రాజకీయ ప్రయోజనాలు ఆశించి పిల్‌ వేయలేదు

వైకాపా ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా సీఎం జగన్‌, ఆయన బంధుగణం పొందిన అనుచిత లబ్ధిపై సీబీఐ విచారణ కోసం ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో వేసిన పిల్‌పై విచారణ జూన్‌ చివరి వారానికి వాయిదా పడింది.

Published : 20 Mar 2024 05:29 IST

ఎన్నికల తర్వాత విచారణ చేపట్టినా అభ్యంతరం లేదు
హైకోర్టులో అఫిడవిట్‌ వేసిన ఎంపీ రఘురామ
విచారణ జూన్‌ చివరి వారానికి వాయిదా

ఈనాడు, అమరావతి: వైకాపా ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా సీఎం జగన్‌, ఆయన బంధుగణం పొందిన అనుచిత లబ్ధిపై సీబీఐ విచారణ కోసం ఎంపీ రఘురామకృష్ణరాజు హైకోర్టులో వేసిన పిల్‌పై విచారణ జూన్‌ చివరి వారానికి వాయిదా పడింది. రాజకీయ ప్రయోజనాలను ఆశించి పిల్‌ వేయలేదని, ఈ నేపథ్యంలో ఎన్నికల తర్వాత విచారణ చేపట్టినా తనకు అభ్యంతరం లేదని ఎంపీ రఘురామ హైకోర్టులో తాజాగా అఫిడవిట్‌ దాఖలు చేశారు. దానిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తులు జస్టిస్‌ యు.దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ ఎం.కిరణ్మయితో కూడిన ధర్మాసనం విచారణను వాయిదా వేసింది. హైకోర్టులో పిల్‌ దాఖలు, అది పెండింగ్‌లో ఉన్న వ్యవహారంపై పిటిషనర్‌, ప్రతివాదులెవరూ మీడియాతో మాట్లాడొద్దని స్పష్టంచేసింది. అయితే పిటిషన్‌లో పేర్కొన్న అంశాలపై మాట్లాడకుండా నిలువరించలేమని తెలిపింది. పిల్‌లోని అంశాలపై మాట్లాడకుండా అడ్డుకోవాలన్న ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సుమన్‌ అభ్యర్థనను తోసిపుచ్చింది. అంతకు ముందు జరిగిన విచారణలో పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపించారు. ఎన్నికల తర్వాత విచారణ జరపాలని కోరుతూ అఫిడవిట్‌ వేశామన్నారు. ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. పిల్‌ను పెండింగ్‌లో ఉంచాల్సిన అవసరం లేదన్నారు. వ్యాజ్యంలో ప్రతివాదిగా ఉన్న భారతి సిమెంట్‌ సంస్థ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.రవి వాదనలు వినిపిస్తూ.. పిల్‌ పెండింగ్‌లో ఉంచడం మంచిది కాదన్నారు. సంస్థ ప్రతిష్ఠకు భంగం కలుగుతుందన్నారు. ఇరువైపు వాదనలూ విన్న ధర్మాసనం.. ఇప్పటి వరకు న్యాయస్థానం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఏమీ లేవని గుర్తుచేసింది. విచారణను జూన్‌ చివరి వారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని