సర్కారు కాలయాపనతోనే అటవీ అధికారి హత్య

ప్రభుత్వ వైఫల్యం వల్లే ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి శ్రీనివాసరావు ప్రాణాలు కోల్పోయారని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష(సీఎల్పీ) నేత భట్టివిక్రమార్క ఆరోపించారు.

Published : 25 Nov 2022 04:12 IST

సీఎల్పీ నేత భట్టివిక్రమార్క ఆరోపణ

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వ వైఫల్యం వల్లే ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి శ్రీనివాసరావు ప్రాణాలు కోల్పోయారని కాంగ్రెస్‌ శాసనసభాపక్ష(సీఎల్పీ) నేత భట్టివిక్రమార్క ఆరోపించారు. పోడు భూముల సమస్య పరిష్కరించకుండా 8 సంవత్సరాలుగా ప్రభుత్వం నాన్చుడు ధోరణితో కాలయాపన చేయడం వల్లే ఇలాంటి అనర్థాలు చోటు చేసుకుంటున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి వారి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గురువారం ఆయన అసెంబ్లీ మీడియాహాలులో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేయకపోగా, పోడు సాగు చేసుకుంటున్న వారి నుంచి ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుంటోందన్నారు. ధరణి వల్ల పార్ట్‌-బిలో ఉన్న రైతులు భూమిపై హక్కులు లేవన్న భయంతో ఆందోళన చెందుతున్నారన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి దశల వారీ ఉద్యమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. పాలకుల వైఫల్యాలు, సమస్యలు చర్చకు రాకుండా ఉండటానికి ఈడీ, ఐటీ, ఏసీబీ పేరిట పరస్పర దాడులతో కుట్ర పూరితంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని భట్టి విమర్శించారు. దాడులు లేని రోజుల్లో ఇరు పార్టీల నాయకులు సభ్యసమాజం తలదించుకునేలా పరస్పరం తిట్టుకుంటున్నారన్నారు. గాంధీని చంపిన గాడ్సే పార్టీ భాజపా అని పలుమార్లు విమర్శించిన మర్రి శశిధర్‌రెడ్డి ఆ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకోవడాన్ని, పార్టీ నాయకత్వంపై ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని