ఏపీ రాజకీయాలతో మాకేంటి సంబంధం?

ఆంధ్రప్రదేశ్‌లో జరిగే రాజకీయాలతో.. తెలంగాణకు సంబంధమేంటని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు.

Updated : 27 Sep 2023 07:16 IST

అది రెండు పార్టీల  రాజకీయ ఘర్షణ
చంద్రబాబు అరెస్టయింది ఏపీలో..  ధర్నాలు చేయాల్సిందీ ఆ రాష్ట్రంలోనే
లోకేశ్‌, జగన్‌, పవన్‌ ముగ్గురూ  నాకు స్నేహితులే: కేటీఆర్‌

ఈనాడు, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో జరిగే రాజకీయాలతో.. తెలంగాణకు సంబంధమేంటని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ ప్రశ్నించారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతుండగా.. ఏపీ రాజకీయాలు, చంద్రబాబు అరెస్టుపై కొందరు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఇది అచ్చంగా రెండు రాజకీయ పార్టీల ఘర్షణ అని పేర్కొన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు అరెస్టయింది ఆంధ్రప్రదేశ్‌లో. ధర్నాలు చేయాల్సింది ఆ రాష్ట్రంలోనే. నిర్మొహమాటంగా చేయండి. ఎవరు వద్దన్నారు? ఇవాళ ఒకరు ర్యాలీలు తీస్తారు. ఇంకోరోజు ఇంకొకరు తీస్తారు. మరి మేం ఏం చేయాలి? పక్కింటి పంచాయితీని ఇక్కడ తేల్చుకుంటారా?  ఆంధ్రప్రదేశ్‌లో ఒకరితోఒకరు తలపడండి. రాజమహేంద్రవరంలో భూమి దద్దరిల్లిపోయేలా ర్యాలీలు తీయండి. మాకేం సంబంధం? వాళ్ల వాళ్ల పంచాయితీలు తెచ్చి హైదరాబాద్‌లో పెడతామంటే ఎలా? మేము ఇక్కడ ప్రభుత్వాన్ని నడుపుతున్నాం. శాంతిభద్రతల సమస్య తలెత్తితే.. ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది కదా. అలాంటప్పుడు ఎలా అనుమతిస్తాం? ఇది అచ్చంగా రెండు రాజకీయ పార్టీల తగాదా. ఆ పార్టీలకు ఇక్కడ ప్రాతినిధ్యం లేదు. సున్నితమైన అంశం అనుకున్నప్పుడు.. సున్నితంగానే వ్యవహరించాలి. రోజూ రన్నింగ్‌ కామెంటరీ లాగా వ్యాఖ్యానించాల్సిన అవసరం లేదు. చంద్రబాబు న్యాయపోరాటం చేస్తున్నారు. న్యాయస్థానంలో విషయం ఉన్నప్పుడు.. ఎవరు పడితే వారు రోడ్డు మీదికొచ్చి కామెంట్లు చేయొచ్చా? నాకు లోకేశ్‌, జగన్‌, పవన్‌ కల్యాణ్‌ స్నేహితులే. ఏపీతో మాకు తగాదాలు లేవు. ఇప్పటికిప్పుడు పోయి యుద్ధాలు చేయాల్సిందేమీ లేదు. వాళ్లకు కూడా ఇక్కడేమీ ఇష్యూస్‌ లేవు. అలాంటప్పుడు మాకూ మాకూ మధ్య లేనిపోని పంచాయితీలు ఎందుకు పెడుతున్నారు?

అంతా కలిసిమెలిసి ఉంటున్నారు

హైదరాబాద్‌లో ఆంధ్రా, రాయలసీమ, కేరళ, పంజాబ్‌.. ఇలా అన్ని ప్రాంతాలకు చెందినవారు కలిసిమెలసి ఉంటున్నారు. ఆంధ్రా ప్రజలు ఇక్కడ గత పదేళ్లుగా సుఖంగా, సుభిక్షంగా ఉన్నారు. వాళ్లనెందుకు ఇబ్బంది పెట్టడం? వాళ్ల మధ్య వైషమ్యాలు, రాజకీయ కక్షలు లేపి, వాటిని మాకు లేదా ఇంకొకళ్లకు చుట్టి.. దాన్నుంచి ఇంకేదో సాధిద్దామనుకుంటే.. అదెలా కరెక్టు అవుతుంది? లోకేశ్‌ ఒక స్నేహితుడి ద్వారా మాట్లాడించారు.. ‘ధర్నాలకు అనుమతి ఇవ్వాలి’ అని కోరారు. దానికి నేను ఒక్కటే సమాధానమిచ్చా.. ‘బ్రదర్‌.. ఇవాళ మీరు చేస్తారు.. రేపు మీకు పోటీగా మరొకరు చేస్తారు. అప్పుడు హైదరాబాద్‌లో శాంతిభద్రతలు ఏం కావాలి? ఐటీ కారిడార్‌లో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఆందోళనలు చేయలేదు. ఐటీ కార్యకలాపాలు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో.. అప్పటి ప్రభుత్వం అనుమతించలేదు’ అని వివరించా. ఇవాళ ఎంతో మంది ఆంధ్రా సోదరులు ఇక్కడికొచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. వారి పెట్టుబడులు, భవిష్యత్తు, వారికొస్తున్న రాబడులు.. అన్నీ బాగుండాలంటే.. హైదరాబాద్‌లో శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉండాలి. రాజకీయ గొడవల్లో తలదూర్చకూడదు. అందుకే తటస్థంగా ఉండాలని మేం ఓ నిర్ణయానికొచ్చాం. మా పార్టీకి ఈ విషయంతో సంబంధం లేదు. ఎవరైనా మాట్లాడితే అది వారి వ్యక్తిగతం. దయచేసి అందరూ అర్థం చేసుకొని సహకరించాలి’’ అని కేటీఆర్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని