Nara Lokesh: సర్వే రాళ్లే ప్రభుత్వానికి సమాధిరాళ్లు

‘‘రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీల భూములను కొట్టేసేందుకు జగన్‌ మాస్టర్‌ప్లాన్‌ వేశారు. ఆయా ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ, దేవాలయాల భూములను గుర్తించి స్వాధీనం చేసుకుంటున్నారు. ఆ సర్వే రాళ్ల మీద జగన్‌ బొమ్మ ఉంటుంది.

Updated : 18 Dec 2023 06:40 IST

వైకాపా పాలనలో స్టిక్కర్లు, బొమ్మలకే ప్రాధాన్యం
జగన్‌కు మైథోమానియా సిండ్రోమ్‌
యువగళం పాదయాత్రలో లోకేశ్‌
పంచగ్రామాలు, ఎల్జీ పాలిమర్స్‌, స్టీల్‌ప్లాంటు ఉద్యోగుల నుంచి వినతులు

ఈనాడు - విశాఖపట్నం, న్యూస్‌టుడే - పరవాడ: ‘‘రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీల భూములను కొట్టేసేందుకు జగన్‌ మాస్టర్‌ప్లాన్‌ వేశారు. ఆయా ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ, దేవాలయాల భూములను గుర్తించి స్వాధీనం చేసుకుంటున్నారు. ఆ సర్వే రాళ్ల మీద జగన్‌ బొమ్మ ఉంటుంది. వాటిమీదే ఈ అరాచక ప్రభుత్వానికి సమాధి కట్టాలి’’ అని తోటాడ వద్ద బస నుంచి వస్తున్న సమయంలో కనిపించిన రాళ్లను చూసి తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ వ్యాఖ్యానించారు. తోటాడ వద్ద రోడ్డు పక్కన గుట్టలుగా పోసి ఉన్న సర్వే రాళ్ల వద్ద ఆయన సెల్ఫీ తీసుకున్నారు. ఇందులో తన ఫొటో ఉందని, భూమి తనదే అని జగన్‌ ఆక్రమించుకుంటారని, రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు.

వైకాపా ప్రభుత్వం పరిపాలనను వదిలేసి స్టిక్కర్లు, బొమ్మలకే పెద్దపీట వేస్తోందని దుయ్యబట్టారు. ఆదివారం 225వ రోజు యువగళం పాదయాత్ర ఎలమంచిలి నియోజకవర్గం తోటాడ నుంచి ప్రారంభమై సాయంత్రానికి విశాఖ జిల్లాకు చేరుకుంది. పాదయాత్ర పెందుర్తి నియోజకవర్గంలోకి ప్రవేశించగానే తెదేపా-జనసేన నేతలు బండారు సత్యనారాయణమూర్తి, గంటా శ్రీనివాసరావు, గణబాబు, పంచకర్ల రమేష్‌బాబు స్వాగతం పలికారు. రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన జనం అడుగడుగునా నీరాజనం పలికారు. పరవాడ సంతబయలులో నిత్యావసర సరకుల ధరలు మండుతున్నాయని తెలిపేలా పప్పులు, ఉప్పులు, గ్యాస్‌బండతో తయారుచేసిన గజమాల ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

వివాదాలు సృష్టించడమే ప్రభుత్వం పని

‘‘జగన్‌ ప్రభుత్వానికి వివాదాలు సృష్టించడమే పని. 229 జీవోతో తెదేపా ప్రభుత్వం సింహాచలం దేవస్థానం పంచగ్రామాల సమస్యకు పరిష్కారం చూపితే వైకాపా ప్రభుత్వం కేసులు వేసి ఆపేసింది. మరో మూడునెలలు ఆగితే తెదేపా-జనసేన అధికారంలోకి రాగానే 229 జీవోను అమలుచేస్తాం. బిల్డప్‌ బాబాయ్‌ అదీప్‌రాజ్‌ ఎమ్మెల్యే అవ్వగానే సమస్య పరిష్కరిస్తామన్నారు. సీఎం జగన్‌కు మైథోమానియా సిండ్రోమ్‌ ఉంది. ఆ వ్యాధి ఉన్నవారికి ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు అనిపిస్తుంది. వైకాపా అధికారంలోకి వచ్చాక ఉత్తరాంధ్రకు ఒక్క పరిశ్రమనైనా తెచ్చారా? విశాఖలోని గుడ్డు మంత్రి ఏపీ పరువు తీశారు’’ అని లోకేశ్‌ ధ్వజమెత్తారు.

ఎల్జీ పాలిమర్స్‌ బాధితులకు న్యాయం

‘‘జగన్‌ ప్రభుత్వం పర్యావరణ, కాలుష్యనియంత్రణ చట్టాల అమలును పర్యవేక్షించకపోవడం వల్లే ఎల్జీ పాలిమర్స్‌ ఘటన చోటుచేసుకుంది. దుర్ఘటన జరిగాక చుట్టపుచూపుగా వచ్చిన జగన్‌ అక్కడి సమస్యలను ఇప్పటికీ పరిష్కరించలేదు.అధికారంలోకి రాగానే ఆర్‌వో ప్లాంటు, ఆరోగ్యకార్డులు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తాం’’ అని బాధితులకు భరోసా ఇచ్చారు.

పరవాడ మండలం గొర్లివానిపాలెం వద్ద నిరుద్యోగ యువత లోకేశ్‌ను కలిశారు. డిగ్రీలు చదివినా ఏపీలో ఉద్యోగాలు దొరకట్లేదని, ఏపీలో నిరుద్యోగిత శాతం 28కి పెరిగిందని ప్లకార్డులతో పట్టాలు పొందిన దుస్తులతో ప్రదర్శన చేపట్టారు. తెదేపా అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు ప్రతినెలా రూ.3వేల భృతి ఇస్తామని లోకేశ్‌ చెప్పారు.

పాదయాత్రలో ఐటీ ఉద్యోగులు

లోకేశ్‌ యువగళం పాదయాత్రకు అధిక సంఖ్యలో ఐటీ ఉద్యోగులు మద్దతు తెలిపారు. అనకాపల్లి సమీపంలోని తోటాడ వద్ద పాదయాత్రలో ఆయనతో కలిసి నడిచారు. ఆదివారం ఉదయం విజయవాడ, హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నుంచి వచ్చారు. ‘‘చంద్రబాబు వల్లే ఉద్యోగాలు వచ్చాయి. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే బాబును గెలిపించాలి’’ అని స్టార్టప్‌ ఐటీ కంపెనీ నిర్వాహకురాలు ఎ.హిమబిందు పేర్కొన్నారు. పాదయాత్రలో ఎంపీ రామ్మోహన్‌నాయుడు, సుందరపు విజయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

అనకాపల్లి జిల్లాలో ముగిసిన పాదయాత్ర

అనకాపల్లి జిల్లాలో లోకేశ్‌ యువగళం పాదయాత్ర ఆదివారంతో ముగిసింది. సాయంత్రం పాయకరావుపేట నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర పాయకరావుపేట, ఎలమంచిలి, అనకాపల్లి నియోజకవర్గాల్లో ఉత్సాహంగా సాగింది. మునగపాక మండలం వెంకటాపురంతో పూర్తయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని