సంక్షిప్త వార్తలు (10)

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో భారీఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు వస్తున్న క్రమంలో అనిశా విచారణ చేపట్టాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది.

Updated : 02 Apr 2023 06:41 IST

టీఎస్‌పీఎస్సీలో అక్రమాలపై విచారణ చేపట్టండి

అనిశా డీజీ రవిగుప్తాకు కాంగ్రెస్‌ ఫిర్యాదు

బంజారాహిల్స్‌, న్యూస్‌టుడే: టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో భారీఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు వస్తున్న క్రమంలో అనిశా విచారణ చేపట్టాలని కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు కాంగ్రెస్‌ విద్యార్థి, నిరుద్యోగ ఉద్యమాల కమిటీ ఛైర్మన్‌ మల్లు రవి, కన్వీనర్‌ బల్మూరి వెంకట్‌, సభ్యులు మానవతారాయ్‌, చరణ్‌కౌశిక్‌ యాదవ్‌ శనివారం బంజారాహిల్స్‌లోని అనిశా ప్రధాన కార్యాలయంలో డీజీ రవిగుప్తాకు ఫిర్యాదు చేశారు.


నేడు రౌండ్‌టేబుల్‌ సమావేశం

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: ప్రశ్నపత్రాల లీకేజీకి సంబంధించి ఉద్యమ కార్యచరణ రూపకల్పనకు ఆదివారం కాంగ్రెస్‌ విద్యార్థి, నిరుద్యోగ ఉద్యమ కమిటీ ఆధ్వర్యంలో  నాంపల్లిలోని మదీనా ఎడ్యుకేషన్‌ సొసైటీలో అఖిలపక్ష రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహిస్తున్నట్లు కమిటీ ఛైర్మన్‌ మల్లు రవి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.


నేడు పీసీసీ విస్తృతస్థాయి సమావేశం

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: హైదరాబాద్‌ గాంధీభవన్‌లో ఆదివారం మధ్యాహ్నం పీసీసీ విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రేతో పాటు ఏఐసీసీ కార్యదర్శులు, సీనియర్‌ నేతలు హాజరవుతారని పేర్కొన్నారు.

*  రాహుల్‌గాంధీ పార్లమెంటు సభ్యత్వ రద్దును నిరసిస్తూ పీసీసీ ఎస్సీ,ఎస్టీ,ఓబీసీ, మైనార్టీ విభాగాలు సంయుక్తంగా శనివారం గాంధీభవన్‌లోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా ఆయా విభాగాల అధ్యక్షులు మాట్లాడుతూ.. భాజపాకు వ్యతిరేకంగా రాహుల్‌ చేస్తున్న పోరాటానికి అండగా ఉంటామన్నారు.


తెజసకి గంగాపురం వెంకట్‌రెడ్డి రాజీనామా

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ జన సమితి(తెజస)కి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి గంగాపురం వెంకట్‌రెడ్డి రాజీనామా చేశారు. పార్టీ అధ్యక్షుడు ఆచార్య కోదండరాంకు శనివారం రాజీనామా లేఖను పంపించారు. పార్టీ విధానపరమైన నిర్ణయాలతో విభేదించి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. వెంకట్‌రెడ్డి 2014 నుంచి తెజసలో అధికార ప్రతినిధిగా, ఉపాధ్యక్షుడిగా, ప్రధాన కార్యదర్శిగా పదవులు నిర్వహించారు. మరోవైపు ఆయన ఈ నెల ఏడో తేదీన భాజపాలో చేరనున్నట్లు తెలిసింది.


ఓటమి భయంతో వైకాపా నేతలు పిచ్చిపట్టినట్టు మాట్లాడుతున్నారు
తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు

ఈనాడు డిజిటల్‌, అమరావతి : ఓటమి భయంతోనే వైకాపా నేతలు పిచ్చిపట్టినట్టు మాట్లాడుతున్నారని తెదేపా ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు మండిపడ్డారు. ‘‘పేదల రేషన్‌ బియ్యం స్వాహా చేసిన వైకాపా ఎమ్మెల్యే మధుసూధన్‌రెడ్డి లాంటి వాళ్లు చంద్రబాబు గురించి అనుచితంగా మాట్లాడటం సిగ్గుచేటు. అధికారం కోసం సొంత బాబాయ్‌ని హత్య చేయించిన చరిత్ర జగన్‌ది. నాలుక మడతేయటం, సొంత మనుషుల్నే బలి ఇవ్వడం వైకాపా సంస్కృతి’’ అని శనివారం ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు.


తెదేపా ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో 25 మందికి ఉద్యోగాలు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: తెదేపా ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 25 మంది నిరుద్యోగ యువతీ, యువకులకు వివిధ ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు లభించాయి. ఈ మేరకు మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు వారికి నియామక పత్రాలను అందజేశారు. డా.రవి వేమూరు సారథ్యంలో తెదేపా కేంద్ర కార్యాలయంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు తెదేపా ఎన్నారై విభాగం ప్రతినిధులు వెల్లడించారు.


ఇటలీ, మాల్టా, ఐర్లాండ్‌ దేశాల్లో తెదేపా ఎన్నారై విభాగం కమిటీలు

ఈనాడు డిజిటల్‌, అమరావతి: యూరోపియన్‌ దేశాలైన ఇటలీ, మాల్టా, ఐర్లాండ్‌లలో తెదేపా ఎన్నారై విభాగం కమిటీలను ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇటలీ తెదేపా ఎన్నారై విభాగం అధ్యక్షుడిగా జి.సాయికృష్ణ, ఉపాధ్యక్షుడిగా పి.సతీశ్‌, ప్రధానకార్యదర్శిగా బి.గోపికృష్ణ, కోశాధికారిగా గోపీకృష్ణ, రీజినల్‌ కౌన్సిల్‌ ప్రతినిధిగా ఎం.సూర్యతేజ, సోషల్‌మీడియా కోఆర్డినేటర్‌గా ఎం.సతీశ్‌లను నియమించారు.

* మాల్టా తెదేపా ఎన్నారై విభాగం అధ్యక్షుడిగా పి.శివాజీ, ఉపాధ్యక్షుడిగా వి.నారాయణ, ప్రధానకార్యదర్శిగా విజయ్‌కుమార్‌, కోశాధికారిగా పి.సుమంత్‌బాబు, రీజినల్‌ కౌన్సిల్‌ ప్రతినిధిగా పి.ఆనంద్‌కుమార్‌, సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌గా డి.హరీశ్‌లను నియమించారు.

* ఐర్లాండ్‌ తెదేపా ఎన్నారై విభాగం అధ్యక్షుడిగా బి.భరత్‌, ఉపాధ్యక్షుడిగా పి.రాజేశ్‌, ప్రధాన కార్యదర్శిగా ఎం.జగన్‌రెడ్డి, కోశాధికారిగా యశ్వంత్‌, రీజినల్‌ కౌన్సిల్‌ ప్రతినిధిగా సీహెచ్‌.కిషోర్‌బాబు, సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌గా జి.రంగా నియమితులయ్యారు.


నేటి నుంచి తెనాలి శ్రావణ్‌కుమార్‌ పాదయాత్ర

మేడికొండూరు, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా తెదేపా అధ్యక్షుడు తెనాలి శ్రావణ్ కుమార్‌ తన సామాజిక న్యాయ చైతన్య పాదయాత్రను ఆదివారం ప్రారంభిస్తారని పార్టీ నాయకులు శనివారం తెలిపారు. తాడికొండ నియోజకవర్గం మేడికొండూరు మండలం వరగానిలో యాత్ర ప్రారంభమై మందపాడు, విశదల గ్రామాల్లో సాగనుంది. నియోజకవర్గం పరిధిలోని నాలుగు మండలాల్లో ఈ నెల 20వ తేదీ వరకు పాదయాత్ర జరుగనుంది. యాత్రలో భాగంగా శ్రావణ్‌కుమార్‌ రాత్రి వేళ గ్రామాల్లో బస చేయనున్నారు.


కేంద్ర ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలపై ఉద్ధృత ప్రచారం

ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి మెయ్యప్పన్‌

ఈనాడు, అమరావతి: రాజ్యాంగ వ్యవస్థలను చేతుల్లో పెట్టుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలను మరింత ఉద్ధృతం చేస్తామని ఏపీ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జి, అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ (ఏఐసీసీ) కార్యదర్శి మెయ్యప్పన్‌ ప్రకటించారు. విజయవాడలో శనివారం నిర్వహించిన కాంగ్రెస్‌ కార్యకర్తల రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలోనూ, అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేయడంపైనే కాంగ్రెస్‌ పోరాటం చేయడం లేదని, దేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని ఉద్యమిస్తున్నామని మెయ్యప్పన్‌ అన్నారు. రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని దేశంలోని అనేక పార్టీలు తీవ్రంగా ఖండించినా రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలు స్పందించకపోవడం దుర్మార్గమని ఏపీ కాంగ్రెస్‌ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు అన్నారు. ప్రధాని డిగ్రీ సర్టిఫికెట్‌ చూపడం దేశ భద్రతకు సంబంధించిన అంశమా అని రాజ్యసభ మాజీ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రశ్నించారు.


ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదు

మాజీ మంత్రి బాలినేని

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం వైకాపా ప్రభుత్వానికి లేదని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఒంగోలులో ఆయన శనివారం మీడియా ప్రతినిధులతో  ముచ్చటించారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ.. షెడ్యూల్‌ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయన్నారు. అయిదేళ్లు పరిపాలించాలనే ఉద్దేశంతోనే ప్రజలు ఓట్లు వేసి తమను గెలిపించారని.. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం పూర్తికాలం పనిచేస్తుందని చెప్పారు. అమరావతిలో భాజపా నాయకులపై వైకాపా కార్యకర్తల దాడి గురించి మాట్లాడుతూ.. ఆ పార్టీ తమకేమీ ప్రధాన పోటీదారు కాదని.. వ్యక్తిగత అంశాలతో ఆ ఘటన చోటుచేసుకుని ఉంటుందని వ్యాఖ్యానించారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని