CM Jagan: టెక్కలి అభ్యర్థి దువ్వాడ శ్రీనివాసే

‘టెక్కలి నియోజకవర్గానికి వచ్చే ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి దువ్వాడ శ్రీనివాసే.. అందరూ కలిసికట్టుగా పనిచేసి, ఆయన్ను గెలిపించుకు రావాలి’ అని వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ టెక్కలి నియోజకవర్గ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలకు స్పష్టం చెప్పారు.

Updated : 27 Oct 2022 10:35 IST

కులాలు, కుమ్ములాటలు పక్కనపెట్టి గెలిపించాలన్న సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: ‘టెక్కలి నియోజకవర్గానికి వచ్చే ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి దువ్వాడ శ్రీనివాసే.. అందరూ కలిసికట్టుగా పనిచేసి, ఆయన్ను గెలిపించుకు రావాలి’ అని వైకాపా అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ టెక్కలి నియోజకవర్గ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలకు స్పష్టం చెప్పారు. అయితే వారిలో కొంతమంది ఈ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘శ్రీనివాస్‌ అయితే గెలవడం కష్టం. ఆయన పార్టీలో ఎవరినీ కలుపుకొని వెళ్లరు. పార్టీ శ్రేణులను ఇబ్బంది పెడుతున్నారు కూడా’ అని సీఎం ముందే అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. దీనికి సీఎం స్పందిస్తూ.. ‘కుటుంబం అన్నాక ఇలాంటివి సహజం. కులాలు, కుమ్ములాటలన్నీ పక్కన పెట్టి, అందరూ కలిసి పనిచేసి శ్రీనును గెలిపించుకు రండి. మీ అందరికీ తగిన న్యాయం జరుగుతుంది’ అని అన్నట్లు తెలిసింది. బుధవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో టెక్కలి నియోజకవర్గ సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకూ జరిగిన నియోజకవర్గాల భేటీలన్నింటి కంటే సుదీర్ఘంగా దాదాపు రెండున్నర గంటలకు పైగా ఈ సమావేశం జరగడం గమనార్హం.

ఎమ్మెల్సీ కావాలంటే శ్రీనును గెలిపించుకురా.. తిలక్‌కు సీఎం ఆఫర్‌

‘శ్రీనును ఎమ్మెల్యేగా గెలిపించుకు వస్తే ఆయన ఎమ్మెల్సీ పదవిని నీకు ఇస్తా. మీరంతా కలిసి పని చేయకపోవడం వల్ల శ్రీను ఓడిపోతే, ఆయన ఎమ్మెల్సీ పదవి కొనసాగించాలంటాడు. కాబట్టి నీకు ఎమ్మెల్సీ పదవి కావాలనుకుంటే శ్రీనును ఎమ్మెల్యేను చెయ్‌’ అని టెక్కలిలో గతంలో వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన, ప్రస్తుత కాళింగ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పేరాడ తిలక్‌కు ముఖ్యమంత్రి జగన్‌ చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. అదే నియోజకవర్గ టికెట్‌ ఆశిస్తున్న కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి కూడా సమావేశంలో పాల్గొన్నారు. దువ్వాడకు మద్దతివ్వాలని ఆమెకు కూడా సీఎం చెప్పారు. గ్రూపులు, కుమ్ములాటలు ఉన్నప్పుడు తనకు టికెట్‌ వస్తుందా రాదా అన్న అభద్రతా భావన ఉంటుందనే శ్రీనివాస్‌ పేరును ఇప్పుడే ఖరారు చేశాను.. మీరంతా ఆయనకు మద్దతివ్వాలని జగన్‌ స్పష్టం చేశారు.

టెక్కలి నాకు ప్రతిష్ఠాత్మకం

‘టెక్కలి నాకు ప్రతిష్ఠాత్మకం. అక్కడున్నది తెదేపా ఎమ్మెల్యే. ఆ మనిషి గురించి మీకు నేను కొత్తగా చెప్పేదేం ఉంటుంది? ఇప్పటికే ఆ నియోజకవర్గంలో 136లో 119 పంచాయతీలను, 78కి 74 ఎంపీటీసీ స్థానాలను, 4కి 4 ఎంపీపీ, జడ్పీటీసీ పదవులను గెలిచాం. అక్కడ మార్పు ఇంత స్పష్టంగా కనిపిస్తోంది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే గెలవాలి. మీలో గొడవలుంటే ఇన్‌ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణతో మాట్లాడండి. ఆయన మీకు అవసరమైన సహకారం అందిస్తారు’ అని సీఎం వారికి చెప్పినట్లు తెలిసింది. 

ఈ ఎన్నికల్లో గెలిస్తే 30 ఏళ్లు మనమే

‘మనలో మనకు ఎన్ని గొడవలున్నా పక్కన పెడదాం. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే వచ్చే 30 ఏళ్ల వరకు మనం ఉంటాం. కాబట్టి అందరం ఒక్కటై ముందుకెళ్లాలి’ అని ముఖ్యమంత్రి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని