నేడు నడ్డా.. రేపు మోదీ రాక

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు కీలక నాయకుల రాక మొదలైంది. మొత్తం 340 మంది ప్రతినిధులకు గాను గురువారం రాత్రికే 200 మంది హైదరాబాద్‌ చేరుకున్నారు. వీరిలో పలువురు తమకు అప్పగించిన అసెంబ్లీ నియోజకవర్గాలకు వెళ్లారు

Published : 01 Jul 2022 05:44 IST

 జాతీయ కార్యవర్గ సమావేశ ప్రాంగణం, హాళ్లకు ప్రత్యేక పేర్లు

ఈనాడు, హైదరాబాద్‌: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు కీలక నాయకుల రాక మొదలైంది. మొత్తం 340 మంది ప్రతినిధులకు గాను గురువారం రాత్రికే 200 మంది హైదరాబాద్‌ చేరుకున్నారు. వీరిలో పలువురు తమకు అప్పగించిన అసెంబ్లీ నియోజకవర్గాలకు వెళ్లారు. ఆయా నేతలకు ఎయిర్‌పోర్ట్‌లో భాజపా ప్రొటోకాల్‌ కమిటీ ఇన్‌ఛార్జి వీరేందర్‌గౌడ్‌ స్వాగతం పలికారు. కమలదళపతి జేపీ నడ్డా శుక్రవారం సాయంత్రం చేరుకోనున్నారు. ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు శంషాబాద్‌లో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం ఆయన హెచ్‌ఐసీసీ-నోవాటెల్‌ ప్రాంగణానికి చేరుకుంటారు. సాయంత్రం 6గంటలకు ఫొటో ఎగ్జిబిషన్‌ ప్రారంభిస్తారు. పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శులతో సమావేశమవుతారు. 2న ఉదయం 10 గంటలకు జాతీయ పదాధికారుల సమావేశం ప్రారంభమై సాయంత్రం వరకు జరుగుతుంది. 2న సాయంత్రం జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమవుతాయి. బీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే ప్రాంగణం, హాళ్లకు భాజపా పేర్లు పెట్టింది. ప్రధాన సమావేశాల హాల్‌కు కాకతీయ ప్రాంగణం, హెచ్‌ఐసీసీ, నోవాటెల్‌ ప్రాంగణానికి శాతవాహననగర్‌,  నోవాటెల్‌ హోటల్లో బస ప్రాంతానికి సమ్మక్క సారలక్క నిలయం, ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ గదికి షోయబుల్లాఖాన్‌ హాల్‌, భోజనశాలకు భాగ్యరెడ్డివర్మ,  భాజపా రాష్ట్రాల ఆర్గనైజింగ్‌ జనరల్‌ సెక్రటరీల సమావేశ ప్రాంగణానికి కుమురంభీం, జాతీయ ప్రధానకార్యదర్శుల ప్రాంగణానికి భక్త రామదాసు పేర్లు పెట్టారు.

ప్రధాని పర్యటన ఇలా..

* ప్రధాని మోదీ శనివారం మధ్యాహ్నం 2.30-3.00 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీ-నోవాటెల్‌ ప్రాంగణానికి చేరుకుంటారు. సాయంత్రం ప్రారంభమయ్యే జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటారు. 3న ఉదయం 10-4 వరకు హెచ్‌ఐసీసీ-నోవాటెల్‌ ప్రాంగణంలో జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొంటారు.  3న సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభ వద్దకు సాయంత్రం 6 గంటలకు చేరుకుంటారు. రాత్రి ఏడున్నర వరకు ఉంటారు. 4న ఉదయం విజయవాడకు బయల్దేరి వెళతారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని