ఒకే విధానం.. ఒకే నినాదం

అమరావతే రాష్ట్ర రాజధానిగా ఉండాలని రైతులు చేస్తున్న పోరాటానికి వేర్వేరు రాజకీయపార్టీలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. తామందరిదీ ఈ విషయంలో ఒకే విధానమంటూ ఒకే

Published : 25 Sep 2022 05:41 IST

వైకాపా మినహాఅన్ని రాజకీయపక్షాల మద్దతూ అమరావతికే

ఈటీవీ, అమరావతి: అమరావతే రాష్ట్ర రాజధానిగా ఉండాలని రైతులు చేస్తున్న పోరాటానికి వేర్వేరు రాజకీయపార్టీలు సంపూర్ణ మద్దతు తెలిపాయి. తామందరిదీ ఈ విషయంలో ఒకే విధానమంటూ ఒకే నినాదాన్ని వినిపించాయి. అన్ని వర్గాల ప్రజల నుంచి ఉద్యమానికి అండదండలు లభిస్తున్న వేళ.. నిర్బంధాలతో అణచివేసేందుకు అధికారపక్షం ప్రయత్నించడాన్ని తీవ్రంగా తప్పుపట్టాయి. న్యాయం చేయాలని కోరుతూ రైతులు చేపట్టిన పోరాటంపై అణచివేతను ఖండించాయి. న్యాయస్థానాల తీర్పులను బేఖాతరు చేస్తున్న ప్రభుత్వతీరును ఎండగట్టాయి. అమరావతిపై ఒకటే స్వరం ఒకటే సమరం పేరిట ‘ఈనాడు-ఈటీవీ’ ఆంధ్రప్రదేశ్‌ శనివారం నిర్వహించిన ప్రత్యేక ప్రతిధ్వని చర్చా కార్యక్రమంలో పాల్గొన్న పార్టీల నేతలు అమరావతే రాజధానిగా అభివృద్ధి చెందాలనే గట్టి సంకల్పాన్ని వినిపించారు.


భాజపా ముందుకు రావాలి
అమరావతే రాజధాని అని కేంద్రం గట్టిగా చెప్పడం లేదు. ప్రధాని, హోంమంత్రి ఓ మాట చెబితే అందుకు భిన్నంగా ముఖ్యమంత్రి ఆలోచిస్తారని అనుకోవడంలేదు. ఈ గందరగోళాన్ని తొలగించేందుకు భాజపా ముందుకు రావాలి. మేం అమరావతి రైతుల పాదయాత్రలకు సంఘీభావం ప్రకటించాం.

-వి.శ్రీనివాసరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి


ఆది నుంచి మోసపూరిత ధోరణే
అధికారంలో ఉంటూ ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టడం జగన్‌కు తగదు. అమరావతిపై హైకోర్టులో తీర్పు రావడానికి ముందు మూడు రాజధానులను ఉపసంహరించుకుంటున్నామని న్యాయస్థానానికి తెలియజేశారు. ఇప్పుడు హైకోర్టు తీర్పుపై 6నెలల తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మోసపూరితంగా వ్యవహరించడం తప్ప ఏనాడూ ఆయన పారదర్శకంగా పాలించలేదు.

-కె.రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

జగన్‌ విశ్వాసఘాతుకానికి ఐపీసీ సెక్షన్లు సరిపోవు

జగన్‌ దుర్మార్గ పాలనకు, నమ్మకద్రోహానికి, నయవంచనకు, విశ్వాసఘాతుకానికి ఐపీసీలోని సెక్షన్లు సరిపోవు. అధికారపక్షం ఎన్ని కుట్రలు చేసినా అమరావతి నిర్మాణం తాత్కాలికంగా ఆపగలరేమో గానీ ఆకాంక్షను దూరం చేయలేరు. అమరావతి అంటే జగన్‌కు ఎందుకంత ద్వేషం? రైతుల తొలిదశ పాదయాత్ర విజయవంతమైంది. సీమవాసులూ స్వాగతించారు.

-కాలవ శ్రీనివాసులు, మాజీ మంత్రి

పాలనలో విద్వేషం, వ్యక్తిగత కక్ష

అమరావతి రాష్ట్ర రాజధాని అని కేంద్రం అంగీకరించింది. అందుకే శంకుస్థాపనకు ప్రధాని వచ్చారు. హైకోర్టు కర్నూలులో ఉండాలనేది భాజపా ఆలోచన. పాలనలో విద్వేషం, ప్రభుత్వ వ్యక్తిగత కక్షలకు నిదర్శనం.. హెల్త్‌యూనివర్సిటీ పేరు మార్పు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఏర్పాటుచేస్తున్న కళాశాలకు వైఎస్‌ పేరు పెట్టుకోవచ్చు కదా.

-సుహాసినీ ఆనంద్‌, భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి

సీఎం మొండిగా, మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు

సీఎం చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. మూడు రాజధానుల ఆలోచన వినాశకాలం తప్ప వేరొకటికాదు. ఒకే రాష్ట్రం.. ఒకే రాజధాని.. అదే అమరావతి. ఇదే కాంగ్రెస్‌ నినాదం. ఇదే రాహుల్‌గాంధీ మాట కూడా.

-ఎన్‌.తులసిరెడ్డి, ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు

ఎస్సీ, ఎస్టీలపైనా అట్రాసిటీ కేసులు

అమరావతి ఉద్యమంలో ఎస్సీ, ఎస్టీ రైతులు బలంగా బయటకొచ్చారని.. వారిపైనే అట్రాసిటీ కేసులు పెట్టారు. విజయవాడలో అమరావతి ఉద్యమానికి అండగా మహిళలు బయటకొచ్చి మద్దతిస్తే గంటల తరబడి మహిళలను పోలీసుస్టేషన్‌లో నిలబెట్టారు. విధ్వంసపాలన చేస్తున్నారు.

-పోతిన మహేష్‌, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని