వాలంటీర్లే వైకాపా ఏజెంట్లు!

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికలో కొత్త చిత్రం చోటుచేసుకుంది. ప్రజలకు సేవలందించేందుకు ప్రభుత్వం గౌరవవేతనంపై నియమించిన పలువురు గ్రామ, వార్డు

Updated : 24 Jun 2022 05:43 IST

ఆత్మకూరు ఉపఎన్నికలో కార్యకర్తల్లా పని చేశారంటూ విమర్శలు
6 గంటల వరకు 64.17% పోలింగ్‌

ఈనాడు డిజిటల్‌- నెల్లూరు, న్యూస్‌టుడే- ఆత్మకూరు: శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికలో కొత్త చిత్రం చోటుచేసుకుంది. ప్రజలకు సేవలందించేందుకు ప్రభుత్వం గౌరవవేతనంపై నియమించిన పలువురు గ్రామ, వార్డు వాలంటీర్లు ఈ ఎన్నికలో ఫ్యాన్‌ గుర్తుకు ఓటేయమంటూ ప్రేరేపించారని ఇతర అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఓటరు స్లిప్పులు పంచడం, ఓటర్లను వాహనాల్లో తరలించడం, రానివారికి ఫోన్లు చేయడం వంటి పనుల్లో వాలంటీర్లు పాలుపంచుకున్నారు. వృద్ధులకు సాయంగా వెళతామంటూ పోలింగ్‌ బూత్‌ వరకు తీసుకెళ్లి అధికార పార్టీకి ఓట్లేయించిన ఘటనలూ చోటుచేసుకున్నాయి. మరోవైపు వైకాపా అభ్యర్థికి భారీ ఆధిక్యం కట్టబెట్టడానికి ఆ పార్టీ నాయకులు దొంగ ఓట్లు వేయించారంటూ ఇతర అభ్యర్థులు ఆరోపించారు.

ఆత్మకూరు పట్టణంలోని టెక్కే పోలింగ్‌ కేంద్రం పరిధిలో వాలంటీర్లు కారులో ఓటర్లను తరలించారు. వారిలో వృద్ధులను ఎక్కించి, నడవలేరంటూ నేరుగా పోలింగ్‌ కేంద్రం వద్దకు కారులో తీసుకువచ్చారు. తాము తీసుకెళ్లిన ఓటర్లను ఫ్యాన్‌ గుర్తుకు ఓటేయాలని ప్రేరేపించారు.

ఆత్మకూరు మండలంలోని మహిమలూరులో పోలింగ్‌ కేంద్రం వద్ద అధికార పార్టీ తరఫున ఓటరు స్లిప్పులు రాసి ఇచ్చే పనీ వాలంటీర్లే చేశారు. ఓటేయడానికి రాని వారికి ఫోన్లు చేసి వాహనాల్లో పోలింగ్‌ కేంద్రాలకు తరలించారని, సిబ్బంది కూడా వీరికి సహకరించారని ఇతర అభ్యర్థులు ఆరోపిస్తున్నారు.

అనంతసాగరం మండలంలోని శంకరనగరంలో వాలంటీరు భూ లక్ష్మి ఓ వృద్ధుణ్ని పోలింగ్‌బూత్‌ వరకు చేయిపట్టుకుని తీసుకొచ్చారు. ఆయన నేను వెళ్లి వేస్తానని చెప్పినా పట్టించుకోలేదు. ఆయనకు కళ్లు కనిపించవని ఓటు వేయిస్తానంటూ చెప్పి తీసుకెళుతూ ఫ్యాన్‌గుర్తుకు ఓటేయమని ప్రేరేపించారు.


పోలింగ్‌ ప్రశాంతం

దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి మృతితో జరుగుతున్న ఈ ఉప ఎన్నికలో వైకాపా అభ్యర్థిగా ఆయన సోదరుడు విక్రమ్‌రెడ్డి బరిలో నిలిచారు. తెదేపా పోటీకి దూరంగా ఉండగా భాజపా అభ్యర్థి భరత్‌కుమార్‌ యాదవ్‌తోపాటు మొత్తం 14 మంది పోటీలో నిలిచారు. ఆత్మకూరు ఉప ఎన్నికల పోలింగ్‌ స్వల్ప సంఘటనలు మినహా గురువారం ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకు 64.17 శాతం పోలింగ్‌ నమోదయినట్లు అధికారులు ప్రకటించారు. ఈ నెల 26న ఓట్ల లెక్కింపు జరగనుంది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని