లింగాయత్‌లను ఓబీసీల్లో చేర్చేందుకు కృషి

బసవ లింగాయత్‌లను ఓబీసీ జాబితాలో చేర్చే విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు.. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి నివేదించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు.

Published : 05 Jun 2023 04:04 IST

బహిరంగసభలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హామీ
రాజధానిలో లింగాయత్‌ల మహార్యాలీ

నాంపల్లి, న్యూస్‌టుడే: బసవ లింగాయత్‌లను ఓబీసీ జాబితాలో చేర్చే విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు.. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీకి నివేదించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. తెలంగాణలోని లింగాయత్‌లను బీసీ-డి జాబితా నుంచి ఓబీసీ జాబితాలోకి మార్చాలన్న ప్రధాన డిమాండ్‌తో అఖిలభారత లింగాయత్‌ సమన్వయ సమితి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో భారీ బహిరంగ సభ, అనంతరం మహా ర్యాలీ నిర్వహించారు. సమితి అధ్యక్షుడు డాక్టర్‌ చెన్నబసవానందస్వామీజీ, రాష్ట్రీయ వీరశైవ లింగాయత్‌ లింగ బలిజ సంఘం తెలంగాణ అధ్యక్షుడు, లింగాయత్‌ సమన్వయ సమితి ప్రతినిధి వెన్న ఈశ్వరప్ప తదితరుల నేతృత్వంలో నిర్వహించిన సభకు కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. లింగాయత్‌ల జనాభా అధికంగా ఉన్న చోట వారికే టికెట్లు కేటాయించేలా భాజపా కేంద్ర, రాష్ట్ర అధిష్ఠానాలతో చర్చిస్తానన్నారు. కేంద్ర మంత్రి భగవంత్‌రావ్‌ఖుబా ప్రసంగిస్తూ.. లింగాయత్‌ల సంక్షేమం, వారి అభ్యున్నతి, సమస్యల పరిష్కారానికి కేంద్రంలోని భాజపా సర్కారు ఎప్పుడూ అనుకూలంగానే ఉందన్నారు. రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య మాట్లాడుతూ.. వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్న సమయంలో లింగాయత్‌లను బీసీ-డి జాబితాలో చేర్పించానని, ఇప్పుడు ఓబీసీ జాబితాలో చేర్చేలా కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణిక్‌రావ్‌ ఠాక్రే మాట్లాడుతూ.. లింగాయత్‌ల డిమాండ్లు న్యాయమైనవని, వాటి సాధనకు కాంగ్రెస్‌ పార్టీ మద్దతిస్తుందని తెలిపారు. డాక్టర్‌ చెన్నబసవానందస్వామీజీ, వెన్న ఈశ్వరప్ప, అఖిల భారత లింగాయత్‌ మహాసభ ఉపాధ్యక్షుడు శివ్‌రాజ్‌పాటిల్‌, రాష్ట్ర శాఖ అధ్యక్షుడు విజయ్‌కుమార్‌పట్నె, గణేష్‌ చించొడె, తెలంగాణ రాష్ట్రీయ బసవదళ్‌ అధ్యక్షుడు శంకరప్పపాటిల్‌, నాగరాజ్‌ఖల్సే తదితరులు మాట్లాడుతూ..తెలంగాణలో లింగాయత్‌ ఫైనాన్షియల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌, భారాస గోషామహల్‌ ఇన్‌ఛార్జి నందకిశోర్‌వ్యాస్‌లు కూడా మహార్యాలీకి సంఘీభావం తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని