Revanth: రేవంత్‌పైనే మాటల తూటాలు!

కాంగ్రెస్‌లో విభేదాల పరంపర కొనసాగుతోంది. ముఖ్యనేతలు పార్టీని వీడుతూ  పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలను కొనసాగిస్తున్నారు.  మూడు రోజుల్లో ఇద్దరు ముఖ్యనేతలు కాంగ్రెస్‌ను వీడగా ఇద్దరూ రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిపైనే ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ ముఖ్యనేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా

Published : 06 Aug 2022 06:14 IST

కాంగ్రెస్‌లో అసంతృప్తులు.. అలకలు
ముదురుతున్న విభేదాలు

ఈనాడు, హైదరాబాద్‌: కాంగ్రెస్‌లో విభేదాల పరంపర కొనసాగుతోంది. ముఖ్యనేతలు పార్టీని వీడుతూ  పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై తీవ్ర విమర్శలను కొనసాగిస్తున్నారు.  మూడు రోజుల్లో ఇద్దరు ముఖ్యనేతలు కాంగ్రెస్‌ను వీడగా ఇద్దరూ రేవంత్‌రెడ్డి వ్యవహారశైలిపైనే ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ ముఖ్యనేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందని విమర్శించారు. పార్టీలో చేరికలతో పాటు నిర్వహిస్తున్న సమావేశాలను తప్పుపట్టారు. రేవంత్‌రెడ్డి నాయకత్వంలో పనిచేయలేకే పార్టీని వీడుతున్నట్లు రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. రాజగోపాల్‌రెడ్డి విమర్శలపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన సోదరుడు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. తమ కుటుంబం గురించి మాట్లాడటం సరికాదంటూ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. దీంతో పాటు  తాను ప్రాతినిధ్యం వహిస్తున్న భువనగిరి పార్లమెంట్‌ స్థానం పరిధిలోని మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన కీలక సమావేశాన్ని చండూరులో తన ప్రమేయం లేకుండా ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు సమాచారం కూడా లేకుండా తన నియోజకవర్గానికి చెందిన ఇంటిపార్టీ అధినేత చెరకు సుధాకర్‌ను ఎలా చేర్చుకున్నారని వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.శుక్రవారం చండూరులో జరిగిన మునుగోడు కాంగ్రెస్‌ కార్యకర్తల భరోసా సభ కూడా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేకుండా సాగింది. ఆయన పాల్గొనకపోవడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ పరిణామాలకు తోడు ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ శుక్రవారం కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. ఆయన కూడా రాజీనామాకు రేవంత్‌ వైఖరే కారణమని ప్రకటించారు. చేరికల అంశంపైనా కొందరు నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్‌తో పాటు, హుస్నాబాద్‌ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి కాంగ్రెస్‌లో చేరడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తమైనట్లు తెలిసింది. జిల్లా, నియోజకవర్గ నేతలను సంప్రదించకుండానే చేరికలు జరుగుతుండటంతో స్థానిక నేతలు ఇబ్బందిపడుతున్నట్లు చర్చ జరుగుతోంది.  చేరికల కోసం కె.జానారెడ్డి నేతృత్వంలో కమిటీ వేసినా దాంతో సంబంధం లేకుండా నాయకులను చేర్చుకోవడంపై విమర్శలు వస్తున్నాయి. వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ ముఖ్యనేతల మధ్య అంతర్గత విభేదాలు, పార్టీలో అలకలు, అసంతృప్తి వ్యవహారాలు పార్టీకి నష్టం కలిగిస్తాయని భావిస్తున్నారు. అంతకంటే ముందే జరిగే మునుగోడు ఉపఎన్నికల్లో ఎలా వీటిని అధిగమిస్తారనేది  చర్చనీయాంశంగా మారింది.


ఒకే రోజు అమిత్‌షాను కలిసిన కోమటిరెడ్డి బ్రదర్స్‌

ఈనాడు, దిల్లీ: దిల్లీలో శుక్రవారం రోజంతా తెలంగాణ రాజకీయం రసవత్తరంగా సాగింది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సమక్షంలో చెరుకు సుధాకర్‌ తన తెలంగాణ ఇంటి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. అనంతరం రేవంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ వెంకట్‌రెడ్డి కాంగ్రెస్‌ మనిషని.. రాజగోపాల్‌రెడ్డి ద్రోహి అని విమర్శించారు. మునుగోడు సమావేశంపై వెంకట్‌రెడ్డికి సమాచారం ఇచ్చామని తెలిపారు. కాసేపటికే భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అమిత్‌షాతో భేటీ అయ్యారు. తమ్ముడి బాటలోనే బాటలోనే ఆయన కూడా కమలం గూటికి చేరుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. షాను కలిసిన అనంతరం విలేకరులతో మాట్లాడిన వెంకట్‌రెడ్డి తాను కాంగ్రెస్‌ను వీడేది లేదంటూనే భాజపాలోకి వెళ్తే చెప్పే వెళతానని.. ప్రకటించారు. రేవంత్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అనంతరం రాజగోపాల్‌రెడ్డి తెలంగాణ భవన్‌లో విలేకరుల సమావేశం పెట్టి తాను అమిత్‌ షాతో భేటీ అయ్యానని తెలియజేశారు. చెరుకు సుధాకర్‌ చేరికతో వెంకట్‌రెడ్డి మనస్తాపం చెంది ఉంటారన్నారు. వెంకట్‌రెడ్డి భాజపాలోకి రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. రేవంత్‌రెడ్డిపైనా విమర్శలు గుప్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని