వచ్చే ఎన్నికల్లో తెరాసకు అభ్యర్థుల కరవు

ప్రజల్లో వ్యతిరేకతను గమనిస్తే వచ్చే ఎన్నికల్లో తెరాసకు అభ్యర్థులు దొరకని పరిస్థితి కనిపిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్‌ బొమ్మతో ప్రజల్లోకి వెళ్తే నిండా మునుగుతామని ఎమ్మెల్యేల్లో భయం

Published : 11 Aug 2022 06:11 IST

ప్రజాసంగ్రామ యాత్రలో బండి సంజయ్‌

ఈనాడు, నల్గొండ: ప్రజల్లో వ్యతిరేకతను గమనిస్తే వచ్చే ఎన్నికల్లో తెరాసకు అభ్యర్థులు దొరకని పరిస్థితి కనిపిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్‌ బొమ్మతో ప్రజల్లోకి వెళ్తే నిండా మునుగుతామని ఎమ్మెల్యేల్లో భయం పట్టుకుందని ఆయన విమర్శించారు. ముందస్తుకు వెళితే ముఖ్యమంత్రి కేసీఆర్‌ మునిగిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. గెలిచినా ఓడినా ఒరిగేదేమీ లేదంటూ తెరాస, కాంగ్రెస్‌ పార్టీలు మునుగోడు ఎన్నికల బరి నుంచి ముందే పారిపోయాయని ఎద్దేవా చేశారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బుధవారం నల్గొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో మీడియా ప్రతినిధులతో సంజయ్‌ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.

కమ్యూనిస్టులు తెరాస కోవర్టులు..

రాష్ట్రంలో కమ్యూనిస్టు, మజ్లిస్‌ పార్టీలు తెరాసకు అమ్ముడుపోయాయని, ఆ పార్టీల నాయకులు కేసీఆర్‌కు కోవర్టుల్లా మారారని సంజయ్‌ ఆరోపించారు. మునుగోడు ఉపఎన్నికలో కమ్యూనిస్టులు పోటీచేసి తామేంటో తేల్చుకోవాలన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలంతా తెరాసను ఓడించే సత్తా భాజపాకే ఉందని నమ్ముతున్నారని చెప్పారు. ప్రజాసంగ్రామ యాత్రకు వస్తున్న స్పందన చూసి తెరాస క్యాడర్‌లో కలవరం మొదలైందని వివరించారు. వచ్చే ఎన్నికల్లో ఖర్చు చేయడానికి హైదరాబాద్‌లోని పలు కంపెనీల వద్ద నెల క్రితమే కేసీఆర్‌ డబ్బు వసూలు చేశారని ఆరోపించారు. మునుగోడులో ఈనెల 21న జరిగే సభకు అమిత్‌షా హాజరుకానున్నారని సంజయ్‌ వెల్లడించారు.

ఫార్మా పరిశ్రమల బాధితులతో మాటామంతీ

ప్రజాసంగ్రామ యాత్ర బుధవారం 8వరోజు చిట్యాల మండలం గుండ్రాంపల్లి నుంచి మొదలై వెలిమినేడు, సుంకెనపల్లి, చిట్టెడుగూడెం, ఎల్లంకి మీదుగా యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం వరకు 14.5 కి.మీ. మేర సాగింది. గుండ్రాంపల్లి, వెలిమినేడు ప్రాంతాల్లో ఫార్మా కంపెనీల వల్ల భూగర్భ జలాలు కలుషితమై  అనారోగ్యం పాలవుతున్నామని, విలువైన భూములను అవి గుంజుకుంటున్నాయని స్థానికులు సంజయ్‌ దృష్టికి తెచ్చారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ నుంచి భాజపాలో చేరిన దాసోజు శ్రవణ్‌ బుధవారం పాదయాత్రలో సంజయ్‌ వెంట నడిచారు. పాదయాత్ర ఇన్‌ఛార్జి మనోహర్‌రెడ్డి, నల్గొండ జిల్లా భాజపా అధ్యక్షుడు శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని