తెరాస, భాజపాలవి రాజకీయ డ్రామాలు

రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించి తెరాస, భాజపాలు రాజకీయ డ్రామాలాడుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణకు జరిగిన అన్యాయాలపై.. నగరానికి వచ్చిన ప్రధాని మోదీని ప్రశ్నించే అవకాశాలను....

Published : 03 Jul 2022 05:35 IST

అన్యాయాలపై ప్రధానిని నిలదీసే అవకాశాల్ని కేసీఆర్‌ విస్మరిస్తున్నారు
పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

నాంపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించి తెరాస, భాజపాలు రాజకీయ డ్రామాలాడుతున్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణకు జరిగిన అన్యాయాలపై.. నగరానికి వచ్చిన ప్రధాని మోదీని ప్రశ్నించే అవకాశాలను సీఎం కేసీఆర్‌ విస్మరిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణను కొల్లగొట్టి, రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని దోపిడీ చేసి.. హైదరాబాద్‌ నుంచి జాతీయస్థాయిలో కార్పొరేట్‌ కంపెనీలుగా ఎదిగిన సంస్థలే భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు ఆర్థికసాయం చేస్తున్నట్లు కనిపిస్తోందని ఆరోపించారు. నెక్లెస్‌రోడ్‌ చౌరస్తాలోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద తెరాస, భాజపాలు ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టడంపై ఆందోళన చేపట్టిన పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ యాదవ్‌ను పోలీసులు అరెస్టు చేసి నాంపల్లి ఠాణాకు తరలించగా, రేవంత్‌రెడ్డి వెళ్లి సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... కొట్లాడి తెలంగాణ తెచ్చానని చెప్పే కేసీఆర్‌, ఎనిమిదేళ్లుగా ప్రధాని మోదీ, భాజపా తెలంగాణకు చేసిన అన్యాయాలను ప్రశ్నించాల్సి ఉండగా, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు ఐటీఐఆర్‌ కారిడార్‌ను కాంగ్రెస్‌ సర్కారు ఇస్తే మోదీ రద్దు చేశారని దుయ్యబట్టారు. తమలాంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ ప్రశ్నించకుండా, మీడియాలో చర్చలు జరగకుండా తమను అడ్డుకునేలా ఫ్లెక్సీల పంచాయితీలను తెరాస సృష్టించిందని దుయ్యబట్టారు. తండ్రీకొడుకులిద్దరూ మోదీతో మాట్లాడుకున్నారనే అనుమానాలున్నాయని  రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మోదీ తెలంగాణకు ప్రధానమంత్రే కాదని ఎద్దేవా చేశారు. రేవంత్‌ వెంట షబ్బీర్‌ అలీ తదితరులున్నారు.

భాజపాపై మాణికం ఠాగూర్‌ మండిపాటు

భాజపాపై కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ మండిపడ్డారు. రాజస్థాన్‌ భాజపా ఎమ్మెల్యే గులాబ్‌ సింగ్‌ కటారియాతో ‘ఉదయ్‌పుర్‌’ హత్యా ఘటనకు పాల్పడిన నిందితుడు దిగిన ఫొటోను శనివారం ఠాగూర్‌ ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. భాజపా జాతీయ అధ్యక్షుడు నడ్డాను ఉద్దేశిస్తూ.. ‘నడ్డాజీ, దయచేసి దీన్ని చూడండి. ఉదయ్‌పుర్‌ ఘటనలో నిందితుడు మీ పార్టీ ఎమ్మెల్యే, కటారియాతో దిగిన ఫొటో. నిందితుడిని ఎలా కాపాడాలో మీపార్టీ జాతీయ సమావేశాల్లో చర్చిస్తారా’ అని ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని