కూటమి పాశుపతాస్త్రం

తెదేపా, భాజపా, జనసేన పార్టీల కూటమి నిప్పుల ఉప్పెన, అగ్నిపర్వత విస్ఫోటం అని.. ఆ పాశుపతాస్త్రాన్ని తట్టుకొనే శక్తి ఎవరికీ లేదని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు.

Published : 20 Apr 2024 03:32 IST

ఆ శక్తిని ఎవరూ తట్టుకోలేరు: బాలకృష్ణ

హిందూపురం అర్బన్‌, న్యూస్‌టుడే: తెదేపా, భాజపా, జనసేన పార్టీల కూటమి నిప్పుల ఉప్పెన, అగ్నిపర్వత విస్ఫోటం అని.. ఆ పాశుపతాస్త్రాన్ని తట్టుకొనే శక్తి ఎవరికీ లేదని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ స్థానానికి ఆయన తన సతీమణి వసుంధరా దేవితో కలిసి శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. హిందూపురం ప్రజలు రెండుసార్లు తమ కుటుంబంపై ఉన్న నమ్మకంతో గెలిపించారని మూడో దఫా కూడా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకొని నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు అనేక పథకాలు తీసుకువచ్చానని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సొంత నిధులతో ఎన్టీఆర్‌ ఆరోగ్యరథం, ఎన్టీఆర్‌ భోజనశాల వంటి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. నియోజకవర్గాన్ని భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అభివృద్ధి రెండు దశాబ్దాల వెనక్కి వెళ్లిందని బాలకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. విద్య, వైద్యం, ఇలా అనేక రంగాలు నిర్వీర్యం అయిపోయాయని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ తూముకుంట వద్ద పారిశ్రామికవాడ ఏర్పాటు చేస్తే చంద్రబాబు.. శ్రీరామరెడ్డి పథకం ద్వారా నీరందించారని, కియా పరిశ్రమ తీసుకొచ్చి వేల మందికి ఉపాధి కల్పించారన్నారు. అలాంటి నాయకుడు మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. తెదేపా జిల్లా అధ్యక్షుడు అంజినప్ప, భాజపా నియోజకవర్గ కన్వీనర్‌ ఆదర్శకుమార్‌, జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆకుల ఉమేశ్‌, పలువురు నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని