రాష్ట్రంలో రాచరిక పాలన.. సీఎం జగన్‌, సజ్జలపై ఎమ్మెల్యే ఆనం ధ్వజం

వైకాపా ప్రభుత్వం చక్రవర్తులు, రాజుల ఏలుబడిలో ఉండే రాచరిక పాలన సాగిస్తోందని, ఇక్కడ అంతా ఏకఛత్రాధిపత్యమేనని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి విమర్శించారు.

Updated : 27 Mar 2023 09:43 IST

నేను కేసులు ఎదుర్కోవడానికో, కుటుంబసభ్యుల్ని హతమార్చడానికో రాజకీయాల్లోకి రాలేదు  
సజ్జల వేల కోట్లు ఎలా సంపాదించారో తెలుసు

ఈనాడు డిజిటల్‌, నెల్లూరు: వైకాపా ప్రభుత్వం చక్రవర్తులు, రాజుల ఏలుబడిలో ఉండే రాచరిక పాలన సాగిస్తోందని, ఇక్కడ అంతా ఏకఛత్రాధిపత్యమేనని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి విమర్శించారు. నేను సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కోవడానికో.. కుటుంబసభ్యులను హత్య చేయడానికో రాజకీయాల్లోకి రాలేదని పరోక్షంగా విమర్శలు చేశారు. ఎనిమిది దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న కుటుంబం నుంచి వచ్చానని, నిరంతరం ప్రజల సమస్యలపై పోరాడతానని స్పష్టం చేశారు. ‘నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నా. ఏనాడూ ప్రజాస్వామ్య విలువలు ఇంతలా దిగజారలేదు. ఎంతో మంది పెద్ద నేతలతో పనిచేశా. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులు చూడలేదు. ప్రశ్నిస్తే ఆరోపణలు చేస్తున్నారు’ అని మండిపడ్డారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌కు పాల్పడ్డారన్న ఆరోపణలతో వైకాపా నుంచి సస్పెండయిన తర్వాత ఆయన తొలిసారిగా హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.

ప్రశ్నిస్తున్నాననే పక్కన పెట్టారు

రాష్ట్రంతో పాటు మా జిల్లాలో జరిగే దోపిడీ వ్యవస్థలపై ప్రశ్నించా. విమర్శించా. అభివృద్ధి నిలిచిపోయిందని.. అరాచకాలు జరుగుతున్నాయని చెప్పాను. ముఖ్యమంత్రిని కలిసిన ప్రతిసారీ వినతిపత్రం అందజేశాను. అక్కడి నుంచి స్పందన లేదు. కనీసం ప్రత్యుత్తరమూ లేదు. నాలుగు నెలలుగా పదేపదే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను. అందుకే నన్ను పక్కనపెట్టి నా నియోజకవర్గంలో రాజ్యాంగేతర శక్తిని ఇన్‌ఛార్జిగా పెట్టారు. నాకు సహకరించొద్దని కలెక్టర్‌, ఎస్పీలకు సీఎంవో నుంచి ఫోన్‌ చేసి చెప్పారు. ఆఖరికి నా భద్రతను కూడా తగ్గించారు. వైకాపా ప్రభుత్వ పెద్దలకు భజనపరులే కావాలి.

క్రాస్‌ఓటింగ్‌ చేశానని సజ్జలకు ఎవరు చెప్పారు?

ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచే ప్రశ్నిస్తూ వచ్చాను. ఏ రాజకీయ పార్టీ అయినా దాన్ని సద్విమర్శగా తీసుకుని తప్పుల్ని సరిదిద్దుకునేందుకు ప్రయత్నించాలి. కానీ అధికార పార్టీ ప్రశ్నించే గొంతుకను తొక్కేస్తోంది. మేం అమ్ముడుపోయామంటూ కొందరు చేసిన ఆరోపణలను మీడియాలో చూశాం. నేను క్రాస్‌ ఓటింగ్‌ చేసినట్లు ఎన్నికల కమిషన్‌ను చెప్పమనండి. లేదంటే ఆధారాలు ఉంటే బయటపెట్టండి. నేనే క్రాస్‌ ఓటింగ్‌ చేసినట్లు సజ్జల రామకృష్ణారెడ్డికి ఎవరు చెప్పారు? రాజ్యాంగేతర శక్తితో పరిపాలన చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది? మీడియా ప్రతినిధిగా ఉన్నప్పటి నుంచి సజ్జలను చూస్తున్నాం. ఆయన రూ.వేల కోట్లు ఎలా సంపాదించారో చూశాం. సలహాదారు ఉద్యోగానికి సజ్జల ఎన్ని కోట్లు ఇచ్చారు? పోస్టింగులకు సజ్జల ఎన్ని రూ.కోట్లు తీసుకున్నారో చెప్పాలి. అందరూ ఆయనలాగే అందరూ ఉంటారని అనుకుంటున్నారు. రాజకీయ జీవితంలో ఇలాంటి నిందలు, ఆరోపణలు సహజం. మా గురించి తెలిసినవారు వాటిని విశ్వసించరు. ఇలాంటి చిల్లర వ్యవహారాలకు మేం పాల్పడ్డామని భావిస్తే అది వాళ్ల ఖర్మ.

తెదేపాలో చెబితే వినేవారు..

రాజశేఖరరెడ్డి ప్రజాస్వామ్యవాది. ప్రజాస్వామ్యమంటేనే తెలియని వ్యక్తి జగన్‌మోహన్‌రెడ్డి. ఆయన నన్ను ఓటు అడగలేదు. ఫలానా వారికి వేయమని చెప్పలేదు. అలాంటప్పుడు క్రాస్‌ ఓటింగ్‌ చేశాననడానికి ఆస్కారం లేదు. తెదేపాలో ఏమైనా సమస్యలు వస్తే వినేవారు. అర్థం చేసుకునేవారు. కానీ వైకాపాలో అలాంటి పరిస్థితులు లేవు. ఈ ప్రభుత్వంలో కుంభకోణాలు తప్ప మరేమీ లేవు. నేనెప్పుడూ నా వ్యక్తిగత పనులు చేయాలని ప్రభుత్వాన్ని కోరలేదు. అధికారుల మెడపై కత్తిపెట్టి పని చేయమనడానికి.. మీరేం చక్రవర్తులు కాదు. సామ్రాజ్యాధీశులు కాదు. విలువలు లేవు కాబట్టే సజ్జల అందరిపై ఆరోపణలు చేస్తున్నారు.

భవిష్యత్తు ఏమిటో చూడాలి

వచ్చే ఎన్నికల్లో నేనే పోటీ చేస్తా. నా కుటుంబసభ్యులు ఎవరు రాజకీయాల్లోకి వస్తారనేది అప్పటి పరిస్థితులను బట్టి ఉంటుంది. వైకాపా తర్వాత ఎటు అనేది చూడాలి. నా భవిష్యత్తు ప్రారంభమైందే తెదేపాలో.. మా కార్యకర్తలు, సన్నిహితుల సలహాలతో త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటా’ అని ఆనం పేర్కొన్నారు.

విలువల్లేని వారితో నడిచినందుకు బాధపడుతున్నా..

మీరేమైనా అనుకోండి.. మేం అనుకున్నదే చేస్తాం అన్నట్లుగా వారి వ్యవహారశైలి ఉంది. అలాంటి సలహాదారులతో నడిచే ప్రభుత్వ మనుగడ భవిష్యత్తులో ప్రశ్నార్థకం అవుతుంది. క్రాస్‌ ఓటింగ్‌ను నిర్ధారించడం రహస్య ఓటింగ్‌లో సాధ్యం కాదు. నన్ను తప్పించడానికి నాలుగు నెలల కిందటే కుట్ర చేశారు. ఇప్పుడు ఇలా సస్పెండ్‌ చేశారు. రాజకీయ అహంకారపూరిత ధోరణితో ఉన్న వ్యవస్థలో మమ్మల్ని ఉంచుకోవడం వారికి ఇష్టం లేదు. గతంలో ముఖ్యమంత్రులు ప్రజాస్వామ్య విలువలతో పాటు పార్టీలోని వ్యక్తులను గౌరవించేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రజాస్వామ్య విలువలు తెలియని వ్యక్తులతో నాలుగేళ్లు నడిచినందుకు బాధపడుతున్నాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని