Mulayam Singh Yadav: రాజకీయ దిగ్గజం ములాయం కన్నుమూత

ఐదు దశాబ్దాల పాటు ఉత్తర్‌ప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి, మూడు పర్యాయాలు ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించి.. ‘నేతాజీ’గా ప్రజల నీరాజనాలు అందుకున్న రాజకీయ కురువృద్ధుడు, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌(82) సోమవారం కన్నుమూశారు.

Updated : 11 Oct 2022 06:36 IST

 అస్వస్థతతో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచిన ఎస్పీ వ్యవస్థాపకుడు

ఈనాడు, లఖ్‌నవూ/గురుగ్రామ్‌: ఐదు దశాబ్దాల పాటు ఉత్తర్‌ప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించి, మూడు పర్యాయాలు ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించి.. ‘నేతాజీ’గా ప్రజల నీరాజనాలు అందుకున్న రాజకీయ కురువృద్ధుడు, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌(82) సోమవారం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో ఉదయం 8 గంటల 16 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు అఖిలేశ్‌ యాదవ్‌ వెల్లడించారు. ములాయం గౌరవార్థం, యూపీ ప్రభుత్వం మూడు రోజులు సంతాప దినాలు ప్రకటించింది. అధికారిక లాంఛనాలతో ‘నేతాజీ’ అంత్యక్రియలు జరుపుతామని పేర్కొంది. ములాయం పార్థివ దేహం స్వగ్రామమైన ఇటావాలోని సైఫయికి చేరుకుంది. అక్కడే మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు  సమాజ్‌వాదీ పార్టీ తెలిపింది.

3 సార్లు సీఎం.. 10 సార్లు ఎమ్మెల్యే

1939 నవంబర్‌ 22న ఇటావాలోని సైఫయి గ్రామంలో జన్మించిన ములాయంసింగ్‌.. సోషలిస్టు నేత రామ్‌మనోహర్‌ లోహియా భావాలకు ఆకర్షితులై రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1967లో తొలిసారి ఆయన యూపీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో 19 నెలలు జైల్లో ఉన్నారు. 1989లో తొలిసారి యూపీ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. 1992లో సమాజ్‌వాదీ పార్టీ పేరుతో సొంతంగా రాజకీయ పార్టీని స్థాపించారు. తన రాజకీయ జీవితంలో మొత్తంగా 10 సార్లు ఎమ్మెల్యే, 7 సార్లు లోక్‌సభ సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు. మూడు పర్యాయాలు యూపీ ముఖ్యమంత్రి (1989-91, 1993-95, 2003-07)గా వ్యవహరించారు. కేంద్ర ప్రభుత్వంలో రక్షణశాఖ మంత్రి(1996-98)గానూ ఉన్నారు.

ఓ శకం ముగిసింది

ములాయం సింగ్‌ యాదవ్‌ మృతి పట్ల ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఓ శకం ముగిసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ములాయం సింగ్‌ భూమి పుత్రుడని, ఆయన మరణం దేశానికి తీరని లోటని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ‘నేతాజీ’తో తన బంధాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేసుకున్నారు. ములాయం యూపీ సీఎంగా, తాను గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేకసార్లు కలిశామని, ఆ తర్వాత కూడా తమ బంధం కొనసాగిందని చెప్పారు. లోహియా, జయప్రకాశ్‌ నారాయణ్‌ ఆశయాల కోసం జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తిగా ములాయంను ప్రధాని కొనియాడారు.

* సోషలిస్టు ఆలోచనల గొంతుక మూగబోయిందని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ పేర్కొన్నారు. ‘భారత్‌ జోడో యాత్ర’లో ములాయంకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ నివాళులు అర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు.

* కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, అమిత్‌ షా, మాజీ ప్రధానులు మన్మోహన్‌సింగ్‌, దేవెగౌడ, భాజపా సీనియర్‌ నేత ఎల్‌.కె.ఆడ్వాణీ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, వివిధ పార్టీల నేతలు, రాష్ట్రాల సీఎంలు, ప్రముఖులు ములాయం మృతికి సంతాపం వ్యక్తంచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని