ఎస్పీ, ఐయూఎంఎల్ పార్టీల నేతలు ఈ సభకు హాజరయ్యారు. రాహుల్ ఇప్పుడు మన దేశానికి ఒక ఆశాకిరణంలా ఉన్నారని వారు తమ ప్రసంగాల్లో పేర్కొన్నారు. చరిత్రాత్మక యాత్రను విజయవంతంగా పూర్తిచేశారంటూ అభినందించారు.
సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ ‘భాజపా రాజ్’ నుంచి దేశానికి విముక్తి కల్పించడానికి లౌకిక పక్షాలన్నీ ఒక్కతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు. రాహుల్ రూపంలో ఒక ఆశాకిరణం దేశానికి కనిపిస్తోందని నేతలు అన్నారు. మొత్తం 22 పార్టీల వారిని ఆహ్వానించగా తృణమూల్, సమాజ్‌వాదీ, జేడీ-యూ వంటి పార్టీల నాయకులు హాజరు కాలేదు. విపరీతమైన చలి వల్ల కొందరు, ఇతర కార్యక్రమాల వల్ల మరికొందరు గైర్హాజరయ్యారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
ప్రియాంకతో మంచులో సరదా ఆట
తొలుత జమ్మూ-కశ్మీర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మల్లికార్జున ఖర్గే, జోడో యాత్ర స్థావరం వద్ద రాహుల్ గాంధీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. సోదరి ప్రియాంకతో రాహుల్ కాసేపు మంచులో సరదాగా ఆడుకున్నారు. తమ కుటుంబ మూలాలు కశ్మీర్‌లో ఉన్న విషయాన్ని ప్రియాంక, రాహుల్ ప్రస్తావించారు. శతాబ్దం క్రితమే తమ బంధువులు కశ్మీర్ నుంచే అలహాబాద్‌కు వచ్చారని రాహుల్ చెప్పారు. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ వసతిలోనే ఉండడం వల్ల తనకు సొంతిల్లు లేదన్నారు. జమ్మూ-కశ్మీర్‌లో అడుగుపెట్టే ముందు తనతో, తల్లి సోనియాతో రాహుల్ మాట్లాడి.. సొంత ఇంటికి వెళ్తున్నానని చెప్పినట్లు ప్రియాంక తెలిపారు. రాజ్యాంగ స్ఫూర్తి ప్రజల్లో ఉండడం వల్లనే వారు రాహుల్ వెంట యాత్రలో నడిచారని పేర్కొన్నారు. సోదర భావం అంటే ఏమిటో ‘భారత్ యాత్రీ’లు చాటారని చెప్పారు. తన సందేశం గురించి ప్రియాంక చెబుతుంటే కళ్లలో నీళ్లు తిరిగాయని రాహుల్ చెప్పారు. శ్రీనగర్‌లో భారీగా మంచు కురిసినప్పటికీ కార్యక్రమం సజావుగా సాగింది.
ఎన్నో పాఠాలు నేర్చుకున్నా..
యాత్రకు ప్రజల సహకారం చూసి నాకు కన్నీరు వచ్చేది. ఒక దశలో యాత్ర పూర్తి చేయగలనా అనుకున్నా. చలిని లెక్కచేయకుండా ప్రజలు సభకు హాజరయ్యారు. వారి సహకారం లేకుండా ఏ పనీ సాకారం కాదు. పాదయాత్రలో అన్ని వర్గాల ప్రజలు, మహిళలు తమ బాధలు నాతో పంచుకున్నారు. ఈ పాదయాత్ర నాకెన్నో పాఠాలు నేర్పింది.
గ్రనేడ్లకు బదులు ప్రేమను పంచారు
భయం లేకుండా జీవించడాన్ని నా కుటుంబం నుంచి నేర్చుకున్నా. దాడులు జరుగుతాయేమోననే భయంతో జమ్మూ-కశ్మీర్‌లో పాదయాత్ర చేయవద్దని, వాహనంలోనే వెళ్లాలని నాకు సలహాలు వచ్చాయి. దానిపై ఆలోచించా. మా సొంతింట్లో, మా ప్రజలతో కలిసి నడుద్దామనే నిర్ణయించుకున్నా. నా చొక్కాను ఎరుపు రంగులోకి మార్చే అవకాశం శత్రువులకు ఎందుకు ఇవ్వకూడదని అనుకున్నా. అయితే ఇక్కడి ప్రజలు నాకు గ్రనేడ్లేమీ ఇవ్వలేదు. ప్రేమ నిండిన హృదయాలను మాత్రం పంచారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
పానీపూరీ అమ్ముతున్న లేడీ డాక్టర్!.. ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే
-
Politics News
నన్ను ఓడించేందుకు ప్రయత్నాలు జరిగాయి: మంత్రి పువ్వాడ అజయ్
-
Ts-top-news News
ఉచిత వై-ఫైతో ఏసీ స్లీపర్ బస్సులు
-
Crime News
కుమార్తెను చంపి ‘కరెంట్ షాక్’ నాటకం
-
Movies News
దేవుడితో పని పూర్తయింది!.. పవన్‌తో కలిసి ఉన్న వర్కింగ్ స్టిల్‌ను పంచుకున్న సముద్రఖని
-
Ap-top-news News
ఎమ్మెల్యే అనిల్ ఫ్లెక్సీకి పోలీసుల పహారా