సంక్షేమ పథకాలెన్నో అమలు చేశాం

రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘రైతుల సంక్షేమానికి ఆర్బీకేలు ప్రారంభించాం. సున్నా వడ్డీ రుణాలిచ్చాం. సహకార రంగంలో అమూల్‌ను తెచ్చి పాడి రైతులకు మేలు చేశాం.

Updated : 16 Apr 2024 06:26 IST

అభివృద్ధిని ఓర్వలేకపోతున్న చంద్రబాబు
గుడివాడ ‘మేమంతా సిద్ధం’ సభలో సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘రైతుల సంక్షేమానికి ఆర్బీకేలు ప్రారంభించాం. సున్నా వడ్డీ రుణాలిచ్చాం. సహకార రంగంలో అమూల్‌ను తెచ్చి పాడి రైతులకు మేలు చేశాం. భూముల రీసర్వే చేస్తున్నాం. అన్ని రంగాల్లోనూ ఎంతో అభివృద్ధి చేస్తుంటే చంద్రబాబు కడుపు మండుతోంద’ని ఆరోపించారు. కృష్ణా జిల్లా గుడివాడలో సోమవారం సాయంత్రం జరిగిన ‘మేమంతా సిద్ధం’ సభలో జగన్‌ ప్రసంగించారు. అమ్మఒడి నుంచి ఆసరా చేయూత వరకు ఈబీసీ, కాపు నేస్తం వంటి అనేక సంక్షేమ పథకాలు అమలు చేశామని వివరించారు.

‘31 లక్షల కుటుంబాలకు ఇళ్ల పట్టాలిచ్చాం. 21 లక్షల ఇళ్లు నిర్మించాం. 2.31 లక్షల ఉద్యోగాలిచ్చాం. వాటిలో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకే వచ్చాయి. నామినేటెడ్‌ పోస్టుల్లోనూ 50 శాతం వారికే ఇచ్చాం. 13 జిల్లాలను 26 జిల్లాలు చేశాం. బందరుతోపాటు నాలుగు సీపోర్టుల నిర్మిస్తున్నాం. పది ఫిషింగ్‌ హార్బర్లు, విమానాశ్రయాలు, మూడు పారిశ్రామిక కారిడార్ల పనులు జరుగుతున్నాయి. నీటి పారుదల ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేశాం. 99 శాతం మేనిఫెస్టోను అమలు చేశాం. మీ ఇంటికి మంచి జరిగి ఉంటే సైనికులుగా యుద్ధంలో పోరాడాల’ని జగన్‌ పిలుపునిచ్చారు. ‘ప్రతి ఇంటికీ జరిగిన మంచిని చూడండి. 58 నెలల్లో మీ బిడ్డ ప్రోగ్రెస్‌ రిపోర్టు పరిశీలించండి. విప్లవాత్మక మార్పులను గమనించండి. కళ్లెదుట నిలిచిన అభివృద్ధిని చూడండి. ఏ గ్రామాన్ని చూసినా ఏడు వ్యవస్థలు కనిపిస్తాయి. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో జన్మభూమి కమిటీల అరాచకాలు, దోచుకోవడం, దాచుకోవడం, అవినీతే కన్పించేది’ అని ఆరోపించారు.

దేవుడు పెద్ద స్క్రిప్టే రాశాడు!

‘నా నుదిటిపై అయిన గాయం.. పక్కకు ఎందుకు కాలేదు? కంటికో, కణతకో ఎందుకు కాలేదంటే.. దేవుడు మీ బిడ్డ విషయంలో పెద్ద స్క్రిప్టే రాశాడని అర్థం. అర్జునుడిపై ఒక్క బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్రంలో కౌరవులు గెలిచినట్లు కాదు. జగన్‌ మీద ఒక రాయి విసిరినంత మాత్రాన దుష్టచతుష్టయం గెలిచినట్లు కాదు. దాని ఓటమిని ఆపినట్లూ కాదు. నా సంకల్పం చెక్కు చెదరదు. మరింత దృఢపడుతుంది. దాడులకు, తాటాకు చప్పుళ్లకు మీ బిడ్డ అదరడు. బెదరడు. ఈ స్థాయికి వారు దిగజారారంటే, ఓటమికి దగ్గరయ్యారని అర్థమవుతోంది. మనం విజయానికి చేరువవుతున్నామని అర్థం. నా సంకల్పం నుంచి వెనకడుగు వేసే ప్రసక్తే లేదు’ అని జగన్‌ పేర్కొన్నారు. తనపై విజయవాడలో రాయి విసిరిన ఘటనపై స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేశారు.

‘నాకు చేసిన గాయం పది రోజుల్లో తగ్గిపోతుంది. కానీ చంద్రబాబు చేసిన గాయాలను, మోసాలను ఎన్నడూ మర్చిపోయే ప్రసక్తి ఉండదు. ఇంటింటికి మంచి చేయడం మీ బిడ్డ నైజం. కూటమి నాయకుడి 30 ఏళ్ల ఫిలాసఫీని గమనించండి. పేదలకు ఏ మంచీ చేయవద్దనేది అతని నైజం. అతని పాలనలో రేషన్‌ బియ్యం ధర పెంచారు. ఉచిత విద్యుత్తు ఇవ్వలేదు. ప్రభుత్వ ఉద్యోగాలివ్వలేదు. ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లు పెట్టలేదు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేద’ని ముఖ్యమంత్రి ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని