జోడో యాత్రలో రెండోరోజూ ప్రియాంక

రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్‌ జోడో యాత్రలో ఆయన సోదరి, కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా వరుసగా రెండో రోజూ పాల్గొన్నారు.

Updated : 26 Nov 2022 05:40 IST

రాహుల్‌తో కలిసి నడిచిన రాబర్ట్‌ వాద్రా, రెహాన్‌

ఖేర్దా: రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న భారత్‌ జోడో యాత్రలో ఆయన సోదరి, కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా వరుసగా రెండో రోజూ పాల్గొన్నారు. ప్రియాంక భర్త రాబర్ట్‌ వాద్రా, వారి కుమారుడు రెహాన్‌ కూడా రాహుల్‌తో కలిసి నడిచారు. మధ్యప్రదేశ్‌లో రాహుల్‌ పాదయాత్ర శుక్రవారం మూడో రోజు ఖర్గోన్‌ జిల్లాలోని ఖేర్దా గ్రామం నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రియాంక గురువారం నుంచి పాల్గొంటున్నారు.

‘యాత్రను అప్రతిష్ఠపాలు చేయాలని భాజపా కుట్ర’

ఖర్గోన్‌: మధ్యప్రదేశ్‌లో కొనసాగుతున్న జోడో యాత్రలో ‘పాకిస్థాన్‌ జిందాబాద్‌’ అనే నినాదాలు చేశారని భాజపా ఐటీ విభాగం అధినేత అమిత్‌ మాలవియా పోస్టు చేసిన 21 సెకండ్ల వీడియో నకిలీదని శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. ఆ వీడియోలో.. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక, మధ్యప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్‌ యాత్రలో నడుస్తుండగా ‘పాకిస్థాన్‌ జిందాబాద్‌’ అనే నినాదాలు వినిపిస్తున్నాయి. ‘యాత్రలో చేరాలని నటి రిచా చద్దా పిలుపునిస్తున్న క్రమంలో చివర్లో ‘పాకిస్థాన్‌ జిందాబాద్‌’ నినాదాలు వినిపించాయి. ఆ పార్టీ మధ్యప్రదేశ్‌ ఇన్‌ఛార్జి ఈ వీడియోను పోస్టు చేసి.. ఆ తర్వాత గుర్తించి తొలగించారు. ఇదీ కాంగ్రెస్‌ అసలు స్వరూపం’ అంటూ మాలవీయా ట్వీట్‌ చేశారు. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరామ్‌ రమేశ్‌ తిప్పికొట్టారు. యాత్రను అప్రతిష్ఠపాలు చేసేందుకు భాజపాకు చెందిన ప్రత్యేక విభాగం ఇలాంటి కుట్రలు చేస్తోందని ఆరోపించారు.


గహ్లోత్‌, పైలట్‌ వివాదాన్నిపరిష్కరిస్తాం: జైరామ్‌ రమేశ్‌

రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ ముఖ్య నేతలు సీఎం అశోక్‌ గహ్లోత్‌, సచిన్‌ పైలట్‌ మధ్య తలెత్తిన వివాదాన్ని సముచిత రీతిలో పరిష్కరిస్తామని పార్టీ మీడియా ఇన్‌ఛార్జి జైరామ్‌ రమేశ్‌ తెలిపారు. వ్యక్తులకు కాకుండా సంస్థాగత ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చేలా పరిష్కారం ఉంటుందన్నారు. సచిన్‌ పైలట్‌ను ద్రోహి అని గురువారం ఓ టీవీ ఇంటర్వ్యూలో గహ్లోత్‌ అనూహ్యంగా నిందించారని రమేశ్‌ పేర్కొన్నారు. పార్టీకి ఇద్దరు నేతలూ అవసరమేనని తెలిపారు. వారి మధ్యనున్న విభేదాలను సమసిపోయేలా చేయగలమన్న విశ్వాసం వ్యక్తం చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని