మేము ఫ్లెక్సీలేస్తే జగన్‌కు గుండెపోటే

‘పాదయాత్ర ప్రారంభంలో అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. నన్ను అడ్డుకోమని పోలీసులను ఉసిగొల్పి పంపారు. ప్రసంగిస్తున్న స్టూల్‌ను కూడా లాక్కున్నారు.

Published : 21 Jul 2023 06:18 IST

అడ్డంకులు సృష్టించినా తగ్గేదేలేదు
కనిగిరి బహిరంగ సభలో లోకేశ్‌
జోరువానలోనూ సాగిన పాదయాత్ర

ఈనాడు, ఒంగోలు: ‘పాదయాత్ర ప్రారంభంలో అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. నన్ను అడ్డుకోమని పోలీసులను ఉసిగొల్పి పంపారు. ప్రసంగిస్తున్న స్టూల్‌ను కూడా లాక్కున్నారు. అయినప్పటికీ నేను తగ్గలేదు. ఇప్పుడు కొత్త నాటకాలు మొదలెట్టారు. యువగళం పాదయాత్ర మొత్తం లైవ్‌లో వస్తుందని తెలియక ఐప్యాక్‌ సభ్యులను పంపుతున్నారు. వాళ్లను తెలుగు తమ్ముళ్లు గుర్తించి పట్టేశారు. చేసేదేమీలేక వాలంటీర్లను సైకో జగన్‌ రంగంలోకి దింపారు. అర్ధరాత్రి దొంగల్లా విద్వేష ఫ్ల్లెక్సీలు పెట్టించారు. కొన్నింటిని చించివేశారు. అవే ఫ్లెక్సీలు మేము పెడితే జగన్‌కు గుండెపోటు వస్తుంది’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. యువగళం పాదయాత్ర 160వ రోజు ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో గురువారం కొనసాగింది. హోరుగాలి, జోరువానలోనూ లోకేశ్‌ 2 కిలోమీటర్లు నడిచారు. దారి పొడవునా మహిళలు వేచి ఉండి హారతులిచ్చారు. యువకులు, ఆయా గ్రామస్థులు కరచాలనం చేసేందుకు పోటీ పడ్డారు. వర్షంలోనూ లోకేశ్‌తో కలిసి మహిళలు, వృద్ధులు, చిన్నారులు నడిచారు.

వైకాపా ఓ చిల్లర పార్టీ

కనిగిరిలోని పామూరు రోడ్డు కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో నారా లోకేశ్‌ ప్రసంగించారు. వచ్చేది తెదేపా ప్రభుత్వమేనని... వడ్డీతో సహా అన్ని తిరిగి చెల్లిస్తామన్నారు. తమను కెలికితే జగన్‌కు నిద్ర లేకుండా చేస్తామని లోకేశ్‌ హెచ్చరించారు. రాజశేఖరరెడ్డి అసలైన వారసురాలు షర్మిలనే అన్నారు.

అతడో చంచల్‌గూడ జైలు స్టూడెంట్‌

‘సాగనిస్తే పాదయాత్ర.. లేకుంటే దండయాత్రే అని గతంలో చెప్పాను. కానీ ఇప్పుడు మాత్రం సాగనిస్తే దండయాత్ర.. అడ్డుకుంటే వైకాపాకు అంతిమయాత్ర అని చెబుతున్నాను’ అని లోకేశ్‌ అన్నారు. చంచల్‌గూడ జైల్‌ స్టూడెంట్‌ నంబరు 6093 అయిన జగన్‌ విశ్వవిద్యాలయాలు ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జ్‌తో పోటీ పడాలంటూ ఈ మధ్య జబర్దస్త్‌ కామిడీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ‘అరకు లోయ డిగ్రీ కళాశాల పైకప్పు కూలింది. పులిరాముడిగూడెంలో గిరిజన సంక్షేమ హాస్టల్‌లో నాలుగో తరగతి చదువుతున్న అఖిల్‌ను చంపేశారు. పాఠశాలల్లో ఉపాధ్యాయులు లేరు. యూనివర్సిటీలను వైకాపా కార్యాలయాలుగా మార్చారు. కొత్తగా ఒక్క ప్రొఫెసర్‌ను కూడా నియమించలేదు..  పది ఫెయిల్‌ అయిన జగన్‌కు ఆక్స్‌ఫర్డ్‌, కేంబ్రిడ్జ్‌ వంటి పదాలు అవసరమా’ అని లోకేశ్‌ ఎద్దేవా చేశారు.

ముఖ్యమంత్రి జగన్‌ పాలనలో మైనారిటీలు చిత్రహింసలకు గురవుతున్నారని లోకేశ్‌ అన్నారు. బహిరంగ సభలో తెదేపా కనిగిరి నియోజకవర్గ బాధ్యుడు ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, కొండపి, అద్దంకి, పర్చూరు ఎమ్మెల్యేలు బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్‌, ఏలూరి సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్‌, బీఎన్‌.విజయ్‌కుమార్‌, ముత్తుముల అశోక్‌రెడ్డి, నేతలు గుడూరి ఎరిక్షన్‌బాబు, దామచర్ల సత్య, నూకసాని బాలాజీ, బీసీ.జనార్దన్‌రెడ్డి, కొండయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని