రెండో ప్రాధాన్యత ఓట్లలో అత్యధికం తెదేపాకే

మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో భాజపా, పీడీఎఫ్‌లతో పాటు స్వతంత్ర అభ్యర్థుల రెండో ప్రాధాన్యత ఓట్లలో అధికశాతం తెదేపా అభ్యర్థులకే పడ్డాయి.

Published : 19 Mar 2023 04:52 IST

మూడు పట్టభద్రుల స్థానాల్లోనూ అదే పరిస్థితి

ఈనాడు, అమరావతి: మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో భాజపా, పీడీఎఫ్‌లతో పాటు స్వతంత్ర అభ్యర్థుల రెండో ప్రాధాన్యత ఓట్లలో అధికశాతం తెదేపా అభ్యర్థులకే పడ్డాయి. పీడీఎఫ్‌తో తెదేపాకు ముందస్తు అవగాహన ఉండటంతో... పీడీఎఫ్‌ అభ్యర్థుల రెండో ప్రాధాన్యత ఓట్లలో ఎక్కువ శాతం తెదేపా అభ్యర్థులకే వెళ్లాయి. రాష్ట్రంలో తెదేపాతో అంతగా సత్సంబంధాలు లేని భాజపా అభ్యర్థుల రెండో ప్రాధాన్యత ఓట్లలోనూ అధికశాతం తెదేపాకే వెళ్లడం విశేషం. పార్టీలకు అతీతంగా రెండో ప్రాధాన్యత ఓట్లు తెదేపా అభ్యర్థులకు వేశారని ఒక ఎమ్మెల్సీ విశ్లేషించారు. ఆయా పార్టీల మద్దతుదారులు మొదటి ప్రాధాన్యత ఓట్లను తమ పార్టీల అభ్యర్థులకు వేసుకుంటూ, రెండో ప్రాధాన్యత ఓటు విషయంలో మాత్రం ఎక్కువమంది తెదేపా వైపు మొగ్గుచూపారు. ప్రాంతాలకు అతీతంగా అన్నిచోట్లా ఇదే ధోరణి కనపడింది. అదే సమయంలో... తెదేపాతో ముందస్తు అవగాహన ఉన్నా, పీడీఎఫ్‌ నుంచి నూరుశాతం ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు తెదేపాకి వెళ్లలేదు. పీడీఎఫ్‌ అభ్యర్థుల ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు... వైకాపా అభ్యర్థులకు గణనీయమైన సంఖ్యలోనే బదిలీ అయ్యాయి. భాజపా అభ్యర్థుల ద్వితీయ ప్రాధాన్యత ఓట్లు కూడా కొంతమేర వైకాపా అభ్యర్థులకు పడ్డాయి. భాజపా, పీడీఎఫ్‌ అభ్యర్థుల ద్వితీయ ప్రాధాన్యత ఓట్లను అన్నిచోట్లా పూర్తిగా లెక్కించాల్సిన అవసరం రాలేదు. కొన్ని ఓట్లు లెక్కించేసరికే తెదేపా అభ్యర్థులకు విజయానికి అవసరమైనన్ని రావడంతో... అక్కడితో వాటి లెక్కింపును నిలిపివేశారు.

ఉత్తరాంధ్రలో..

ఉత్తరాంధ్రలో భాజపా అభ్యర్థి పీవీఎన్‌ మాధవ్‌కి 10,885 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. రెండో ప్రాధాన్యత ఓట్లలో తెదేపాకి 3,959, వైకాపాకి 1,414 ఓట్లు వెళ్లాయి. భాజపా ఓట్లు... వైకాపా అభ్యర్థి కంటే, తెదేపా అభ్యర్థికి దాదాపు మూడు రెట్లు ఎక్కువ పడటం విశేషం.

* ఉత్తరాంధ్రలో పీడీఎఫ్‌ అభ్యర్థి రమాప్రభకు 35,153 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. ఆమె ద్వితీయ ప్రాధాన్యత ఓట్లలో తెదేపా అభ్యర్థికి 6,645, వైకాపా అభ్యర్థికి 2,025 వెళ్లాయి. ఇవి కూడా.. వైకాపా అభ్యర్థి కంటే తెదేపా అభ్యర్థికి మూడు రెట్లకు పైగా పడ్డాయి. తెదేపా, పీడీఎఫ్‌లకు ముందస్తు అవగాహన ఉన్నా.. అక్కడ వైకాపాకి 2,025 ఓట్లు వెళ్లడం విశేషం.

తూర్పు రాయలసీమలో..

తూర్పు రాయలసీమలో భాజపా అభ్యర్థి సన్నారెడ్డి దయాకర్‌రెడ్డికి 6,314 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. రెండో ప్రాధాన్యత ఓట్లలో తెదేపా అభ్యర్థికి 2,004 ఓట్లు, వైకాపా అభ్యర్థికి 1,051 ఓట్లు వెళ్లాయి. అక్కడ తెదేపా అభ్యర్థికి వెళ్లిన ఓట్లలో సగానికి పైగా వైకాపా అభ్యర్థికి వెళ్లడం విశేషం.

* పీడీఎఫ్‌ అభ్యర్థి మీగడ వెంకటేశ్వరరెడ్డికి మొత్తం 38,001 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి.

ఆయనకు సంబంధించిన రెండో ప్రాధాన్యత ఓట్లలో 8,355 తెదేపా అభ్యర్థికి, 2,974 ఓట్లు వైకాపా అభ్యర్థికి వెళ్లాయి.

పశ్చిమ రాయలసీమలో..

పశ్చిమ రాయలసీమలో భాజపా అభ్యర్థి నగరూరు రాఘవేంద్రకు 7,412 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. రెండో ప్రాధాన్యత ఓట్లలో తెదేపా అభ్యర్థికి 3,312, వైకాపా అభ్యర్థికి 1,237 ఓట్లు వెళ్లాయి.

* పీడీఎఫ్‌ అభ్యర్థి పోతుల నాగరాజుకు 18,758 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. ద్వితీయ ప్రాధాన్యత ఓట్లలో తెదేపా అభ్యర్థికి 9,886, వైకాపా అభ్యర్థికి 3,352 ఓట్లు వెళ్లాయి.


ఫ్యాన్‌కు పవర్‌కట్‌ చేశారు

‘పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫ్యాన్‌కు ప్రజలు పవర్‌కట్‌ చేశారు. ఈ విజయం యువతకే అంకితం. జగన్‌ పాలనపై ఉన్న వ్యతిరేకత ఓటు రూపంలో వ్యక్తమైంది. అబద్ధాలు, మోసాలతో ప్రజల్ని ఎక్కువ కాలం మోసం చేయలేరు. సార్వత్రిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఇవే ఫలితాలు పునరావృతమవుతాయి.’  

అచ్చెన్నాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని