సీబీఐ విచారణకు సిద్ధమేనా?

దసపల్లా భూముల వ్యవహారంలో తనకు ప్రమేయం లేదని చెబుతున్న వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి... సీబీఐతో విచారణ చేయించడానికి సిద్ధమేనా? అని విశాఖ లోక్‌సభ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సవాలు విసిరారు.

Updated : 05 Oct 2022 05:22 IST

దసపల్లా భూములపై విజయసాయికి తెదేపా సవాల్‌

విశాఖపట్నం(వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: దసపల్లా భూముల వ్యవహారంలో తనకు ప్రమేయం లేదని చెబుతున్న వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి... సీబీఐతో విచారణ చేయించడానికి సిద్ధమేనా? అని విశాఖ లోక్‌సభ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సవాలు విసిరారు. మంగళవారం విశాఖ తెదేపా కార్యాలయంలో పార్టీ న్యాయ విభాగం ప్రతినిధులతో కలిసి విలేకరులతో ఆయన మాట్లాడుతూ... ‘ప్రతిపక్షంలో ఉండగా దసపల్లా భూముల వ్యవహారంలో విజయసాయిరెడ్డి తెదేపా నాయకులపై ఆరోపణలు గుప్పించారు. సీబీఐకీ ఫిర్యాదు చేశారు. వైకాపా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇవే భూములపై ఆయన కన్నేశారు. పక్కా వ్యూహంతో అస్మదీయులు, అల్లుడు, కుమార్తెతో కలిసి సూట్‌కేసు కంపెనీని ఏర్పాటు చేయించారు. దసపల్లా భూముల్లో భవనాలు నిర్మించే సంస్థకు వారి కంపెనీ నుంచి రూ.7 కోట్లు బదలాయించారు. దసపల్లా భూములను కొన్న 500 మంది కష్టాల్లో ఉన్నారని చెబుతున్న విజయసాయిరెడ్డి, విశాఖ నగరంలో 22ఏ (నిషేధిత భూముల జాబితా) నుంచి తమ స్థలాలను మినహాయించాలని కోరుతూ వచ్చిన వేలాది దరఖాస్తుల పరిష్కారానికి ఎందుకు చొరవ చూపడం లేదు? దసపల్లా భూములపైనే ఎందుకు అత్యుత్సాహం ప్రదర్శించారు? విజయసాయిరెడ్డి విడుదల చేసిన ప్రకటన వాస్తవాలకు దూరంగా ఉంది. తెదేపా హయాంలో కోర్టు తీర్పులు వచ్చాయని చెబుతున్న ఆయన... ఇప్పుడెందుకు క్లియర్‌ చేస్తున్నదీ స్పష్టం చేయలేదు. రాణి కమలాదేవి ఇచ్చిన యూఎల్‌సీ(అర్బన్‌ ల్యాండ్‌ సీలింగ్‌) 6(1) డిక్లరేషన్‌పై కోర్టులో వ్యాజ్యం నడుస్తుంటే దాన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదో చెప్పాలి. త్వరలో కలెక్టర్‌ను కలిసి 6(1) డిక్లరేషన్‌ కింద సీసీ దస్త్రాలను ఇవ్వాలని కోరతాం. దీనిపై రాష్ట్ర గవర్నర్‌, సీబీఐ, ఈడీలకు ఫిర్యాదు చేస్తాం’ అని తెలిపారు.

సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి: జనసేన 

దసపల్లా భూములపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలని, ఆయా భూములను 22ఏ జాబితాలోనే కొనసాగించాలని జనసేన డిమాండ్‌ చేసింది. ఈమేరకు మంగళవారం విశాఖ కలెక్టరేట్‌లో జేసీ కేఎస్‌ విశ్వనాథన్‌కు పార్టీ కార్పొరేటరు పీతల మూర్తియాదవ్‌ వినతిపత్రం అందజేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని