రేవంత్‌, సంజయ్‌లకు లీగల్‌ నోటీసులు పంపిస్తున్నా

తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వ్యవహారంపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌లకు లీగల్‌ నోటీసులు పంపిస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

Updated : 24 Mar 2023 06:19 IST

టీఎస్‌పీఎస్‌సీ వ్యవహారంలో ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసే కుట్ర
రాజకీయ దురుద్దేశంతోనే నా పేరు లాగేందుకు యత్నం
నిరాధార ఆరోపణలు చేస్తున్నందుకే తాఖీదులు
రాజకీయ ఉచ్చులో యువత చిక్కుకోవద్దు: మంత్రి కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వ్యవహారంపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్‌, భాజపా రాష్ట్ర అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌లకు లీగల్‌ నోటీసులు పంపిస్తున్నట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ కేసులో కేవలం రాజకీయ దురుద్దేశంతోనే తన పేరును లాగేందుకు ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసే కుట్ర చేస్తున్నందుకు వారిద్దరికీ న్యాయపరంగా తాఖీదులిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన కమిషన్‌కు స్వయంప్రతిపత్తి ఉంటుందన్న  విషయంపై అవగాహన లేకుండా.. ఈ అంశంలోకి ప్రభుత్వాన్ని, తనను లాగుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. వాస్తవాలన్నింటినీ పక్కనపెట్టి.. ఈ మొత్తం వ్యవహారం ప్రభుత్వ పరిధిలో జరుగుతున్న అంశంగా చిత్రీకరించే దుర్మార్గపూరిత కుట్రలకు సంజయ్‌, రేవంత్‌లు తెరలేపారని విమర్శించారు. బట్ట కాల్చి మీదేసే ఇలాంటి యత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించనని మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు.

పిచ్చోడి చేతిలో రాయిలా కాంగ్రెస్‌, భాజపాల పరిస్థితి

‘రేవంత్‌, సంజయ్‌లు ఇప్పటికే తమ తెలివితక్కువ ప్రకటనలు, మతిలేని మాటలతో ప్రజల్లో చులకన అయ్యారు. గతంలో కొవిడ్‌ సందర్భంగా రూ.10 వేల కోట్ల వ్యాక్సిన్‌ కుంభకోణం జరిగిందని, రూ.వేల కోట్ల విలువ చేసే నిజాం నగల కోసమే పాత సచివాలయం కూల్చివేస్తున్నారనే వ్యాఖ్యలు చేసి రేవంత్‌రెడ్డి నవ్వులపాలయ్యారు. రేవంత్‌తో పోటీపడి శవాలు-శివాలు, బండి పోతే బండి ఫ్రీ అంటూ సంజయ్‌ చేసిన అర్థరహిత వ్యాఖ్యలనూ ప్రజలు గమనించారు. వీరి వ్యాఖ్యలు, వ్యవహారశైలిని గమనించిన తర్వాత.. వీరిద్దరూ మానసిక సంతులనం కోల్పోయారని ప్రజలు భావిస్తున్నారు. వీరిద్దరి నాయకత్వంలో కాంగ్రెస్‌, భాజపాల పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలా మారింది.

ఆ పార్టీల దుష్ప్రచారం వెనుక కుతంత్రం

టీఎస్‌పీఎస్‌సీ అంశంలో కాంగ్రెస్‌, భాజపా చేస్తున్న దుష్ప్రచారాల వెనుక.. మొత్తం ఉద్యోగాల భర్తీ ప్రక్రియనే నిలిపివేయాలనే ఒక భయంకరమైన కుతంత్రం దాగి ఉంది. ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడాన్నే ఒక కుట్రగా ఈ నాయకులు గతంలో అభివర్ణించారు. చదువులను పక్కనపెట్టి తమ రాజకీయాల కోసం యువత కలిసిరావాలని గతంలో చేసిన వ్యాఖ్యలు వారి కుటిల మనస్తత్వానికి అద్దం పడుతున్నాయి. సంబంధం లేని మరణాలను కూడా ఈ వ్యవహారంతో అంటగట్టి.. యువత ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా చేసిన వికృత యత్నాలు విఫలమైనా వారిలో మార్పు రాలేదు. రాజకీయ రాబందుల మాదిరిగా కాంగ్రెస్‌, భాజపా మారాయి’’ అని కేటీఆర్‌ పేర్కొన్నారు.


యువతా.. పోటీ పరీక్షలపైనే దృష్టి సారించండి

‘‘యువత పోటీ పరీక్షల సన్నద్ధతపైనే తమ దృష్టి సారించండి. టీఎస్‌పీఎస్‌సీ ఇప్పటికే దిద్దుబాటు చర్యలను ప్రారంభించింది. భవిష్యత్తులో జరిగే పరీక్షలను మరింత కట్టుదిట్టంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించేందుకు సన్నద్ధమవుతోంది. కేవలం రాజకీయాల కోసం జరుగుతున్న దుర్మార్గపూరిత కుట్రలు, ప్రచారాల ఉచ్చులో యువత చిక్కుకోవద్దు’’ అని మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని