Andhra News: ఇచ్చిన హామీలు అమలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తాం: సజ్జల

రాష్ట్రంలో వైకాపా ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అయిదేళ్ల పాలన పూర్తి చేసి, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని చెప్పారు.

Updated : 08 Oct 2022 07:39 IST

ఎమ్మిగనూరు (వ్యవసాయం), న్యూస్‌టుడే: రాష్ట్రంలో వైకాపా ముందస్తు ఎన్నికలకు వెళ్లడం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అయిదేళ్ల పాలన పూర్తి చేసి, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని చెప్పారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో శుక్రవారం ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డితో కలిసి ఆయన పర్యటించారు. పలు నూతన భవనాలను ప్రారంభించారు. అనంతరం స్థానిక సోమప్ప మెమోరియల్‌ హాల్‌లో జరిగిన వైకాపా కార్యకర్తల సమావేశంలో సజ్జల మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలన్నారు. కుప్పం కోటనూ స్థానిక ఎన్నికల్లో బద్దలుకొట్టామన్నారు. తెదేపా బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్ర పోషించకుండా పాత విధానాలతో ప్రలోభపెడుతోందని ఆరోపించారు. కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని, ఆఖరి పోరాటంలో ప్రతిపక్షం ఎంతకైనా తెగిస్తుందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి  రాజకీయాన్ని వృత్తిగా భావించి అంకితభావంతో పనిచేసేవారికి ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలు చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి స్పందన వస్తుందని చెప్పారు. ప్రభుత్వ పథకాలు ప్రజలకు నేరుగా అందించడమే ప్రభుత్వానికి శ్రీరామ రక్షగా మారిందన్నారు. ఎమ్మిగనూరులో వారసులు నిరభ్యంతరంగా రాజకీయాల్లోకి రావచ్చని, అయితే అత్యధిక మెజార్టీ తీసుకురావాలని షరతు పెడుతున్నామని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని