Karnataka Results : 34 ఏళ్ల తర్వాత.. కన్నడనాట కాంగ్రెస్‌కు భారీ విజయం

కాంగ్రెస్‌కు కర్ణాటకలో ఇంత భారీ విజయం దక్కడం 1989 తర్వాత ఇదే తొలిసారి. ఆ ఎన్నికల్లో హస్తం పార్టీ 221 సీట్లలో పోటీ చేసి 43.76% ఓట్లతో 178 సీట్లు దక్కించుకొంది.

Updated : 14 May 2023 09:33 IST

ఈనాడు, దిల్లీ: కాంగ్రెస్‌కు కర్ణాటకలో ఇంత భారీ విజయం దక్కడం 1989 తర్వాత ఇదే తొలిసారి. ఆ ఎన్నికల్లో హస్తం పార్టీ 221 సీట్లలో పోటీ చేసి 43.76% ఓట్లతో 178 సీట్లు దక్కించుకొంది. ఆ తర్వాత 1999 (132 సీట్లు/40.84%ఓట్లు), 2013 (122 సీట్లు/36.59%)ల్లో కాంగ్రెస్‌ సొంత మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా ఇంత ఎక్కువ సంఖ్యలో సీట్లు, ఓట్లు దక్కించుకోలేదు. 2013 ఎన్నికలతో పోలిస్తే 2018 ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని 36.59% నుంచి 38.04%కి పెంచుకున్నప్పటికీ సీట్లు 122 నుంచి 78కి పడిపోవడంతో అధికారానికి దూరంగా ఉండాల్సి వచ్చింది. భాజపాను అధికారానికి దూరంగా పెట్టడానికి 2004, 2018లో జేడీఎస్‌తో కలిసి అధికారాన్ని ఏర్పాటు చేసినా అది మూన్నాళ్ల ముచ్చటగానే ఉండిపోయింది. 1989 నుంచి 2018 మధ్యకాలంలో జరిగిన ఎన్నికల్లో భాజపా వరుసగా 4, 40, 44, 79, 110, 40, 104 సీట్లు గెలుచుకొన్నప్పటికీ ఒక్కసారి కూడా మ్యాజిక్‌ ఫిగర్‌ 113ని దక్కించుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. 1989-2018 మధ్యకాలంలో జరిగిన ఎన్నికల్లో పార్టీ ఓట్లశాతం (4.14%, 16.99%, 20.69%, 28.33%, 33.86%, 19.80%, 36.22%)లో భారీ హెచ్చుతగ్గులు కనిపించాయి.

ఇదే సమయంలో కాంగ్రెస్‌ 43.76%, 26.95%, 40.84%, 35.27%, 34.76%, 36.59%, 38.04% ఓట్లు సాధించి నిలకడైన పనితీరు కనబరిచింది. 1989లో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన లింగాయత నేత వీరేంద్ర పాటిల్‌ను అవమానకరంగా పదవీచ్యుతున్ని చేసి వరుసగా సీఎంలను మార్చడంతో ఆ తదుపరి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ 34 సీట్లు, 26.95% ఓట్లకు పడిపోయింది. 2018 ఎన్నికల్లో భాజపా కంటే (36.22%), కాంగ్రెస్‌కు (38.04%) ఓట్లు ఎక్కువ వచ్చినప్పటికీ సీట్లలో 26మేర అంతరం ఉండటంతో అధికారానికి దూరమైంది. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌ 42.88% ఓట్లు సాధించి 135 సీట్లు గెలుచుకొంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈ పార్టీకి ఓట్లు 4.84% పెరిగినప్పటికీ సీట్లు మాత్రం ఏకంగా 57 మేర పెరిగాయి. భాజపా ఓట్లు 0.22% మాత్రమే తగ్గినప్పటికీ సీట్లు ఏకంగా 38మేర పడిపోయాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి జేడీఎస్‌ ఓట్లు 18.36% నుంచి 13.29%కి, సీట్లు 37 నుంచి 19కి పడిపోయాయి. 5.07% ఓట్లను కోల్పోవడం ద్వారా ఆ పార్టీ 18 సీట్లను పోగొట్టుకోవాల్సి వచ్చింది. 1999 (10సీట్లు) తర్వాత ఆ పార్టీకి దక్కిన అత్యల్ప ఓట్లు, సీట్లు ఇవే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని