ఉద్యమకారులను జైల్లో పెట్టించినోళ్లకే పదవులు!

తెలంగాణ రాష్ట్రసాధనలో ముందు నిలిచి పోరాడిన బడుగు బలహీన వర్గాల వారికి పార్టీలో అన్యాయం జరుగుతోందని నర్సాపూర్‌ పురపాలక సంఘం అధ్యక్షుడు, ఉమ్మడి మెదక్‌ జిల్లా తెరాస మాజీ అధ్యక్షుడు ఎర్రగొల్ల మురళీయాదవ్‌

Published : 06 Aug 2022 02:46 IST

నర్సాపూర్‌ పురపాలక సంఘం అధ్యక్షుడు మురళీయాదవ్‌

ఈనాడు, సంగారెడ్డి: తెలంగాణ రాష్ట్రసాధనలో ముందు నిలిచి పోరాడిన బడుగు బలహీన వర్గాల వారికి పార్టీలో అన్యాయం జరుగుతోందని నర్సాపూర్‌ పురపాలక సంఘం అధ్యక్షుడు, ఉమ్మడి మెదక్‌ జిల్లా తెరాస మాజీ అధ్యక్షుడు ఎర్రగొల్ల మురళీయాదవ్‌ అన్నారు. ఉద్యమకారులను జైల్లో పెట్టించినోళ్లకే కీలక పదవులు దక్కాయన్నారు. ప్రగతిభవన్‌లోకి మంత్రులు, ఎమ్మెల్యేలకే ప్రవేశం ఉండదన్నారు. తమ సమస్యలను సీఎం కేసీఆర్‌కు తెలియజేసే అవకాశం ఎక్కడి నుంచి వస్తుందన్నారు. తన భార్య రాజమణి ఉమ్మడి మెదక్‌ జడ్పీ ఛైర్మన్‌గా పనిచేసే సమయంలో జడ్పీటీసీ సభ్యులందరినీ తీసుకెళ్లి సీఎంతో ఫొటో తీసుకోలేకపోయామమని తెలిపారు. నర్సాపూర్‌ నియోజకవర్గంలో మాజీ మంత్రి సునీతారెడ్డికే పార్టీ టికెట్‌ ఇస్తుందంటూ కొంతకాలంగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో ఆయన సంగారెడ్డిలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో రెడ్డి సామాజిక వర్గానికే నామినేటెడ్‌ పోస్టులన్నీ ఇచ్చారు... కనీసం ఒక్క బీసీ నేత కూడా కనిపించలేదా అని ప్రశ్నించారు. రిజర్వుడు మినహా అన్ని చోట్లా ఎమ్మెల్యేలుగా అగ్రవర్ణాల వారికే పార్టీ అవకాశం ఇచ్చిందన్నారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీచేసి ఓడిపోయిన వంటేరు ప్రతాప్‌రెడ్డి, సునీతాలక్ష్మారెడ్డిలకు కీలక పదవులు కట్టబెట్టడం ఎంత వరకు సమంజసమన్నారు. పార్టీలో ఒకే ఒక్క బీసీ నేత చింతా ప్రభాకర్‌కు నామినేటెడ్‌ పదవి ఎందుకు ఇవ్వలేదో సమాధానం చెప్పలేదన్నారు. తాను పార్టీని వీడనని, తెరాసలోనే ఉంటూ ప్రశ్నిస్తానని ఆయన వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని