Ysrcp: వైకాపా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల జాబితా 16న

వైకాపా అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థుల జాబితాను ఈ నెల 16న ప్రకటించనున్నారు. ఆ రోజు ఉదయం ముఖ్యమంత్రి జగన్‌ ఇడుపులపాయకు వెళ్లి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ వద్ద నివాళులర్పించనున్నారు.

Updated : 14 Mar 2024 08:12 IST

ఆ రోజు ఇడుపులపాయకు సీఎం జగన్‌.. అక్కడే ప్రకటన
తమ నియోజకవర్గాల్లోనే మంత్రులు రోజా, అంబటి

ఈనాడు, అమరావతి: వైకాపా అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థుల జాబితాను ఈ నెల 16న ప్రకటించనున్నారు. ఆ రోజు ఉదయం ముఖ్యమంత్రి జగన్‌ ఇడుపులపాయకు వెళ్లి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఘాట్‌ వద్ద నివాళులర్పించనున్నారు. తర్వాత అక్కడే 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలకు మొత్తం అభ్యర్థులను ప్రకటించనున్నారు. తర్వాత రెండు, మూడు రోజులకు ఎన్నికల ప్రచారాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. సిద్ధం సభల స్థాయిలోనే ఈ ఎన్నికల ప్రచార సభలను కూడా చేపట్టనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ముఖ్యమంత్రి వద్ద పంచాయితీలు

నగరి, సత్తెనపల్లి, నరసరావుపేటల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులు రోజా, అంబటి రాంబాబు, ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలను ఆయా నియోజకవర్గాల్లో సొంత పార్టీవారే వ్యతిరేకిస్తున్నారు. ఆ ముగ్గురికీ టికెట్లు ఇస్తే కచ్చితంగా ఓడిస్తామంటూ అసమ్మతి వర్గాలు స్పష్టం చేశాయి. నగరిలో రోజాను వ్యతిరేకిస్తున్న పార్టీ నేతలు దాదాపు రోజూ ప్రెస్‌మీట్లు పెట్టి మరీ ఆమెపై ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నారు. నరసరావుపేటలో అసమ్మతి వర్గం నేరుగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్దే ఆందోళనకు దిగింది. అంబటిని ఆయన నియోజకవర్గంలోని వైకాపాలో ప్రధాన సామాజికవర్గ నేతలంతా వ్యతిరేకిస్తున్నారు. అంబటి, శ్రీనివాసరెడ్డిలతోపాటు వారి వ్యతిరేక వర్గాల నేతలనూ ముఖ్యమంత్రి జగన్‌ బుధవారం క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు. వారితో ఏం ఇబ్బందులు ఎదురవుతున్నాయో అసమ్మతి నేతలు సీఎంకు వివరించారు. చర్చల తర్వాత వారందరినీ కలుపుకొని వెళ్లాలని అంబటి, శ్రీనివాసరెడ్డిలకు సీఎం నిర్దేశించారు. అలాగే వారిద్దరి నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదని, అందుకు తనదీ బాధ్యత అని అసమ్మతి వర్గం నాయకులకు హామీ ఇచ్చారు. రోజా వ్యతిరేకవర్గానికి చెందినవారు రాకపోయినప్పటికీ ఆమెను పిలిపించి, మాట్లాడారు. నగరిలోని ప్రతి మండలంలోనూ వ్యతిరేకులున్న రోజా వారందరినీ కలుపుకొని వెళ్లాలని సీఎం స్పష్టం చేసినట్లు తెలిసింది. మొత్తంగా చూస్తే అంబటి, రోజా, శ్రీనివాసరెడ్డిలను వారి సిటింగ్‌ స్థానాల్లోనే కొనసాగిస్తున్నట్లు జగన్‌ స్పష్టం చేసినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని