ప్రతి ‘అసెంబ్లీ’ స్థానంలో 10వేల నకిలీ ఓట్లు చేర్చేందుకు వైకాపా కుట్ర

‘రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10 వేలకు పైగా నకిలీ ఓటర్ల పేర్లను చేర్చేందుకు వైకాపా ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. కేంద్ర ఎలక్షన్‌ కమిషన్‌ ఈ విషయంపై చాలా సీరియస్‌గా ఉంది.

Published : 22 Aug 2023 05:26 IST

సీఎం జగన్‌ పాలనపై విరుచుకుపడ్డ భాజపా నేత బండి సంజయ్‌

ఈనాడు, అమరావతి: ‘రాష్ట్రంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10 వేలకు పైగా నకిలీ ఓటర్ల పేర్లను చేర్చేందుకు వైకాపా ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. కేంద్ర ఎలక్షన్‌ కమిషన్‌ ఈ విషయంపై చాలా సీరియస్‌గా ఉంది. అందులో భాగంగానే అనంతపురం జడ్పీ సీఈవోను సస్పెండ్‌ చేసింది’ అని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ విమర్శించారు. ఓటర్‌ చేతన్‌ మహాభియాన్‌లో భాగంగా సోమవారం బండి సంజయ్‌ విజయవాడలోని పార్టీ శ్రేణులను ఉద్దేశించి హైదరాబాద్‌ నుంచి వర్చువల్‌ విధానంలో మాట్లాడారు. గంజాయి విక్రయాలు, ఇసుక దందా, భూ కబ్జాలు ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్నాయి. కొండలను కూడా మాయం చేస్తున్నారు మందుబాబులను తాకట్టు పెట్టి అప్పు చేస్తున్న ఏకైక సర్కార్‌ జగన్‌దే. మద్యాన్ని నిషేధిస్తామని హామీలు గుప్పించి.. మద్యం బాండ్లు రిలీజ్‌ చేయడం దారుణం. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. ఈ సారి వైకాపా అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్న భావన ప్రజల్లో నెలకొంది’ అని బండి సంజయ్‌ అభిప్రాయపడ్డారు. ‘రాష్ట్రంలో ఒక వర్గానికే కొమ్ముకాస్తూ అరాచక పాలన కొనసాగిస్తున్న ఏపీ ప్రభుత్వాన్ని నామరూపాల్లేకుండా చేయాలి’ అని పిలుపునిచ్చారు.

‘రాష్ట్రంలో హిందూ మతంపై పెద్ద ఎత్తున దాడి జరుగుతోంది. కొత్తగా నియమితులైన టీటీడీ ఛైర్మన్‌ ఎవరు? ఆయన కుమార్తె వివాహం క్రైస్తవ ఆచార విధానంలో జరిగిన మాట వాస్తవం కాదా? నేను నాస్తికుడినని ఆయన గతంలో చెప్పలేదా? తిరుమలకు వచ్చే భక్తులను కాపాడలేక కర్రలిస్తారా? ప్రజాభిమానం కలిగిన జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ యాత్రను అడ్డుకోవడమేమిటి? కేంద్రం నిధులతోనే అంతో..ఇంతో రాష్ట్రాభివృద్ధి జరుగుతోంది. రూ.10 లక్షల కోట్ల అప్పులు చేసి ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే వాటిని ఎలా తీరుస్తుందో ఆలోచించండి. అదే భాజపాకు అధికారమిస్తేనే కేంద్ర సహకారంతో అప్పులు తీర్చడంతోపాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయవచ్చని గమనించాలి. రానున్న ఎన్నికల్లో భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి నాయకత్వంలో భాజపా సత్తా చాటడం ఖాయం’ అని బండి సంజయ్‌ పేర్కొన్నారు.

హైదరాబాద్‌ కేంద్రంగా ఓటర్ల తొలగింపు: పురందేశ్వరి

రాష్ట్రంలో ఓటర్ల జాబితా తయారీ సందర్భంగా టాంపరింగ్‌ మొదలైందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపించారు. ‘తెదేపా హయాంలోనూ ఓట్ల గల్లంతు జరిగింది. విశాఖలోని భాజపా మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు నియోజకవర్గంలో 2.60 లక్షల ఓట్లు ఉన్నాయి. ఇందులో 70 వేల అనర్హుల ఓట్లు ఉన్నాయంటే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఉరవకొండ నియోజకవర్గంలో అక్రమంగా ఓట్లు తొలగించారన్న కారణంతో భాస్కరరెడ్డి, స్వరూపరాణి లను సస్పెండ్‌ చేశారు. ఈ చర్యల ద్వారా రాష్ట్రంలో ఓటర్ల జాబితా ఎలా రూపొందిస్తున్నారన్నది అర్థమవుతోంది. ఒకే ఇంటి నంబర్‌తో వందల ఓట్లు ఉన్నాయి. వాలంటీర్ల ద్వారా సమాచారాన్ని తెప్పించుకొని హైదరాబాద్‌ కేంద్రంగా ఓట్ల తొలగింపు జరుగుతోంది. దొంగ ఓట్లపై ఫిర్యాదులు చేయడానికి పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తాం’ అని వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని