అధికార పార్టీ ఫ్లెక్సీలపై అవ్యాజ ప్రేమ

ఏదైనా వ్యాపార సంస్థను ప్రారంభించే ముందు పొరపాటున అనుమతులు తీసుకోకుండా ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు పెట్టినా, స్తంభాలకు ప్రచార బోర్డులు కట్టినా పుర, నగరపాలక సంస్థల ఉద్యోగులు క్షణాల్లో వాటిని తొలగించేస్తారు.

Published : 01 Jun 2023 04:38 IST

ఇష్టారాజ్యంగా ఏర్పాటుచేస్తున్న నేతలు
ఆదాయం పోతున్నా పట్టించుకోని  పుర, నగరపాలక అధికారులు
ప్రతిపక్షాల ఫ్లెక్సీలపై మాత్రం దండయాత్ర
వివాదాస్పదమవుతున్న పోలీసుల అత్యుత్సాహం

ఈనాడు, అమరావతి: ఏదైనా వ్యాపార సంస్థను ప్రారంభించే ముందు పొరపాటున అనుమతులు తీసుకోకుండా ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు పెట్టినా, స్తంభాలకు ప్రచార బోర్డులు కట్టినా పుర, నగరపాలక సంస్థల ఉద్యోగులు క్షణాల్లో వాటిని తొలగించేస్తారు. అవే నగరాలు, పట్టణాల్లో రూపాయి చెల్లించకుండా వైకాపా నాయకులు ఫ్లెక్సీలు పెడితే అధికారులకు కనిపించవా? వాటిని తొలగిస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు కన్నెర్ర చేస్తారని భయమా? అన్న ప్రశ్నలు వస్తున్నాయి. సామాన్యుల ముక్కుపిండి ఆస్తి, చెత్త పన్ను వసూలు చేయిస్తున్న కమిషనర్లు.. ఫ్లెక్సీల బాగోతాన్ని చూసీచూడనట్లు వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. తమ సంస్థకు రావాల్సిన ఆదాయం పోతున్నా వారెందుకు పట్టించుకోరని నిలదీస్తున్నారు. ఇవే ఫ్లెక్సీలను ప్రతిపక్షాలు ఏర్పాటుచేస్తే అనుమతుల్లేవంటూ సిబ్బంది ఆగమేఘాలపై తొలగిస్తున్నారు. పోలీసులైతే అడ్డొచ్చిన వారిని పక్కకు తోసేసి మరీ చించేస్తున్నారు. ఎవరైనా అభ్యంతరం చెబితే కేసులు పెడతామని బెదిరిస్తున్నారు.

* మచిలీపట్నంలో రెండు రోజుల కిందట జనసేన కార్యకర్తలు పెట్టిన ఫ్లెక్సీలను నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు తొలగించారు. అధికార వైకాపావారు పెట్టిన ఫ్లెక్సీలను అలాగే ఉంచేసి విధేయత ప్రదర్శించారు. ఇదే నగరంలో బుధవారమూ ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది.

* ఒంగోలు చర్చి సెంటర్‌లో వైకాపా, జనసేన పోటాపోటీగా పెట్టిన ఫ్లెక్సీలు ఇటీవల గొడవకు దారి తీయడంతో రెండింటినీ అక్కడ తొలగించారు. నగరంలోని మిగతాచోట్ల ఉన్న వైకాపా ఫ్లెక్సీల జోలికి మాత్రం వెళ్లడం లేదు.

* రాజమహేంద్రవరంలో తెదేపా మహానాడు సందర్భంగా జాతీయ రహదారిలో ఆ పార్టీ పెట్టిన ఫ్లెక్సీలు, బ్యానర్ల మధ్యలో వైకాపా ఎంపీ భరత్‌ ఫ్లెక్సీలు పెట్టి నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. అయినా పోలీసులు, పట్టణ ప్రణాళిక అధికారులు పట్టించుకోలేదు.

ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు

అధికార వైకాపా నేతలు అనుమతులు తీసుకోకుండా ఏర్పాటుచేస్తున్న ఫ్లెక్సీలపై తెదేపా, జనసేన ఫిర్యాదులు చేస్తున్నా పుర, నగరపాలక అధికారులు పట్టించుకోవడం లేదు. వాహనాలకు అడ్డంగా, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించేలా చాలా చోట్ల నెలల తరబడి ఫ్లెక్సీలు ఉంటున్నాయి. తిరుపతిలో వైకాపా ఫ్లెక్సీలు తొలగించకపోతే ఆందోళన చేస్తామని జనసేన హెచ్చరించాకగానీ అధికారులు కదలలేదు. విశాఖ సత్యం కూడలిలో అనుమతుల్లేకుండా, ప్రతిపక్షాలను రెచ్చగొట్టేలా అధికార పార్టీ నేతలు పెట్టిన ఫ్లెక్సీ వైకాపా, జనసేన కార్యకర్తల మధ్య గొడవకు దారి తీసింది.

ఆ ఫ్లెక్సీల వైపు చూడొద్దు

నగరాలు, పట్టణాల్లో ఫ్లెక్సీలు కట్టాలంటే నిర్దేశిత ఫీజులను పుర, నగరపాలక సంస్థల్లో చెల్లించి అనుమతులు తీసుకోవాలి. ఈ నిబంధనను వైకాపా నేతలు ఉల్లంఘించి ప్రధాన కూడళ్లలోనూ పోటాపోటీగా, తాటి చెట్టును మించి ఎత్తులో ఫ్లెక్సీలు కట్టేస్తున్నారు. అదే స్థానంలో మరో ఫ్లెక్సీ ఏర్పాటుచేసే వరకు పాతవి ఉంటున్నా అధికారులకు కనిపించడం లేదు. విజయవాడలో రోడ్ల మధ్య డివైడర్లపై ఉన్న స్తంభాలకు ఫ్లెక్సీలు పెట్టరాదన్న నిబంధన అధికార పార్టీ నాయకులకు పట్టడం లేదు. వారధి వంతెనపై ఫ్లెక్సీలు కట్టరాదన్న నిబంధననూ గాలికొదిలేశారు. బెంజి సర్కిల్‌లో వంతెన కింద స్తంభాలకు పెట్టిన ఫ్లెక్సీలు ఎదురుగా కనిపిస్తున్నా పోలీసులు, పట్టణ ప్రణాళిక అధికారులకు కనిపించడం లేదు.

గొడవలకు దారి తీస్తున్న ఫ్లెక్సీలు

ప్రతిపక్షాలను రెచ్చగొట్టేలా వైకాపా నేతలు పెడుతున్న ఫ్లెక్సీలను అధికారులు తొలగించడం లేదు. దీంతో ప్రతిపక్షాలూ పోటీగా ఫ్లెక్సీలు పెడుతున్నాయి. ఫ్లెక్సీల యుద్ధం చివరకు తగాదాలకు దారి తీస్తోంది. మచిలీపట్నం, విశాఖపట్నం, ఒంగోలులో జరిగిన గొడవలకు ఇలాంటివే కారణమవుతున్నాయి. రాజకీయ పార్టీల తరఫున వివిధ సందర్భాల్లో ఫ్లెక్సీలు పెట్టినా 24 గంటల్లో వాటిని తొలగించే విధానాన్ని గత ప్రభుత్వ హయాంలో అమలు చేశారు. ఏ రాజకీయ పార్టీ తరఫునైనా నగరాలు, పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు పెట్టినా మొదటి రోజు చూసీచూడనట్లు అధికారులు వదిలేసేవారు. రెండో రోజు తొలగించి వాహనాల్లో సిబ్బంది తీసుకెళ్లేవారు. ఒకరోజు కంటే మించి ఫ్లెక్సీలు ఉంచాలనుకుంటే సంబంధిత పుర, నగరపాలక సంస్థల్లో నిర్దేశిత ఫీజు చెల్లించేవారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఆ విధానాలకు చెల్లుచీటి పాడారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని