ఉపాధ్యాయ ఎమ్మెల్సీల్లో వైకాపా విజయం

ఒకవైపు ప్రభుత్వం.. మరోవైపు ఉపాధ్యాయ సంఘాలు, ప్రతిపక్షాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోరు ఆద్యంతం ఉత్కంఠగా సాగింది.

Published : 18 Mar 2023 05:03 IST

పశ్చిమ రాయలసీమలో 169 ఓట్లతో గట్టెక్కిన రామచంద్రారెడ్డి
తూర్పు రాయలసీమలో వైకాపా మద్దతిచ్చిన చంద్రశేఖర్‌రెడ్డి గెలుపు

ఈనాడు డిజిటల్‌- అనంతపురం, చిత్తూరు, న్యూస్‌టుడే- అనంత విద్య: ఒకవైపు ప్రభుత్వం.. మరోవైపు ఉపాధ్యాయ సంఘాలు, ప్రతిపక్షాలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోరు ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో ఉపాధ్యాయులు తాము బలపరిచిన అభ్యర్థులకు వ్యతిరేకంగా ఓటేస్తారని అధికార పార్టీ నేతలు ముందు నుంచీ ఊహించినట్లుగానే జరిగింది. పశ్చిమ రాయలసీమ స్థానంలో వైకాపా బలపరిచిన ఎం.వి.రామచంద్రారెడ్డి అతికష్టంపై గట్టెక్కారు. తూర్పు రాయలసీమ స్థానంలో అధికార పార్టీ మద్దతిచ్చిన పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి విజయం సాధించినా అది కూడా రెండో ప్రాధాన్య ఓట్లతో కానీ సాధ్యం కాలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న అర్హత లేని వారిని కూడా బలవంతంగా ఓటర్లుగా చేర్పించి ఓట్లేయించినా గెలుపు కోసం ఇంత చెమటోడ్చాల్సి రావడం అధికార పార్టీ నేతలను ఆలోచనలో పడేసింది. పశ్చిమ రాయలసీమ (అనంతపురం, కడప, కర్నూలు) ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైకాపా బలపరిచిన ఎం.వి.రామచంద్రారెడ్డి సమీప ప్రత్యర్థి, స్వతంత్ర అభ్యర్థి ఒంటేరు శ్రీనివాసులరెడ్డిపై 169 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందారు. రీకౌంటింగ్‌ నిర్వహించాలని జాయింట్‌ కలెక్టరును కోరితే ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకెళతామని చెప్పారని, కాసేపటికే రామచంద్రారెడ్డి గెలుపొందినట్లు ప్రకటించేశారని ఒంటేరు ఆక్షేపించారు. రీకౌంటింగ్‌పై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని వెల్లడించారు. ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 28,667 మంది ఓటర్లు ఉండగా.. 25,879 పోలయ్యాయి. గురువారం లెక్కింపు చేపట్టగా శుక్రవారం తెల్లవారుజామున తుది ఫలితాలు వెలువడ్డాయి. వీటిలో 608 ఓట్లు చెల్లలేదు. మిగిలిన 25,271 ఓట్లను లెక్కించారు. తొలి ప్రాధాన్యతలో ఎం.వి.రామచంద్రారెడ్డికి 8,846 ఓట్లు, ఒంటేరు శ్రీనివాసులరెడ్డికి 6,853, పీడీఎఫ్‌ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డికి 4,162, రూపాయి డాక్టర్‌గా పేరొందిన స్వతంత్ర అభ్యర్థి చామల అనిల్‌ వెంకటప్రసాద్‌రెడ్డికి 3,212 ఓట్లు దక్కాయి. రామచంద్రారెడ్డి, శ్రీనివాసులరెడ్డి మధ్య పోటీ హోరాహోరీగా నడిచింది. రెండు రౌండ్లకు మొదటి ప్రాధాన్యం ఓట్ల లెక్కింపు పూర్తి చేశారు. తరువాత ఎలిమినేషన్‌ ప్రక్రియ చేపట్టారు. మూడో ప్రాధాన్యత ఓట్లు లెక్కించిన తర్వాత రామచంద్రారెడ్డికి అత్యధిక ఓట్లు రావడంతో విజేతగా ప్రకటించారు.

ఉపాధ్యాయుల్లో స్పష్టమైన వ్యతిరేకత

ఎన్నిక ప్రక్రియను పరిశీలిస్తే ప్రభుత్వంపై ఉపాధ్యాయుల్లో వ్యతిరేకత కనిపించింది. నిబంధనల ప్రకారం తొలి ప్రాధాన్యతలో 50%+1 ఓట్లు (కోటా) సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. చెల్లిన ఓట్లు 25,271 ఉండగా.. 12,635 మొదటి ప్రాధాన్యత ఓట్లు సాధించిన వ్యక్తి విజేతగా నిలుస్తారు. వైకాపా బలపరిచిన అభ్యర్థికి మొదటి ప్రాధాన్యతలో 8,846 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో రెండు, మూడు ప్రాధాన్య ఓట్లు లెక్కించాక 10,095 ఓట్లతో ఆయన అతికష్టం మీద గెలిచారు. ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, చామల అనిల్‌ వెంకటప్రసాద్‌రెడ్డి, కత్తి నరసింహారెడ్డికి కలిపి 14,227 ఓట్లు దక్కాయి. ఇది వైకాపాపై ఉన్న వ్యతిరేకతేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.


తూర్పు రాయలసీమలో పర్వతరెడ్డి గెలుపు

తూర్పు రాయలసీమ (ఉమ్మడి చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం) శాసనమండలి ఉపాధ్యాయ ఎన్నికల్లో అధికార వైకాపా మద్దతుతో పోటీ చేసిన పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి.. పీడీఎఫ్‌ బలపరిచిన పొక్కిరెడ్డి బాబురెడ్డిపై పర్వతరెడ్డి 1,043 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో చంద్రశేఖర్‌రెడ్డికి అవసరమైన కోటా ఓట్లు (11,421) రాకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించి ఆయన విజయం సాధించారని శుక్రవారం తెల్లవారుజామున ఏఆర్వో రాజశేఖర్‌ ప్రకటించారు. ఈ స్థానంలో 8మంది బరిలో నిలవగా 24,747 మంది ఉపాధ్యాయులు ఓటుహక్కు వినియోగించుకున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు