Janasena: జనసేనలో 3 స్థానాలే పెండింగ్‌

తెదేపా-భాజపాతో పొత్తులో భాగంగా జనసేన పోటీ చేయబోతున్న 21 శాసనసభ స్థానాలకు సంబంధించి ఇంతవరకు 18 మంది అభ్యర్థులపై ఆ పార్టీ స్పష్టత ఇచ్చింది.

Updated : 24 Mar 2024 10:04 IST

18 స్థానాలకు అభ్యర్థుల ఖరారు
తిరుపతి అభ్యర్థిపై మళ్లీ పరిశీలన
మచిలీపట్నం ఎంపీ సీటు దాదాపు బాలశౌరికే

ఈనాడు, అమరావతి: తెదేపా-భాజపాతో పొత్తులో భాగంగా జనసేన పోటీ చేయబోతున్న 21 శాసనసభ స్థానాలకు సంబంధించి ఇంతవరకు 18 మంది అభ్యర్థులపై ఆ పార్టీ స్పష్టత ఇచ్చింది. ఇందులోని ఏడు స్థానాలను పవన్‌కల్యాణ్‌ ఇప్పటికే అధికారికంగా ప్రకటించేశారు. 11 స్థానాలకు సంబంధించి ఆయా అభ్యర్థులను పిలిచి వారికి విధివిధానాలు తెలియజేసి ప్రచారం చేసుకోవాలని పచ్చజెండా ఊపారు.  జనసేన పోటీ చేయబోయే    మరో మూడు స్థానాల్లో అభ్యర్థులు ఎవరో తేలాల్సి ఉంది. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ, కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, అన్నమయ్య జిల్లాలోని రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం శాసనసభ నియోజకవర్గం జనసేనకు దక్కింది. ఇక్కడి నుంచి గిడ్డి సత్యనారాయణను అభ్యర్థిగా దాదాపు ఖరారు చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయానికి శనివారం ఆయనను పవన్‌కల్యాణ్‌ పిలిపించి మాట్లాడారు. ప్రచారం చేసుకోవాలని సూచించారు.


అభ్యర్థులను ప్రకటించిన స్థానాలు ఇవే

పిఠాపురం: పవన్‌కల్యాణ్‌,
తెనాలి: నాదెండ్ల మనోహర్‌,      
నిడదవోలు: కందుల దుర్గేష్‌,
అనకాపల్లి: కొణతాల రామకృష్ణ,  
నెల్లిమర్ల: లోకం మాధవి,
కాకినాడ గ్రామీణ: పంతం నానాజీ,  
రాజానగరం: బత్తుల బలరామకృష్ణ


తిరుపతిపై మల్లగుల్లాలు

చిత్తూరు నుంచి వైకాపా ఎమ్మెల్యేగా ఉన్న ఆరణి శ్రీనివాసులు జనసేనలో చేరి తిరుపతి శాసనసభ స్థానం అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు. దీనిపై తిరుపతి నియోజకవర్గ పార్టీ శ్రేణుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు స్థానిక నాయకులను మంగళగిరి పార్టీ కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు. అందరూ కలిసి పని చేయాలని ఉద్బోధించారు. స్థానికేతర అభ్యర్థి కావడంతో తెదేపా, భాజపాల నుంచి కూడా సహకారం లభించడం లేదని పార్టీ నాయకులు నాగబాబుకు తెలియజేశారు. దీంతో మరోసారి సర్వే చేసి అభ్యర్థి విషయంలో తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన వారికి హామీ ఇచ్చారు. అక్కడి నుంచి హరిప్రసాద్‌, కిరణ్‌ రాయల్‌, తెదేపాలో ఉన్న మరో ఇద్దరు నాయకులు జనసేన నుంచి అభ్యర్థిత్వం ఆశిస్తున్నారు. సీటు ఇస్తే జనసేనలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. జనసేనలో ఉన్న ఒక యువ నాయకుడు, ఆ ఇద్దరు తెదేపా నాయకులు ఒక అంగీకారానికి వచ్చి తమ ముగ్గురిలో ఎవరికి ఇచ్చినా సహకరించుకునేందుకు సిద్ధమనే సంకేతాలు పార్టీకి పంపుతున్నారు. మరోవైపు మచిలీపట్నం ఎంపీ స్థానానికి బాలశౌరిని దాదాపు ఖరారు చేశారు. అయితే ఆయనను అవనిగడ్డ అసెంబ్లీ స్థానంలో పోటీచేయించే అంశాన్నీ పరిశీలిస్తున్నట్లు సమాచారం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని